9, జులై 2024, మంగళవారం

బీబీ నాంచారమ్మ:

 

బీబీ నాంచారమ్మ: 

🌻🪷🥥🌸🍓🍌🌼🌺🍎🍈

ఒక దేవుడిని పూజించేవారందరూ కలిసి తమని తాము ఒకే మతంగా భావించుకోవచ్చు. కానీ సాక్షాత్తూ ఆ భగవంతుని కులం ఏది అని అడిగితే ఏమని చెప్పగలం! ఆద్యంత రహితుడికి కులమతాలను ఆపాదించలేం కదా! దానిని నిరూపించే ప్రమాణమే బీబీ నాంచారమ్మ! 


నాచియార్ అనే తమిళ పదం నుంచి నాంచారమ్మ అన్న పేరు వచ్చిందని చెబుతారు. అంటే భక్తురాలు అని అర్థమట.


ఇక బీబీ అంటే భార్య అని అర్థం. బీబీ నాంచారమ్మ గాథ ఈనాటిది కాదు. కనీసం ఏడు వందల సంవత్సరాల నుంచి ఈమె కథ జనపదంలో నిలిచి ఉంది.


కొన్ని కథల ప్రకారం బీబీ నాంచారమ్మ, మాలిక్ కాఫిర్ అనే సేనాని కుమార్తె. ఆమె అసలు పేరు సురతాని. స్వతహాగా హిందువైన మాలిక్ కాఫిర్, అల్లాఉద్దీన్ ఖిల్జీకి సేనానిగా మారి తాను కూడా ముస్లిం మతాన్ని స్వీకరించాడు. తన రాజ్యాన్ని విస్తరించే బాధ్యతను ఖిల్జీ, మాలిక్ కాఫిర్ మీద ఉంచాడు. 


దాంతో మాలిక్ కాఫిర్ దక్షిణ భారతదేశం మీదకి విరుచుకుపడ్డాడు. తమ దండయాత్రలో భాగంగా మాలిక్, శ్రీరంగాన్ని చేరుకున్నాడు. అతను శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుని ఆలయం, భక్తులు సమర్పించిన కానుకలతో ధగధగలాడిపోతోంది. పంచలోహాలతో రూపొందించిన ఆయన ఉత్సవమూర్తిని చూసిన కాఫిర్ కళ్లు చెదిరిపోయాయి.


అలాంటి విగ్రహాలను కరింగిస్తే ఎంత ధనం సమకూరుతుందో కదా అనుకున్నాడు. అలా తన దండయాత్రలో దోచుకున్న వందలాది విగ్రహాలలోకి రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకుని దిల్లీకి బయలుదేరాడు. దిల్లీకి చేరుకున్న తరువాత తాను దోచుకున్న సొత్తుని తన కుటుంబం ముందర గొప్పగా ప్రదర్శించాడు మాలిక్. వాటన్నింటి మధ్యా శోభాయమానంగా వెలిగిపోతున్న రంగనాథుని విగ్రహాన్ని చూసిన అతని కూతురు, తనకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని తండ్రిని అడిగింది.


ఆ విగ్రహం తనచేతికి అందిందే తడవుగా, దాన్ని తన తోడుగా భావించసాగింది. విగ్రహానికి అభిషేకం చేయడం, పట్టు వస్త్రాలతో అలంకరించడం, ఊయల ఊపడం... అలా తనకు తెలయకుండానే ఒక ఉత్సవ మూర్తికి చేసే కైంకర్యాలన్నింటినీ ఆ విగ్రహానికి అందించసాగింది. 


ఆ విగ్రహంతో ఒకో రోజూ గడుస్తున్న కొద్దీ దాని మీదే సురతాని మనసు లగ్నం కాసాగింది. మరో పక్క రంగనాథుని ఉత్సవ మూర్తి లేని శ్రీరంగం వెలవెలబోయింది. దండయాత్రలో చనిపోయిన కుటుంబాలు ఎంతగా బాధపడ్డాయో, రంగనాథుని విగ్రహం కోల్పోయిన భక్తులూ అంతే బాధలో మునిగిపోయారు. 


చివరకి వారంతా ధైర్యం చేసి ఆ మాలిక్ కాఫిర్నే వేడుకునేందుకు దిల్లీకి ప్రయాణమయ్యారు. సాక్షాత్తూ ఆ రామానుజాచార్యులే వారికి ప్రాతినిధ్యం వహించారని చెబుతారు.


రంగనాథుని ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ తన ఆస్థానాన్ని చేరుకున్న అర్చకులను చూసి మాలిక్ కాఫిర్ మనసు కరిగిపోయింది. ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకువెళ్లేందుకు సంతోషంగా అనుమతిని అందించాడు. అయితే ఆపాటికే రంగనాథుని మీద మనసుపడిన సురతాని గురించి విన్న అర్చకులు, ఆమె ఆదమరిచి నిదురించే సమయంలో ఆ విగ్రహాన్ని ఊరు దాటించారు. సురతాని ఉదయాన్నే లేచి చూస్తే ఏముంది! తన కలల ప్రతిరూపం కనుమరుగైంది. 


ఎవరు ఎంత ఒదార్చినా సురతాని మనసు శాంతించలేదు. ఆ విష్ణుమూర్తినే తన పతిగా ఎంచుకున్నానని కరాఖండిగా చెప్పేసింది. ఆ విగ్రహాన్ని వెతుకుతూ తాను కూడా శ్రీరంగానికి పయనమైంది. శ్రీరంగం చేరుకున్న సురతాని ఆ రంగనాథునిలో ఐక్యమైందని చెబుతారు. ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని చూడవచ్చు.


మరికొన్ని గాథల ప్రకారం ఆ విగ్రహం రంగనాథునిది కాదు. మెల్కోటే (కర్నాటక)లో ఉన్న తిరునారాయణునిది అని చెబుతారు. 


దానికి సాక్ష్యంగా ఇక్కడి ఆలయంలో కూడా బీబీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తుంది. ఇంకొందరు భూదేవి అవతారమే బీబీ నాంచారమ్మ అని నమ్ముతారు. కలియుగదైవమైన వేంకటేశ్వరునికి తోడుగా నిలిచేందుకు ఆమె కూడా అవతరించిందని భక్తుల విశ్వాసం. అందుకనే తిరుపతిలోనూ బీబీనాంచారమ్మ విగ్రహం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా ఆమె ముసల్మాను స్త్రీ అన్న విషయంలో మాత్రం ఎలాంటి వివాదమూ లేదు. 


ఎందుకంటే తుళుక్క నాచియార్ అంటే తమిళంలో తురష్క భక్తురాలు అని అర్థం. బీబీ నాంచారమ్మను చాలామంది ముసల్మానులు సైతం వేంకటేశ్వరునికి సతిగా భావిస్తారు. కర్నాటకను హైదర్ఆలీ అనే రాజు పాలించే కాలంలో, అతను ఓసారి తిరుమల మీదకు దండయాత్రకు వచ్చాడట. అయితే ఆ ఆలయం ఒక ముస్లిం ఆడపడుచును సైతం అక్కున చేర్చుకుందన్న విషయాన్ని తెలుసుకుని వెనుతిరిగాడట. ఇదీ బీబీ నాంచారమ్మ కథ .


ఓం నమో వేంకటేశాయ 🙏🙏

తరిగొండ వెంమాంబ:

 

తరిగొండ వెంమాంబ:


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రాభవాన్ని లోకానికి చాటిన భక్తుల్లో శ్రీమాన్ తాళ్లపాక అన్నమయ్య తరువాత చెప్పుకోదగిన వారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. ఈమె జీవితం మొత్తాన్ని స్వామివారి సేవలోనే గడిపారు. వివాహం జరిగి వైధవ్యం పొందినా శ్రీవారినే తన భర్తగా ప్రకటించి ముత్తయిదువుగా ఉండేవారు. యోగినిగా, భక్త కవయిత్రిగా వెంగమాంబ చరిత్రలో సాహితీ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

 

తరిగొండ వెంగమాంబకు సుమారుగా 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తిరుమల శ్రీవారి కొలువుకు చేరినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అంతవరకు ఎన్నో ఒడిదుడుకులకు లోనైన వెంగమాంబకు తిరుమల వాతావరణం మరో లోకంలా అనిపించింది. ఊహ తెలిసినప్పటి నుండి శ్రీ వేంకటేశ్వరస్వామివారినే సర్వస్వంగా భావించిన ఆమెకు స్వామివారి సన్నిధికి చేరడం పరమానందం కలిగించింది. అప్పటికే వెంగమాంబకు బాల్య వివాహమైంది. ఆమె భర్త ఇంజేటి వేంకటాచలపతి మానసిక వ్యధతో అప్పటికే మరణించారు.

 

తిరుమలకు చేరుకున్న వెంగమాంబ ప్రతిరోజూ మొదట వరాహస్వామివారి దర్శనం చేసుకుని తరువాత శ్రీవారి దర్శనానికి వెళ్లి ప్రార్థన చేసేవారు. రోజంతా ఆలయం వద్దే ఉండేవారు. సాయంత్రం అయ్యేసరికి అప్పట్లో ఉన్న వెయ్యి కాళ్ల మండపానికి చేరుకునేవారు. అక్కడ యోగం చేస్తూ, స్వామివారిపై పాటలు పాడుతూ ఉండేవారు. ఒకసారి యోగనిద్రలో ఉండగా ”అలమేలుమంగ అనుమతి..” అంటూ ఆమె చెవుల్లో మారుమోగింది. సాక్షాత్తు స్వామివారే ఈ పలుకులు పలికారని ఆమె గ్రహించారు. వెంటనే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థించి ఆశీస్సులు అందుకున్నారు.

 

అమ్మవారి ప్రోద్బలంతోనే అప్పట్లో హథీరాంజీ మఠాధిపతిగా ఉన్న ఆత్మారాం దాస్జి శ్రీవారి భక్తురాలైన వెంగమాంబకు తిరుమలలో ఆశ్రయం కల్పించారు. రాంభగీచా తోటల్లోని ఒక పూరిల్లును వెంగమాంబకు కేటాయించారు. వరవెచ్చం(ఒకరికి నెలకు సరిపడా బియ్యం, పప్పు, ఇతర వంటదినుసులు) పంపేవారు. ఇంటికి ఎదురుగా ఒక చింత చెట్టు ఉండేది. ఇంటి పరిసరాల్లో తులసి మొక్కలను పెంచి ప్రతిరోజూ స్వామివారికి తులసిమాలలు సమర్పించేవారు. హయగ్రీవ ఆలయానికి వెళ్లి ధ్యానం చేసేవారు. ఈ పూరిల్లు ఉన్న స్థానంలోనే ప్రస్తుతం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద కేంద్రాన్ని తితిదే నిర్మించింది.

 

ఆ తరువాత అన్నమాచార్య వంశీయుల ఆహ్వానం మేరకు వారి మిద్దె ఇంటికి చేరారు. అక్కడ అన్నమయ్య వంశీయుల సాహిత్యాన్ని పూర్తిగా చదివి అవగాహన చేసుకున్నారు. కాగా అన్నమయ్య వంశీకుల ఇంటి పక్కన బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ నియమించిన సర్కారు అర్చకుడు అక్కారాం వెంకటరామ దీక్షితులు ఉండేవారు. ఈయన వెంగమాంబను సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురి చేసేవారు. ఈ క్రమంలో వెంగమాంబ ఎవ్వరికీ కనిపించకుండా శేషాచల అభయారణ్యంలోని తుంబురుకోనకు వెళ్లిపోయారు. అక్కడ వెంగమాంబ గవి అనే ప్రాంతంలో ఐదేళ్లు తపస్సు చేశారు. తిరుమలలో వెంగమాంబ కనిపించకపోవడంతో అందరూ ఈ ప్రాంతం వదిలి వెళ్లిపోయిందని భావించారు.

 

అనంతరం జరిగిన పరిణామాల తరువాత అప్పటి మహంతు తుంబురుకోనకు చేరుకుని వెంగమాంబను తిరిగి తిరుమలకు ఆహ్వానించాడు. ఇది స్వామివారి అనుగ్రహంగానే భావించిన వెంగమాంబ తిరిగి వచ్చేశారు. తాళ్లపాక వంశీయుల ఇంటి పక్కనే వెంగమాంబకు మహంతు ఇల్లు కేటాయించారు. అప్పటికే వెంగమాంబ యోగినిగా, భక్త కవయిత్రిగా ప్రసిద్ధి చెందారు. అప్పటికి కొన్ని గ్రంథాలను కూడా రచించారు.

 

ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నృసింహ జయంతిని పురస్కరించుకుని పది రోజుల పాటు తిరుమలకు వచ్చే భక్తులకు వెంగమాంబ అన్నదానం చేసేవారు. అప్పటి గోల్కొండ నుండి తమిళనాడులోని దిండిగల్ వరకు ఉన్న ఆంధ్రులు తిరుమల సందర్శనకు వచ్చినపుడు అన్నదానం నిమిత్తం వెంగమాంబకు దానపత్రాలు రాసిచ్చారు. ఇప్పటికీ 30 నుండి 40 వరకు దానపత్రాలున్నాయి. అంతేగాక అప్పటి సంస్థానాధీశులు, జమిందార్లు, పాళెగాళ్లు, సామాన్య ముస్లిం సోదరులు అన్నదానానికి విరాళాలు ఇచ్చేవారు. ఈ విధంగా నిరంతరం శ్రీవారి భక్తులకు అన్నదానం చేయడం వల్ల వెంగమాంబ ”మాతృశ్రీ” అయ్యారు.

 

ఇక స్వామివారి సన్నిధిలో వెంగమాంబ ప్రవేశపెట్టిన ముత్యాలహారతికి ఎంతో విశిష్టత ఉంది. ప్రతిరోజు శ్రీవారి ఆలయంలో ఏకాంత సేవలో ఈమె హారతి ఇచ్చేవారు. ఇందుకు అభ్యంతరం ఎదురుకావడంతో ఒకరోజు ఇంటి వద్దనే స్వామివారికి హారతి ఇచ్చి తృప్తి చెందారు. మరుసటి రోజు శ్రీవారికి రథోత్సవం నిర్వహించగా వెంగమాంబ ఇంటి వద్దకు వచ్చేసరికి రథం ఆగిపోయింది. విషయాన్ని గుర్తించిన మహంతు హారతి ఇవ్వాలని వెంగమాంబను ప్రార్థించాడు. ఆమె హారతి ఇవ్వడంతో అక్కడినుండి రథం కదిలింది. 


అప్పటినుండి శ్రీవారి ఆలయంలో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ తదితర అవతారాలను పళ్లెంలో వెండి ముత్యాలతో తీర్చిదిద్ది  హారతి ఇచ్చేవారు. అనంతరం ”తాళ్లపాకవారి లాలిపాట.. వెంగమాంబ ముత్యాలహారతి” అని ప్రసిద్ధి చెందింది.అప్పటికే శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసేందుకు పలు రచనలు చేసిన వెంగమాంబ వద్ద ”అష్టఘంటములు” అనే 8 మంది ఉండేవారు. వీరు ఈమె రచనలను కాపీలుగా రాసి పండితులు, భాగవతులు లాంటివారు అడిగినపుడు ఇచ్చేవారు. వెంగమాంబ తన రచనలన్నింటినీ బృందావనంలో చేసేవారు. శిష్యులు కూడా అక్కడే ఉండి ఆమె వద్ద యోగం, సాహిత్యం తదితర విషయాలను అభ్యసించేవారు. 1730వ సంవత్సరనలజ  వెంగమాంబ రాఘవేంద్రస్వామి, వీరబ్రహ్మేంద్రస్వామివారి లాగా తన బృందావనంలోనే 1817లో సజీవ సమాధి చెందారు. వెంగమాంబ తిరుమలకు చేరినప్పటి నుండి  పాలనను చూశారు. వీరిలో ఆత్మారాందాస్, హరిరాందాస్,  గోవర్ధనరాందాస్ ఉన్నారు.

 

తరిగొండ వెంగమాంబకు శ్రీ వేంకటేశ్ర స్వామివారితో భక్తియుక్తమైన సంబంధం ఉందనడానికి ఆమె చరిత్రలో పేర్కొన్న రెండు సంఘటనలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.


 వెంగమాంబ ఇంటి వద్ద నిలిచిపోయిన స్వామివారి రథం ఆమె హారతి ఇవ్వగానే కదిలింది. 


మరో ఘటనలో ఒకసారి స్వామివారు ఏకాంత సేవ అనంతరం వెంగమాంబ ఇంట్లో ప్రత్యక్షమయ్యారట.

  కొంత సమయం తరువాత తిరిగి వెళుతుండగా వెంగమాంబ ”కొంతసేపు ఆగండి స్వామి..” అంటూ మెడపై గల పట్టు ఉత్తరీయం పట్టుకున్నారట. స్వామివారు వెళ్లిపోవడంతో సగభాగం వెంగమాంబ వద్దనే ఉండిపోయిందట. ఉదయం సుప్రభాతం సమయంలో అర్చకులు ఈ విషయాన్ని గుర్తించి మహంతుకు తెలిపారట. మహంతు వెంగమాంబ ఇంటి వద్దకు వెళ్లి చూడగా సగ భాగం ఉన్న ఉత్తరీయం పూర్తి వస్త్రంగా కనిపించిందట.🪷🥥🌸🍌🌼🌺🌻🍅


 ఓం నమో వేంకటేశాయ .🙏🙏

🙏విష్ణు సాలగ్రామం విశిష్టత ఏంటి? సాలగ్రామాలు ఎన్ని రకాలు ఉన్నాయి?🙏

 🙏విష్ణు సాలగ్రామం విశిష్టత ఏంటి? సాలగ్రామాలు ఎన్ని రకాలు ఉన్నాయి?🙏

ఎంతో పవిత్రమైన సాలగ్రామం గురించి మీకు తెలుసా? అవి ఎన్ని రకాలు? ఎటువంటి సాలగ్రామాలని పూజిస్తే ఎటువంటి ఫలితం దక్కుతుందో తెలుసుకుందాం


సాలగ్రామము విష్ణు ప్రతీకమైన ఒక శిలా విశేషము. సర్వకాల సర్వావస్థలయందు విష్ణువు సాక్షాతూ సాన్నిధ్యం కలిగి ఉండేది సాలగ్రామంలో మాత్రమే. అందుకే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలో గానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామాలని పూజకు ఉపయోగిస్తారు. త్రిమతాచార్యులు తమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.


దేవాలయాలలో పంచాయతన మూర్తులకు శిలాప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి, స్వర్ణ నిర్మితమైన మూర్తులు, సాలగ్రామములు ఉంటాయి. సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి. సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు. హిందువులందరికీ తులసి, శంఖం, సాలగ్రామం పూజనీయమైనవి. తులసి హిందువుల ఇహపర సాధనానికి భూలోకంలో అవతరించిన వనదేవత. ఈ తులసి అపూర్వమైన మూలిక కూడా. శంఖం అత్యంత పవిత్రమైనది.

సాలగ్రామం విశిష్టత.. 

శంఖారావం వ్యాపించినంత దూరం సూక్ష్మక్రిములు నశిస్తాయి అంటారు. నీరు శంఖంలో పూరిస్తే తీర్ధం అవుతుంది. వట్టివేళ్ళు, ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం మొదలైన సుగంధ ద్రవ్యాలు చేర్చిన నీటిని శంఖంలో పోసుకుంటూ సాలగ్రామాలకు పురుషసూక్తం పఠిస్తూ అభిషేకం చేసిన తీర్ధం సర్వశక్తివంతం. ఇటువంటి తీర్ధాన్ని భక్తితో సేవిస్తే ప్రాయశ్చిత్తం, పాపక్షయం కలుగుతుంది. 

తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. మొదటిది కాయసిద్ధి కొరకు, రెండవది ధర్మసాధనకు, మూడవది మోక్షం పొందడానికి. తీర్థం తీసుకోవడం వల్ల అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయం కలుగుతాయి. సాలగ్రామాలు ఉన్న ఇల్లు గొప్ప పుణ్యక్షేత్రంతో సమానం. సాలగ్రామ దర్శనం, స్పృశించడం, అర్చన చేయడం వల్ల అంతులేని పుణ్యం లఖిస్తుంది.


సాలగ్రామాలు శిలాజాలు. ఆలి అనే ఒక విధమైన మత్స్యం శీతాకాలంలో తన శరీరం నుంచి వెలువడే ఒక విధమైన రసాయనిక పదార్ధంతో శిలామయమైన కవచాన్ని నిర్మించుకుని దానిలో నివశిస్తుందని అది మరణించినప్పుడు లేక వదిలి వెళ్ళినప్పుడు అవి సాలగ్రామాలుగా మనకు లభిస్తాయని అంటారు. సాలగ్రామాల మీద వివిధ దేవతా చిహ్నాలు ఉంటాయి. ముఖ్యంగా చక్రం, పద్మం ప్రధాన చిహ్నాలు. విష్ణు భక్తులైన మాధ్యులకు, వైష్ణవులకు ఇవి పూజకు ఎంతో విలువైనవి. వైష్ణవ పురాణాలు వీటి గురించి వివరిస్తాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

సాలగ్రామం ఎలా వచ్చాయంటే.. 

పూర్వం విదేహరాజ్యంలో ప్రియంవద అనే స్త్రీమూర్తి ఉండేది. అత్యంత రూపవతి, గుణవతి అయిన ఆమె శ్రీమన్నారాయణుని ప్రసన్నం చేసుకుని ఆయన తన కుమారునిగా జన్మించాలని కోరుకుంటుంది. ఆమె కోరికను మన్నించిన స్వామివారు మరుజన్మలో ఆమె గండకీ నది రూపాన్ని ధరించేటట్టుగా చేశారు. వారికి తాము సాల గ్రామ రూపంలో ఆ నది నుంచి ఉద్భవిస్తున్నట్టుగా కథ ఉంటుంది. సాలగ్రామ శిలయందు, చరాచరాత్మకమగు మూడు లోకాలు అణిగి ఉన్నాయి. 

సాలగ్రామాన్ని భక్తిశద్ధలతో, పరిపూర్ణ విశ్వాసంతో, శాస్త్ర ప్రకారం అభిషేకిస్తే కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యఫలానికి సమానమవుతుంది. కోటి గోవులను దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు. సాలగ్రామ పూజచే శివకేశవులని పూజించిన ఫలితం కలుగుతుంది. సాలగ్రామం ఉన్న ప్రదేశాలలో స్నానం చేసినా, దానం చేసినా, కాశీ క్షేత్రంలో చేసే పవిత్ర గంగానదీ స్నానంకంటే, ఆ పుణ్యక్షేత్రంలో చేసిన దానం కంటే నూరురెట్లు అధిక ఫలము కలుగుతుంది. సాలగ్రామమును అభిషేకించిన పుణ్య బలాలను ప్రోక్షించుకొనినచో, సర్వపాపాలను నశింపజేస్తుంది.


సాలగ్రామాన్ని పూజిస్తే కలిగే ఫలితం ఇదే.. 

సర్వరోగాలు తొలగిపోతాయి. సకల సంపదలు కలుగుతాయి. సర్వశుభాలను కలిగించడంతో పాటి మోక్షం ప్రాప్తిస్తుంది. సాలగ్రామాన్ని అభిషేకించిన జలాలను ప్రోక్షించుకున్న, పవిత్ర గంగానదీ స్నానమాచరించిన యెడల సర్వ తీర్థాలలో స్నానమాచరించిన పుణ్యఫలం కలుగుతుంది. సర్వదేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఒక్కసారి భక్తిశద్ధలతో సాలగ్రామాన్ని శాస్త్ర ప్రకారం పూజించి, అభిషేకిస్తే కోటి లింగాలను దర్శించి, పూజించి, అభిషేకించిన ఫలితం కలుగుతుంది.

సాల గ్రామ తీర్ధం సేవించినచో, వెయ్యిసార్లు పంచామృతం సేవించిన ఫలితముకంటే, ప్రాయశ్చిత్త్రములయందు ఆచరించు దానాలు ఫలితం కంటే అధిక ఫలితం ఉంటుంది. సాలగ్రామాన్ని అర్చించుటకు మంత్రాలు తెలియకపోయినప్పటికీ శక్తిననుసరించి పూర్తి భక్తి విశ్వాసాలతో పూజిస్తే కొన్ని ఫలితాలైనా కలుగుతాయి. సాలగ్రామ శిల యందు ఉంచిన అన్ని పదార్థములు పవిత్రములవుతాయి. సాలగ్రామమును ముందుంచుకుని పితృదేవతలకు తర్పణాలు ఇస్తే ఆ పితృదేవతలు స్వర్గంలో శాశ్వత సుఖాలను పొందుతారు.

సాలగ్రామ ప్రాముఖ్యత 

అన్ని విధాలైన పుణ్యాలకు పరిమితులున్నాయి కానీ ఈ సాలగ్రామశిల పూజచే కలుగు పుణ్యానికి పరిమితులు లేవు. అతల, వితల, రసాతల, పాతాళాది పధ్నాలుగు లోకాలలో ఈ సాలగ్రామ శిలకు సరి పడేటువంటి వేరొక శిల లేదన్నదే శాస్తవ్రచనం. కార్తీక మాసంలో సాలగ్రామ శిలపై స్వస్తిక మండలమును రచించినచో అనంతమైన పుణ్యఫలము కలుగుతుంది. సంవత్సరకాలం గృహంలో “నిత్యాగ్ని హోమం” చేసిన ఫలితానికి సమానమైన ఫలితాన్ని పొందుతారని చిలకమర్తి తెలిపారు.


సాలగ్రామంపై శుద్ధమైన మట్టితో గాని, రంగులతో గాని, ఏ కొద్దిపాటి రేశవనామాలను వ్రాసినా కోటి కల్పాల వరకూ స్వర్గంలో నివసించే భాగ్యం కలుగు తుంది. పూజాపీఠంలో సాలగ్రామమును ఉంచితే సమస్తమైన పూజలు సక్రమంగా సాగి పరిపూర్ణ ఫలితాలను పొందుతారు. సాలగ్రామాలు ఎంత చిన్నవిగా ఉంటే అంత మంచిది. సాలగ్రామాలు పగిలినప్పటికీ, పెచ్చు పూడినప్పటికీ కూడా పూజార్హత  కలిగి ఉంటాయి. 

కొన్ని సాలగ్రామాలు ఇంట్లో పెట్టుకుని పూజించుటకు అర్హత కలిగి ఉండవు. విపరీత పరిణామాలు కలుగుతాయి. అందుకే ఇంట్లో పెట్టుకుని పూజించాలనుకుంటే సాలగ్రామాల గురించి క్షుణ్ణంగా తెలిసిన పండితుల అమూల్యమైన అభిప్రాయాలను తెలుసుకుని ఆచరించటం శ్రేయస్మరమని చిలకమర్తి తెలియచేసారు.

సాలగ్రామం చక్రాల పేర్లు 

1 చక్రం ఉంటే - సుదర్శనం, 2 చక్రాలు ఉంటే - లక్ష్మీనారాయణ , 3 చక్రాలు ఉంటే - అచ్యుతుడు, 4 చక్రాలు ఉంటే -జనార్ధనడు, 5 చక్రాలు ఉంటే - వాసుదేవుడు, 6 చక్రాలు ఉంటే - ప్రద్యుమ్నుడు, 7 చక్రాలు ఉంటే - సంకర్షణుడు, 8 చక్రాలు ఉంటే - పురుషోత్తముడు, 9 చక్రాలు ఉంటే - నవ వ్యూహము, 10 చక్రాలు ఉంటే - దశావతారము, 11 చక్రాలు ఉంటే - అనిరుద్ధుడు, 12 చక్రాలు ఉంటే - ద్వాదశాత్ముడు, 12 చక్రాల కన్నా ఎక్కువ ఉంటే “అనంతమూర్తి అంటారు.


సాలగ్రామాలు తెల్లనివైతే సర్వపాపాలను హరిస్తాయి. పసుపు పచ్చనివి అయితే సంతానభాగ్యాన్ని కలిగిస్తాయి. నీలవర్ణం అయితే సర్వసంపదలను ఇస్తాయి. ఎరుపురంగు రోగాలను కలిగిస్తాయి, వక్రముగా వున్న సాలగ్రామాలు దారిద్ర్యాన్ని కలిగిస్తాయి. నలుపు రంగు కలిగి దానికి గల చక్రం మధ్య భాగంలో కొద్దిగా ఉబ్బినట్లుగా ఉండి రేఖపాడవుగా ఉంటే దానిని “ఆదినారాయణ సాలగ్రామం” అని అంటారు. తెలుపురంగు కలిగి రంధ్రంవైపున రెండు చక్రాలు ఒక దానితో ఒకటి కలిసిపోయినట్లు ఉంటే దానిని “వాసు దేవ సాలగ్రామం” అని అంటారు. ఇది సర్వ శ్రేష్టమైనది. ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది.

రంగుల సాలగ్రామల అర్థాలు 

పసుపు పచ్చ రంగు కలిగి గుండ్రంగా ఉండి రంధ్రం వైపున మూడు రేఖలు ఉండి, “పద్మ చిహ్నం” పైముఖంగా ఉంటే దానిని “అనిరుద్ధ సాలగ్రామము” అని అంటారు. ఇది చాలా మంచిది. కపిలవర్దం కలిగి చక్రం పెద్దదిగా ఉంటే దానిని 'నరసింహ సాలగ్రామం” అని అంటారు. దీనిని బ్రహ్మచర్య దీక్షతోనే పూజించాలి. బంగారు వర్ణంతో పొడవుగా ఉండి మూడు బిందువులతో ఉన్నదానిని “'మత్యృమూర్తి సాలగ్రామం” అని అంటారు. ఇది భక్తిని పెంచి ముక్తిని కలిగిస్తుంది. సంపదలను ఇస్తుంది. నలుపు రంగుతో, మెరుస్తూ ఎడమవైపున గద చక్రాలు, కుడి వైపున రేఖ ఉన్న దానిని “'సుదర్శనమూర్తి సాలగ్రామం” అని అంటారు. శత్రుబాధలు నుండి రక్షిస్తుంది. వివిధ రంగుల్లో ఉండి అనేక చక్రాలు, అనేక రేఖలు ఉన్నదానిని “అనంతమూర్తి సాలగ్రామము” అని అంటారు. ఈ సాలగ్రామం సకలాభీష్టాలను తీర్చుతుంది.


3౩ ముఖాలు 6 చక్రాలు కలిగి నేరేడు పండు ఆకారంలో ఉన్న దానిని “'షట్బక్రసీతారామ సాల గ్రామం” అని అంటారు. ఇలాంటి సాలగ్రామం దొరకటం దుర్లభం. ఈ సాలగ్రామాన్ని పూజించనవారికి అఫ్టైశ్వర్యములు కలుగుతాయి. ఇంకా కొన్ని అపురూపమైన సాలగ్రామాలు కూడా ఉన్నాయి. ఇంట్లో పూజించు సాలగ్రామానికి నిత్యనైవేద్యం తప్పనిసరిగా పెట్టాలి. కుటుంబ సభ్యులు మినహా అన్యులు సాలగ్రామాన్ని దర్శించరాదు. 

సర్వపాపపరిహారమైనది, సర్వవిధాలైన కష్టాల నుండి రక్షించేది, సర్వ పుణ్యణఫలాలను ఇచ్చేది, సర్వదేవతా పూజాఫలితాలను ఇచ్చేది, సర్వశ్రేయస్కరమైనది సర్వో తృష్టమైనది, సర్వాంతర్యామి ప్రతీక అయిన సాలగ్రామాన్ని పూజించుకునే భాగ్యం ఈ కలియుగం లో మానవులమైన మనకు కలగటం నిజంగా అపూర్వమైన అదృష్టం. అటువంటి అవకాశాన్ని వినియోగించుకుని జీవతాన్ని ధన్యం చేసుకోవడం శాశ్వతానందాన్ని పొంది ముక్తిని పొందటం భక్తిపరుడైన మానవునికి ముఖ్యకర్తవ్యం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అవకాశం దొరికితే ఆ పుణ్యఫలాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నించాలి.

సాలగ్రామ పుట్టుక వెనుక మరొక కథ 

మరోకథ ప్రకారం ఒకానాకసారి సృష్టిలోని జీవులన్నీ విపరీతమైన పాపపు చేష్టలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ దృశ్యాలను చూసిన బ్రహ్మదేవుడు ఇంతటికీ కారణం తన సృష్టే కదా తాను చేసిన సృష్టిలో లోపం ఉండబట్టే కదా జనం ఇలా పాపకృత్యాలలో మునిగిపోతున్నారని బాధపడుతుండగా ఆయన కళ్ల నుంచి రెండు కన్నీరు చుక్కలు రాలిపడ్డాయట. ఆ కన్నీటి చుక్కలే గండకీనదిగా మారాయని కథనం. ఇలా సాలగ్రామాన్ని గురించిన అనేక కథలు మన పురాణాలలో కనబడుతున్నాయి.

సాలగ్రామాలను ఆవుపాలతో గాని, పంచామృతముతో గాని శుద్ది చేయాలి. “రుద్రాక్షధారణ” నియమాలనే సాలగ్రామ పూజలోనూ పాటించాలి. ప్రత్యేక సమయాలలో, సంక్రమణకాలాలలో, గ్రహణ సమయాలలో ఆయా సాలగ్రామాలననుసరించి ఆయా దైవజపాలను 1008 సార్లు చేసినా చేయించుకున్నా ఆ సాలగ్రామము శక్తి ద్విగుణీకృతమవుతుంది. సాలగ్రామశిలను షోడశోపచార పూజావిధానం ద్వారా అర్చించిన భక్తులకు వైకుంఠంలో నివసించే భాగ్యం కలుగుతుంది.

కనీసం సాలగ్రామంకు భక్తిశద్ధలతో నమస్కరించి, యథావిధిని పూజిస్తే, మరుజన్మ లేకుండా ముక్తి పొందుతారని ప్రతీతి. సాలగ్రామమును స్మరించినా, దర్శించినా, నమస్కరించినా సర్వపాపాలు పరిహరింపబడతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

💥సాలగ్రామము పూజల్లో పెట్టుకొని వీటికి పూజలు చెయ్యడం మొదలెట్టాక - ఇక వాటికి ఎల్లప్పుడూ పూజలు చెయ్యడం చాలా మంచిది. అలాగే కొనసాగాలి కూడా. ఆ పూజల ధనాత్మక శక్తి వీటికి బాగా అంటుకొని, అవి ఉన్న చోట అంతా శుభమే కలుగుతుంది. ఏదైనా కారణాల వల్ల వీటికి ఆ పూజలను కొనసాగించలేమో - అప్పుడు ఆ ధనాత్మక శక్తి హరించుకపోయి, ఋణాత్మక శక్తిని వెదజల్లుతుంది. అప్పుడు ఆ రాళ్ళు ఉన్న చోట అంతా చెడు జరుగుతుందని చెబుతుంటారు. వీటికి మొదట ఏదైతే నైవేద్యముగా సమర్పిస్తామో, వాటినే ఎప్పుడూ సమర్పిస్తూనే ఉండాలి. అంటే పాయసం పెట్టడం మొదలెడితే అదే ఎల్లప్పుడూ పెడుతూనే ఉండాలి. అందుకే చాలామంది నీటినే - నైవేద్యముగా పెడుతూ ఉంటారు. 💥

అపుత్రస్య గతిర్నాస్తి

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

నేటి... 


                ఆచార్య సద్భోదన

                    ➖➖➖✍️

      అపుత్రస్య గతిర్నాస్తి 

‘పుత్రులు లేని వాళ్ళకు మోక్షప్రాప్తి లేదంటారా?’  అని  చాలామంది సందేహం వెలిబుచ్చుతారు.

పుత్రస్య అంటే పుత్రులే అని కాదు. పుత్రికలు కూడా అని అర్థం వస్తుంది.

 పుత్ర అనే పదం సంస్కృతంలో ఏక శేష సమానం క్రిందకు వస్తుంది. పురుషార్థాలు, పురుష పయత్నం అనేవి స్త్రీలకు కూడా వర్తిస్తాయి. 

పుత్ర అనే పదం పుత్రిక కు కూడా వర్తిస్తుందని ఆడపిల్లలు తమను పున్నామ నరకం నుంచి తప్పించలేరని తండ్రులు పెదవి విరుస్తుంటారు. 

అసలు అపుత్రస్య గతిర్నాస్తి అంటే ఆడ, మగ ఏ సంతానము లేని వారికి ఉత్తమ గతులుండవని అర్థం. 


సంతానం కలగని వాళ్ళు ఒక అనాథాశ్రమం నుంచి ఒక బిడ్డను తెచ్చుకొని, చట్టబద్ధంగా దత్తత చేసుకొని, పెంచుకోవచ్చు. అయితే బిడ్డలున్న వాళ్ళంతా మోక్షానికి పోతున్నారనుకుంటే పొరపాటే.

మోక్షమిచ్చేవాడు ఆ పరమాత్మ తప్ప అన్యులు కారు. సదాచార్యుని ద్వారా ఆయన్నే శరణువేడాలి. వీలైనంత వరకూ దానధర్మాలు చేయాలి. మన వెంట వచ్చేవి, మనకు మోక్షాన్ని ప్రసాదించేవి మనం చేసిన దానధర్మాలు తప్ప మరేమీ కావు.✍️

.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.

                     ➖▪️➖

రాజసూయ యాగం

 

రాజసూయ యాగం 

ఒకరోజు ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా విన్నవించాడు. "ప్రభూ! గోవిందా! నేను రాజసూయ యాగంచేసి, దేవతలను ఆరాధించుటకు నీ ఆశీస్సులను, అనుగ్రహాన్ని కోరుతున్నాను. నిన్ను ఆశ్రయించి, నీ పాద పద్మాలను సేవించే వారి కోరికలు నెరవేరుతాయి కదా!” అనగా శ్రీకృష్ణుడు ఇలాగ అన్నాడు. "ధర్మనందనా! నీ నిర్ణయం హర్షింప దగినది. ఈ యాగం దేవతలకు, పితరులకు, ఋషులకు, సర్వభూత శ్రేయోదాయకం కాన ఇది చేయదగినదే. నీకు పుణ్యం, కీర్తి, విజయం సిద్ధిస్తాయి. కనుక ఈ యాగాన్ని చేయి. నీ తమ్ముళ్ళు నీకు తోడుగా వుంటారు. వారు అస్త్రశస్త్ర విశారదులు.

నీ శత్రువులను ఓడించి, నీ కీర్తిని, శాసనాన్ని స్థాపించు. నీవు ఏ కార్యం చేయమన్నా, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను.” అని చెప్పిన శ్రీకృష్ణునకు ధర్మజుడు కృతజ్ఞతలు తెలిపి, నమస్కరించాడు. నలుగురు తమ్ముళ్ళను నాలుగు దిక్కులకూ పంపాడు. అదేవిధంగా తమ్ముళ్ళు వెళ్ళి, రాజులను జయించి, కప్పాలు కట్టించుకొని, సంపదలను ప్రోవుచేసుకొని వచ్చారు. ఒక్క జరాసంధుడు మాత్రం లొంగలేదని ధర్మరాజుకు తమ్ముళ్ళు చెప్పారు. అపుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. "ధర్మరాజా! జరాసంధునికి బ్రాహ్మణ భక్తి మెండు. బ్రాహ్మణులు అడిగింది ఏదైనా ఇస్తాడు. భీముడు, నేను, అర్జునుడు బ్రాహ్మణ వేషాల్లో వెళ్ళి, అతనితో ద్వంద్వ యుద్ధ చేయాలని వరాన్ని కోరుతాం. అతడు సమ్మతించి వస్తాడు. అపుడు భీముడు అతనిని ఓడిస్తాడు." అనగా అందరూ సంతసించారు.

శ్రీకృష్ణ భీమార్జునులు బ్రాహ్మణ వేషధారులై గిరివ్రజానికి వెళ్ళారు. జరాసంధుడు ఆ బ్రాహ్మణులను సత్కరించాడు. ఆ కపట బ్రాహ్మణ వేషంలో వున్న శ్రీకృష్ణుడు జరాసంధునితో ఇలా అన్నాడు. “ఓ మగధరాజా! బ్రాహ్మణ అతిథి దేవులను పూజించి, వారి కోర్కెలను తీర్చు వదాన్యత నీకున్నదని తెలిసి, ఒక కోర్కెతో నీ వద్దకు వచ్చాం. దానశీలురకు ఇవ్వదగనిది ఏదీ ఉ ౦డదు కదా! దధీచి, కపోతం, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, రంతిదేవుడు, హరిశ్చంద్రుడు మున్నగు వారెందరో పురాణ పురుషులైనారు గదా! ఇప్పటికీ వారు ప్రజల మనస్సున సజీవులై యున్నారు.” అనిన మాటలు వినిన జరాసంధుడు “ధీమంతులారా! మీరు ఏది అడిగినా ఇస్తాను. అడగండి.” అనగా, శ్రీకృష్ణుడు జరాసంధునితో, 'ఓ మగధేశ్వరా! మీ దానశీలతయందు మాకు విశ్వాసం ఏర్పడింది. మేము నీతో మల్లయుద్ధం చేయాలని ఇష్టపడుతున్నాం. ఇదే మా కోరిక. అవకాశం ఇప్పించు. మేము బ్రాహ్మణులం కాదు. ఇతడు భీముడు, ఇతడు అర్జునుడు, నేను వసుదేవుని పుత్రుడనైన కృష్ణుడను. నీవు మాతో ఎవ్వరితోనైనా మల్లయుద్ధం చేయవచ్చు.” అనగా జరాసంధుడు వికటాట్టహాసంతో ఇలా అన్నాడు. “ఎంత ఆశ్చర్యం! నన్ను ఎదిరించలేక, మధుర వీడి, సముద్రగర్భంలో తలదాచుకున్న వానితో ఈ మగధరాజు యుద్ధం చెయ్యడమా! సిగ్గు సిగ్గు. నీవు తప్పుకో. అర్జునుడు చిన్నవాడు. ఈ భీముడు నాకు సమానుడేమో చూస్తాను. వీడితోనే యుద్ధం చేస్తాను.” అని చెప్పి, రెండు గదలను తెప్పించి, ఊరిబయటకు అందరినీ తీసికొని వెళ్ళాడు.

భీముడు, జరాసంధుడు భూమి దద్దరిలేటట్లు కొట్టుకున్నారు. భయంకర పోరులో గదలు విరిగి పోయాయి. మల్లయుద్ధం మొదలైంది. ముష్టియుద్ధం చేశారు. గుద్దుకొన్నారు. ఎత్తి పడేసుకున్నారు. తన్నుకొన్నారు. ఎవరూ అలసిపోలేదు. ఇలా ఎంతకాలం జరిగిందో తెలియదు. జరాసంధుడు ఈలాటి దెబ్బలతో చావడని శ్రీకృష్ణుడికి తెలుసు. అక్కడే వుండి భీమునిపై తన దివ్యశక్తిని ప్రవేశ పెట్టేవాడు. ఇక ఈ యుద్ధాన్ని ముగించతలచి, శ్రీకృష్ణుడు భీమునకు ఒక సంకేతం ఇచ్చాడు. ఒక చెట్టుకొమ్మను నిలువుగా చీల్చి చూపించాడు. దాన్ని గ్రహించిన భీముడు జరాసంధుని నేలపై పడేసి, అతని ఒక కాలిని తన కాలితో తొక్కిపెట్టి, రెండవ కాలిని తన రెండు చేతులతో పట్టుకొని అతని శరీరాన్ని రెండు ముక్కలుగా వేసి, దూరంగా అటూ ఇటూ పారవేశాడు. దానితో అజేయుడైన జరాసంధుడు మరణించాడు. శ్రీకృష్ణుడు అర్జునుడు భీమసేనుని కౌగలించుకొని ప్రస్తుతించారు.

శ్రీకృష్ణుడు జరాసంధుని కుమారుడైన సహదేవుని రాజును చేశాడు. రాజులందరినీ విడుదల చేశాడు. ఆ రాజులు భగవానుని దర్శించి, ఆనంద భరితులైనారు. వారందరు ముక్తసంగులైన మునుల వలె బాధలన్నీ తొలగించుకొని భగవానుని ఇలా సేవించారు. “ఓ పద్మనాభా! వాసుదేవా! ఆశ్రితరక్షకా! శ్రీకృష్ణా! శ్రీహరీ! ఇందిరావల్లభా! అప్రమేయా! నీ కరుణచే

మేము విముక్తులమైనాం. కాని ఈ సంసార బంధాలనుండి విముక్తి లభించాల్సి ఉంది. ప్రభూ! నిరంకుశ పాలనచేసి, ఐహికమే నిత్యమని నమ్మి, పరమార్థాన్ని విస్మరించాం. నీ లీలావిలాసం చేత, మా అహంకారాలను పోగొట్టుకొని, నీవే శరణ్యమని తెలుసుకున్నాము, దేవా! మా రాజ్యాల్ని, సర్వస్వాన్ని, అపహరించిన జరాసంధునిపై మాకు కోపం లేదు. అతడు అలాగ చేసినందు వల్లనే కదా, ఇపుడు నీ దర్శనభాగ్యం పొందగలిగాం. ఈ లౌకిక భాగ్యాలన్నీ మాకు ఇప్పుడు తృణప్రాయంగా కన్పిస్తున్నాయి.శాశ్వత విముక్తిని ప్రసాదించే, మీ పాదాలే మాకు శరణ్యమని భావిస్తున్నాం.
 గోవిందా! దామోదరా! నీ పాదపద్మాలు మా హృదయాల్లో నిరంతరం నిలిచి వుండేటట్లు అనుగ్రహించు.” అని వేడుకొన్న రాజులతో శ్రీకృష్ణుడు ఇలాగన్నాడు. "రాజేంద్రులారా! రాజ్యాహంకారంతో గర్వించిన వేనుడు, నహుషుడు, రావణుడు మున్నగు రాజులు బ్రాహ్మణులను, ప్రజలను బాధించి, నశించిపోయారు. ధర్మపథంలో నడిచేవారికి సర్వం శుభప్రదంగా ఉంటుంది. సురాజ్యపాలన చేయండి. యజ్ఞయాగాదులు చేస్తూ, నాయందు భక్తి కలిగి ఉండండి. మీరు సమభావంతో రాజ్యపాలన చేస్తే, నన్ను చేరగలరు.” అని బోధించి, అందరికీ మంగళస్నానాలు చేయించి, వస్త్రాలు, కానుకలు, రథాలు, గోవులు, ఏనుగులు ఎవరివి వారికి ఇప్పించి, అందరినీ ఆనందంతో సాగనంపాడు పరమాత్మ.

భీమార్జునులతో కూడి శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థం చేరి, ధర్మరాజుకు మగధ విజయ వృత్తాంతం అంతా చెప్పాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని అభినందించి, తమ్ముళ్ళను ఆలింగనం చేసుకొని, భీముని మిక్కిలిగా ప్రశంసించాడు.

  ఓం నమో వేంకటేశాయ




మండోదరి

 మండోదరి

                ➖➖➖


మండోద‌రి నిజానికి ఒక దేవ‌త‌. చాలా అంద‌గ‌త్తె.


ఒక‌సారి ఆమె కైలాసంలో శివ‌పార్వతుల‌ను ద‌ర్శించుకునేందుకు వెళ్లడమూ, అదే స‌మ‌యానికి పార్వ‌తీ దేవి త‌న కుమారుల‌ను చూసేందుకు ప‌క్క‌కు వెళ్లడమూ జరిగాయి. అప్పుడు మండోద‌రి చూపు శివుడిపై ప‌డింది. 


ఈ విషయాన్ని గ్రహించిన పార్వ‌తీదేవి మండోద‌రిని క‌ప్ప‌గా మార‌మ‌ని శాపం పెడుతుంది. 


ఆమె క‌ప్ప‌గా మారాక పార్వ‌తి ఆమెను బావిలో ప‌డేస్తుంది.


 మండోద‌రి అస‌లు పేరు మ‌ధుర‌. కానీ శాపవ‌శాన క‌ప్ప‌గా మార‌డం వ‌ల్ల ఆమెకు మండోద‌రి అనే పేరు వ‌చ్చింది.


అయితే శివుడు మండోద‌రికి 12 ఏళ్ల త‌రువాత శాప విముక్తి అవుతుంద‌ని, అనంత‌రం ఆమె మునుప‌టిలాగే అందగత్తె అవుతుందని చెబుతాడు. 


12 ఏళ్లు పూర్త‌ైన మండోద‌రికి శాప విముక్తి అవుతుంది. కానీ బావిలోనే ఉండి స‌హాయం కోసం పిలుస్తుంది. 


అదే స‌మ‌యానికి అటుగా వ‌చ్చిన మ‌యాసురుడు, అత‌ని భార్య హేమలు మండోద‌రి అరుపులు విని బావి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి చూస్తారు.


అనంత‌రం వారు మండోద‌రిని బావి నుంచి ర‌క్షిస్తారు.


అయితే వారు మండోద‌రిని త‌మకు దేవుడిచ్చిన పుత్రిక‌గా భావించి త‌మ‌తో ర‌మ్మంటారు.


ఆమె వారితో వెళ్లిపోతుంది


త‌రువాత కొంత కాలానికి రావ‌ణుడు మండోద‌రిని చూసి ఆమెను పెళ్లి చేసుకుంటాన‌ని మ‌యాసురున్ని అడుగుతాడు.


అందుకు అతను ఒప్పుకోగానే ఇద్ద‌రి పెళ్లి జ‌రుగుతుంది.


ప్ర‌స్తుతం జోధ్‌పూర్‌లో ఉన్న మండోర్ అనే ప్రాంతాన్ని మండోద‌రి జ‌న్మ‌స్థ‌లం అని చెబుతారు.


రావ‌ణున్ని పెళ్లి చేసుకున్నాక ఆమె అత‌నితో క‌లిసి లంక‌కు వెళ్తుంది.


రావ‌ణుడు క్రూరుడు. కానీ అత‌ని భార్య మండోద‌రి చాలా అణ‌కువ క‌లిగిన‌, జాలి, ద‌య ఉన్న వ్య‌క్తి.


సీత‌ను అప‌హ‌రించుకు వ‌చ్చాక ఎంత చెప్పినా సీత రావ‌ణుడితో ఉండేందుకు అంగీక‌రించ‌దు. సీత‌ను రావ‌ణుడు చంపాల‌ని చూస్తాడు. కానీ మండోద‌రి వ‌ద్ద‌ని వారిస్తుంది.


సీత కోసం హ‌నుమంతుడు లంక‌కు వ‌చ్చిన‌ప్పుడు మండోద‌రిని చూసి సీత అని భ్ర‌మిస్తాడు.


కానీ సీత అయితే    అంతఃపురంలో సంతోషంగా ఎందుకు ఉంటుంది? అని అనుమానం వ‌చ్చి లంకంతా గాలించి సీత‌ను వెదికి ప‌ట్టుకుంటాడు.


మండోద‌రికి ముగ్గురుకుమారులు. మేఘ‌నాథుడు, అక్ష‌య కుమారుడు, అతికాయుడు.


సీత‌ను వ‌దిలేయ‌మ‌ని, రాముడికి అప్ప‌గించ‌మ‌ని మండోద‌రి చెబుతుంది. అయిన‌ప్ప‌టికీ రావ‌ణుడు వినిపించుకోడు.


రావ‌ణుడు చ‌నిపోయాక మండోద‌రి ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకుంటుంది. కానీ రాముడు వారిస్తాడు.


పాపాల‌ను హ‌రించే పంచ‌క‌న్య‌ల‌లో మండోద‌రి ఒక క‌న్య అని చెబుతారు.......🙏

🙏\|/🙏 శ్రీనివాసుని చేత తాతా అని పిలిపించుకున్న భక్తుడు 🙏\|/🙏

 

🙏\|/🙏 శ్రీనివాసుని చేత తాతా అని పిలిపించుకున్న భక్తుడు 🙏\|/🙏 

🙏🌹🪷\|/🪷🌹\|/🌹🪷\|/🪷🌹🙏 


🙏\|/తిరుమల మాడవీథుల్లో వెడుతుంటే సహస్ర దీపాలంకరణ చేసే ప్రదేశం దాటిన తరువాత ఎడమ పక్కన తిరుమలనంబి దేవాలయం ఉంటుంది. 


🙏\|/ఎవరీ తిరుమలనంబి? ఈయనకు దేవాలయం ఏమిటి?


🙏\|/పూర్వం శ్రీరంగంలో యామునాచార్యులవారు శిష్యులందర్నీ కూర్చోబెట్టుకుని ‘బ్రాహ్మీ ముహూర్తంలో  వేంకటేశ్వర స్వామివారి అభిషేకానికి కావలసిన జలాలను తీసుకు రావడానికి వేంకటాచలం మీద ఎవరయినా ఉండగలరా?’ అని అడిగితే తిరుమలనంబి దానికి సిద్ధపడ్డాడు. 


🙏\|/ఆయనను శ్రీశైలపూర్ణులు అని కూడా అంటారు. 


🙏\|/ఆయన రోజూ పాపనాశనానికి వెళ్ళి నీళ్ళు కుండతో తలమీద పెట్టుకుని మోసుకుంటూ గోవింద నామ స్మరణ చేస్తూ అభిషేకానికి తీసుకువస్తుండేవారు. 


🙏\|/ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి. 


🙏\|/వేంకటేశ్వరస్వామి బాలకిరాతుడి వేషంలో వచ్చి ‘తాతా, తాతా! దాహం వేస్తోంది.నీళ్ళు పొయ్యవా? అని అడుగుతాడు.


🙏\|/ ‘ఇవి స్వామివారికి అభిషేకానికి తీసుకువెడుతున్నా తప్పుకో’’ అంటూ ముందుకు సాగిపోతుంటే...


🙏\|/బాలకిరాతుడు వెనకనుంచి బాణం వేసి కుండకు చిల్లు కొట్టి నీళ్ళు తాగుతాడు. 


🙏\|/కుండ బరువు తగ్గడం గమనించిన తిరుమలనంబి వెనక్కి తిరిగి చూసేసరికి కుండనుంచి ధారగా పడుతున్న నీటిని ఆ బాలుడు ఒడిసిపట్టి తాగుతున్నాడు.


🙏\|/ ‘‘ఎంత దుర్మార్గపు పని చేసావురా, తాగొద్దంటే అవి తాగావా?...’’అని నిందించబోతుంటే... 


🙏\|/వెంటనే ఆ బాలుడు ‘‘తాతా! బెంగపడొద్దు. నీళ్ళకు పాపనాశనందాకా వెళ్ళడమెందుకు? ఇక్కడే ఉంది, ధార నీకు చూపిస్తాను, రా...అంటూ ఆ కొండలలోకి బాణం వేసి కొట్టాడు.


 🙏\|/ఆకాశగంగ అలా వచ్చింది.


🙏\|/ఆలయంలో స్వామి అర్చకులమీద ఆవహించి ‘‘అభిషేకానికి ఈవేళ నుంచి పాపనాశనం నీళ్ళు అక్కరలేదు. ఆకాశగంగ నీళ్ళతో చెయ్యండి.’’

అని పురమాయించారు.


 🙏\|/ఇప్పుడు తిరుమలనంబి దేవాలయం ఎక్కడ ఉందో అక్కడ ఆయన పర్ణశాల ఉండేది. 


🙏\|/అక్కడ అనుష్ఠానం చేసుకుని స్వామివారి అభిషేకానికి పాపానాశనం నుంచి రోజూ తెల్లవారుఝూమునే చాలా సంవత్సరాలపాటు నీళ్ళు మోసుకొచ్చారు. 


🙏\|/అలా ఆయన్ని ఆప్యాయంగా తాతా! అని పిలుస్తూ ఆయన్ని తరింపచేసారు స్వామి వారు.


🙏\|u/ఏడుకొండలవాడా... వేంకటరమణా... 

గోవిందా గోవింద...