9, జులై 2024, మంగళవారం

రాజసూయ యాగం

 

రాజసూయ యాగం 

ఒకరోజు ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా విన్నవించాడు. "ప్రభూ! గోవిందా! నేను రాజసూయ యాగంచేసి, దేవతలను ఆరాధించుటకు నీ ఆశీస్సులను, అనుగ్రహాన్ని కోరుతున్నాను. నిన్ను ఆశ్రయించి, నీ పాద పద్మాలను సేవించే వారి కోరికలు నెరవేరుతాయి కదా!” అనగా శ్రీకృష్ణుడు ఇలాగ అన్నాడు. "ధర్మనందనా! నీ నిర్ణయం హర్షింప దగినది. ఈ యాగం దేవతలకు, పితరులకు, ఋషులకు, సర్వభూత శ్రేయోదాయకం కాన ఇది చేయదగినదే. నీకు పుణ్యం, కీర్తి, విజయం సిద్ధిస్తాయి. కనుక ఈ యాగాన్ని చేయి. నీ తమ్ముళ్ళు నీకు తోడుగా వుంటారు. వారు అస్త్రశస్త్ర విశారదులు.

నీ శత్రువులను ఓడించి, నీ కీర్తిని, శాసనాన్ని స్థాపించు. నీవు ఏ కార్యం చేయమన్నా, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను.” అని చెప్పిన శ్రీకృష్ణునకు ధర్మజుడు కృతజ్ఞతలు తెలిపి, నమస్కరించాడు. నలుగురు తమ్ముళ్ళను నాలుగు దిక్కులకూ పంపాడు. అదేవిధంగా తమ్ముళ్ళు వెళ్ళి, రాజులను జయించి, కప్పాలు కట్టించుకొని, సంపదలను ప్రోవుచేసుకొని వచ్చారు. ఒక్క జరాసంధుడు మాత్రం లొంగలేదని ధర్మరాజుకు తమ్ముళ్ళు చెప్పారు. అపుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. "ధర్మరాజా! జరాసంధునికి బ్రాహ్మణ భక్తి మెండు. బ్రాహ్మణులు అడిగింది ఏదైనా ఇస్తాడు. భీముడు, నేను, అర్జునుడు బ్రాహ్మణ వేషాల్లో వెళ్ళి, అతనితో ద్వంద్వ యుద్ధ చేయాలని వరాన్ని కోరుతాం. అతడు సమ్మతించి వస్తాడు. అపుడు భీముడు అతనిని ఓడిస్తాడు." అనగా అందరూ సంతసించారు.

శ్రీకృష్ణ భీమార్జునులు బ్రాహ్మణ వేషధారులై గిరివ్రజానికి వెళ్ళారు. జరాసంధుడు ఆ బ్రాహ్మణులను సత్కరించాడు. ఆ కపట బ్రాహ్మణ వేషంలో వున్న శ్రీకృష్ణుడు జరాసంధునితో ఇలా అన్నాడు. “ఓ మగధరాజా! బ్రాహ్మణ అతిథి దేవులను పూజించి, వారి కోర్కెలను తీర్చు వదాన్యత నీకున్నదని తెలిసి, ఒక కోర్కెతో నీ వద్దకు వచ్చాం. దానశీలురకు ఇవ్వదగనిది ఏదీ ఉ ౦డదు కదా! దధీచి, కపోతం, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, రంతిదేవుడు, హరిశ్చంద్రుడు మున్నగు వారెందరో పురాణ పురుషులైనారు గదా! ఇప్పటికీ వారు ప్రజల మనస్సున సజీవులై యున్నారు.” అనిన మాటలు వినిన జరాసంధుడు “ధీమంతులారా! మీరు ఏది అడిగినా ఇస్తాను. అడగండి.” అనగా, శ్రీకృష్ణుడు జరాసంధునితో, 'ఓ మగధేశ్వరా! మీ దానశీలతయందు మాకు విశ్వాసం ఏర్పడింది. మేము నీతో మల్లయుద్ధం చేయాలని ఇష్టపడుతున్నాం. ఇదే మా కోరిక. అవకాశం ఇప్పించు. మేము బ్రాహ్మణులం కాదు. ఇతడు భీముడు, ఇతడు అర్జునుడు, నేను వసుదేవుని పుత్రుడనైన కృష్ణుడను. నీవు మాతో ఎవ్వరితోనైనా మల్లయుద్ధం చేయవచ్చు.” అనగా జరాసంధుడు వికటాట్టహాసంతో ఇలా అన్నాడు. “ఎంత ఆశ్చర్యం! నన్ను ఎదిరించలేక, మధుర వీడి, సముద్రగర్భంలో తలదాచుకున్న వానితో ఈ మగధరాజు యుద్ధం చెయ్యడమా! సిగ్గు సిగ్గు. నీవు తప్పుకో. అర్జునుడు చిన్నవాడు. ఈ భీముడు నాకు సమానుడేమో చూస్తాను. వీడితోనే యుద్ధం చేస్తాను.” అని చెప్పి, రెండు గదలను తెప్పించి, ఊరిబయటకు అందరినీ తీసికొని వెళ్ళాడు.

భీముడు, జరాసంధుడు భూమి దద్దరిలేటట్లు కొట్టుకున్నారు. భయంకర పోరులో గదలు విరిగి పోయాయి. మల్లయుద్ధం మొదలైంది. ముష్టియుద్ధం చేశారు. గుద్దుకొన్నారు. ఎత్తి పడేసుకున్నారు. తన్నుకొన్నారు. ఎవరూ అలసిపోలేదు. ఇలా ఎంతకాలం జరిగిందో తెలియదు. జరాసంధుడు ఈలాటి దెబ్బలతో చావడని శ్రీకృష్ణుడికి తెలుసు. అక్కడే వుండి భీమునిపై తన దివ్యశక్తిని ప్రవేశ పెట్టేవాడు. ఇక ఈ యుద్ధాన్ని ముగించతలచి, శ్రీకృష్ణుడు భీమునకు ఒక సంకేతం ఇచ్చాడు. ఒక చెట్టుకొమ్మను నిలువుగా చీల్చి చూపించాడు. దాన్ని గ్రహించిన భీముడు జరాసంధుని నేలపై పడేసి, అతని ఒక కాలిని తన కాలితో తొక్కిపెట్టి, రెండవ కాలిని తన రెండు చేతులతో పట్టుకొని అతని శరీరాన్ని రెండు ముక్కలుగా వేసి, దూరంగా అటూ ఇటూ పారవేశాడు. దానితో అజేయుడైన జరాసంధుడు మరణించాడు. శ్రీకృష్ణుడు అర్జునుడు భీమసేనుని కౌగలించుకొని ప్రస్తుతించారు.

శ్రీకృష్ణుడు జరాసంధుని కుమారుడైన సహదేవుని రాజును చేశాడు. రాజులందరినీ విడుదల చేశాడు. ఆ రాజులు భగవానుని దర్శించి, ఆనంద భరితులైనారు. వారందరు ముక్తసంగులైన మునుల వలె బాధలన్నీ తొలగించుకొని భగవానుని ఇలా సేవించారు. “ఓ పద్మనాభా! వాసుదేవా! ఆశ్రితరక్షకా! శ్రీకృష్ణా! శ్రీహరీ! ఇందిరావల్లభా! అప్రమేయా! నీ కరుణచే

మేము విముక్తులమైనాం. కాని ఈ సంసార బంధాలనుండి విముక్తి లభించాల్సి ఉంది. ప్రభూ! నిరంకుశ పాలనచేసి, ఐహికమే నిత్యమని నమ్మి, పరమార్థాన్ని విస్మరించాం. నీ లీలావిలాసం చేత, మా అహంకారాలను పోగొట్టుకొని, నీవే శరణ్యమని తెలుసుకున్నాము, దేవా! మా రాజ్యాల్ని, సర్వస్వాన్ని, అపహరించిన జరాసంధునిపై మాకు కోపం లేదు. అతడు అలాగ చేసినందు వల్లనే కదా, ఇపుడు నీ దర్శనభాగ్యం పొందగలిగాం. ఈ లౌకిక భాగ్యాలన్నీ మాకు ఇప్పుడు తృణప్రాయంగా కన్పిస్తున్నాయి.శాశ్వత విముక్తిని ప్రసాదించే, మీ పాదాలే మాకు శరణ్యమని భావిస్తున్నాం.
 గోవిందా! దామోదరా! నీ పాదపద్మాలు మా హృదయాల్లో నిరంతరం నిలిచి వుండేటట్లు అనుగ్రహించు.” అని వేడుకొన్న రాజులతో శ్రీకృష్ణుడు ఇలాగన్నాడు. "రాజేంద్రులారా! రాజ్యాహంకారంతో గర్వించిన వేనుడు, నహుషుడు, రావణుడు మున్నగు రాజులు బ్రాహ్మణులను, ప్రజలను బాధించి, నశించిపోయారు. ధర్మపథంలో నడిచేవారికి సర్వం శుభప్రదంగా ఉంటుంది. సురాజ్యపాలన చేయండి. యజ్ఞయాగాదులు చేస్తూ, నాయందు భక్తి కలిగి ఉండండి. మీరు సమభావంతో రాజ్యపాలన చేస్తే, నన్ను చేరగలరు.” అని బోధించి, అందరికీ మంగళస్నానాలు చేయించి, వస్త్రాలు, కానుకలు, రథాలు, గోవులు, ఏనుగులు ఎవరివి వారికి ఇప్పించి, అందరినీ ఆనందంతో సాగనంపాడు పరమాత్మ.

భీమార్జునులతో కూడి శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థం చేరి, ధర్మరాజుకు మగధ విజయ వృత్తాంతం అంతా చెప్పాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని అభినందించి, తమ్ముళ్ళను ఆలింగనం చేసుకొని, భీముని మిక్కిలిగా ప్రశంసించాడు.

  ఓం నమో వేంకటేశాయ




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి