20, ఆగస్టు 2020, గురువారం

ఉపాయాలతో మనస్సును స్వాధీనంలోకి ఎలా తెచ్చుకోవాలి

ఉపాయాలతో మనస్సును స్వాధీనంలోకి ఎలా తెచ్చుకోవాలి - అభ్యాసయోగం అంటే?
ఉన్నత విషయాలను ధ్యానించటానికి ప్రయత్నించినప్పుడు మనస్సు దానిపై ఏకాగ్రంగానిలవదు. అల్పవిషయాల వైపుకే పరుగులు తీస్తుంది. ఒక పండితుడు భగవద్గీతకు అంతరార్థాన్ని వ్రాస్తూ ఒక కథను ఇలా చెప్పాడు. - 
సృష్టికి ముందు నిరాకార నిర్గుణ పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఆయనకు మాయ అనే భార్య ఉన్నది. వారికొక కుమారుడు. అతడే మనస్సు. అయితే కుమారుడికి అంతా తల్లి పోలికే. తండ్రి అంటేనే దరి చేరడు. ఎప్పుడూ తల్లికొంగు పట్టుకొని తల్లి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ మనస్సనే వాడికి ఇద్దరు భార్యలు. ఒకరు ప్రవృత్తి, మరొకరు నివృత్తి. వీడికెప్పుడూ ప్రవృత్తి అంటేనే ఇష్టం. నివృత్తి అంటే అస్సలు గిట్టదు. ప్రాపంచిక వ్యామోహాలే ప్రవృత్తి. అవి పట్టక పరమాత్మపై అనురాగమే నివృత్తి. ప్రవృత్తి సంతానం అసురులు (ఆసురీగుణాలు). నివృత్తి సంతానం దేవతలు (దైవీగుణాలు) ఈ రెండూ శరీరమనే ఈ కురుక్షేత్రంలో పోరాటం చేస్తూ ఉంటాయి. 
  మనస్సుకెప్పుడూ ప్రవృత్తి యందే (ప్రాపంచిక విషయభోగాల యందే) పక్షపాతం. దానిని మెల్లమెల్లగా 'శనైః శనైః రుపరమేత్' అన్నట్లుగ మెల్లమెల్లగా మచ్చిక చేసుకోవాలి తప్ప మరొక ఉపాయం లేదు. మనస్సే బంధానికైనా మోక్షానికైనా కారణం అవుతుంది. ("మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః") కనుక తెలివిగా మనస్సును మచ్చిక చేసుకోవాలి. దానికే అభ్యాసయోగం. అనేక ఉపాయాలతో మనస్సును స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. తొందర పనికిరాదు. ఎలా?
  నీ ఇంట్లో దొంగగొడ్డు ఉన్నది. ఏమాత్రం ఏమారినా చాలు కట్లుతెంచుకొని పరుగెడుతుంది. ఇతరుల పొలాల్లో పడిమేస్తుంది. దానిని ఎలా దారికి తేవాలి? మూర్ఖులు దానిని కొడుతూ బలవంతంగా తెచ్చి, గొలుసులతో స్తంభానికి కట్టివేసి కసిదీరా కొడతారు. తప్పించుకొని పోవటానికి వీలులేక వెళ్ళకుండా ఉంటుందేగాని, వీలు కుదిరితే మళ్ళీ చిక్కకుండా పారిపోతుంది. ఎప్పుడో సమయం వస్తుంది. అప్పుడది తప్పించుకొని పోతుంది, దొంగగడ్డి మేస్తుంది. ఎప్పటికీ కనిపించకుండా తప్పించుకొని ఎక్కడకో పోతుంది. ఇక ఎప్పటికీ దాని గతి అంతే.
అదే తెలివిగల వాళ్ళు ఏంచేస్తారు? అది పొలాల్లో మేసే మేతకన్న ఎక్కువ నాణ్యమైన, రుచికరమైన, దానికి ఇష్టమైన మేతను సప్లై చేస్తారు. ఇక ఫరవాలేదని ఊరుకోకుండా అలా దానికి మంచి మేత ఇస్తూ ఉండాల్సిందే. ఈ మేతను తినటం దానికి అలవాటై పోతుంది. అప్పుడు దానిని వదిలినా అది ఇక దొంగ తిండికోసం వెళ్ళదు. హాయిగా ఇంట్లోనే మేస్తుంది; దారికి వస్తుంది. 
మన మనస్సు కూడా దొంగ గొడ్డు లాంటిదే. దానికి వైరాగ్యమనే కళ్ళెం బిగించి అభ్యాసమనే మంచిమేత వేయాలి. ఇందులో రుచి మరిగిందా ఇక నెట్టినా ఎక్కడికీ పోదు. రుచి మరిగేంత వరకే కష్టం. కనుక అభ్యాసం చేస్తూనే ఉండాలి.
అభ్యాసంలో ఉన్న శక్తి చాలా గొప్పది. దేవాలయంలో క్రొత్తగా వచ్చిన పూజారి మంత్రం చదువుతూ, హారతి ఇస్తూ గంట మ్రోగించాలి. గంట మ్రోగిందా! హారతి తిరగదు. హారతి తిరిగిందా! గంట ఆగిపోతుంది. ఆయన క్రొత్త పూజారిగదా! ఈ రెంటి విషయంలో జాగ్రత్తపడితే మంత్రం తడబడుతుంది లేదా ఆగిపోతుంది. ఐతే నిరాశపడకుండా అభ్యాసం చేస్తే హారతి తిరుగుతుంది, గంట మ్రోగుతుంది, మంత్రం కొనసాగుతుంది. ఎవరెంత దక్షిణ వేస్తున్నారో కూడా గమనిస్తూ ఉంటాడు. ఇదే అభ్యాసం మహిమ. 
  అభ్యాసం వల్లనే సర్కస్ లో ఏనుగు సైకిలు త్రొక్కుతుంది. అమ్మాయిలు తీగమీద నడుస్తారు. అభ్యాసం వల్లనే సముద్రాన్ని ఈదవచ్చు. ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కవచ్చు. అభ్యాసం వల్లనే జీవుడు దేవుడవుతాడు. అందుకే 'సాధనమున పనులు సమకూరు ధరలోన' అన్నారు.
  కనుక ఎవరైతే మనోబుద్ధులను భగవంతుని యందే నిలిపి, ఏకాగ్రచిత్తంతో ధ్యానించలేరో, సమాధిలో నిలువలేరో అట్టి వారు అభ్యాసం చేయాలి. మనోబుద్ధులు భగవంతుని యందు నిలవటానికి వీలుగా మనోబుద్ధులకు ట్రైనింగ్ ఇవ్వాలి. అభ్యాసం చేయాలి.

*నీ జీవిత సహచరి ఎవరు?*

*నీ జీవిత సహచరి ఎవరు?*
అమ్మనా?
నాన్ననా?
భార్యనా?
భర్తనా?
కొడుకా?
కూతురా?
స్నేహితులా?
బందువులా?
లేదు.ఎవరూ కాదు.!
నీ నిజమైన సహచరి ఎవరో తెలుసా?
*నీ శరీరమే!* 
ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు గాక ఉండరు!!
నువ్వు అవునన్నా?కాదన్నా?ఇది కఠిక నిజం.!!!
నీవూ నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు.
నీవేదైతే నీ శరీరం కొరకు భాద్యతగా ఏ పనైతే చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది.
నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరిరాన్ని బాగా చూసుకుంటావో.,నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా బాగా చూసుకుంటుంది.
నీవేమి తినాలి?
నీవేమి చేయాలి?
ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?
నీవెంత విశ్రాంతి తీసుకోవాలి?
అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి.
గుర్తించుకో.!
నీ శరీరమొక్కటే నీవు జీవిస్తున్న చిరునామా.!!
నీ శరీరమే నీ ఆస్థి.,సంపద.
వేరే ఏదీ కూడా దీనికి తులతూగదు.
నీ శరీరం నీ భాద్యత.!
ఎందుకంటే?
నీవే నిజమైన సహచరివి.!
కనుక జాగ్రత్తగా ఉండు.
నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకో.
డబ్బు వస్తుంది.వెళ్తుంది.
బందువులు.,స్నేహితులు శాశ్వతం కాదు.
గుర్తుంచుకో.!
నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు.
ఒక్క నీవు తప్ప.!
ఊపిరితిత్తులకు- ప్రాణాయామం.
మనసుకు-ద్యానము.
శరీరానికి-యోగా.
గుండెకు-నడక.
ప్రేగులకు-మంచి ఆహారం.
ఆత్మకు-మంచి ఆలోచనలు.
ప్రపంచానికి-మంచి పనులు.
*శ్రీశ్రీ.రవిశంకర్.*
*సుప్రసిద్ధ ఆద్యాత్మికవేత్త.* 
ఆంగ్లరచనకు తెలుగు అనువాదం.యధావిధిగా.
బొడ్డు సురేందర్.
ఇందూరు.