8, నవంబర్ 2018, గురువారం

ప్రయాణం

పూర్వం ఒక అమాయకుడు సాయంత్రం ఆరు గంటలకు పొరుగూరికి బయలుదేరాడు. చీకటి గనుక లాంతరు, అగ్గిపెట్టె వెంట తీసుకెళ్ళాడు. బాగా చీకటి పడడంతో దారి కనిపించడం లేదు. అందుకే లాంతరు వెలిగించాడు. వెంటనే ఏదో ఒక ఆలోచన వచ్చి చతికిలబడి కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడు. దారిలో వస్తున్న బాటసారి "ఎందుకయ్యా ఏడుస్తున్నావ్" అన్నాడు. "బాబూ ఏమని చెప్పేది..... నేను నాలుగు మైళ్ళు ఈ చీకట్లో పోవాలి... ఈ లాంతరు వెలిగిస్తే పది గజాల దూరం కన్నా ఎక్కువ కాంతి పడడం లేదు. ఎక్కడి నాలుగుమైళ్ళు? ఎక్కడి పది గజాలు? ఈ పది గజాలు దాటితే ఆ కటిక చీకట్లో ఎలా ప్రయాణిస్తాను?" అన్నాడు.
 అతడి వెర్రికి నవ్వుకుంటూ.... "ఓరి వెర్రివాడా! లేచి లాంతరు పట్టుకొని నడక సాగించు.... నీవు ఎంతదూరం వెళ్ళినా ఈ పది గజాల దూరం కాంతి పడుతూనే వుంటుంది.... నాలుగు మైళ్ళు కాదు.... నలభై మైళ్ళు అయినా వెళ్ళవచ్చు" అన్నాడు. దానితో అతడు ప్రయాణం సాగించి గమ్యాన్ని చేరుకున్నాడు.
 అలాగే మనం శాస్త్ర శ్రవణం ద్వారా ఆత్మను గురించి తెలుసుకొని ఆ ఆత్మను నేనేనని తెలుసుకొని ఆత్మధ్యాన సాధన కొనసాగించాలి. అలా నిత్యం సాధన చేయగా, చేయగా గమ్యంవైపు.... ఆత్మవైపు...... "స్వస్ధితి" వైపు ప్రయాణం సాగుతుంది. ఒకనాటికి ఆత్మతో ఏకమై ఆత్మగా వుండిపోవడం జరుగుతుంది. అలాగాక నిరాశతో కూర్చుంటే ఏనాటికీ గమ్యం చేరుకోలేం. నడక సాగిస్తే చాలు.... చీమ కూడా వేలమైళ్ళు ప్రయాణిస్తుంది... కదలకుండా కూర్చుంటే గరుత్మంతుడైనా సరే ఒక్క అడుగు ముందుకు వేయలేడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి