8, నవంబర్ 2018, గురువారం

ధ్యాన పరిష్కారం

” ధ్యానం “

కార్మికుడునుంచి, కర్షకుడునుంచి, చిన్న ఉద్యోగినుంచి ఉన్నత ఉద్యోగివరకు, కటిక బీదవాడునుంచి కోటీశ్వరుడు వరకు, ఒకటవ తరగతి చదివే పిల్లవాడినుంచి, ఉన్నత విద్య చదివే విద్యార్ధి వరకు ఈ ప్రపంచంలో, అందరికీగల ఏకైక, సామాన్య, కొరకరాని సమస్య ” మానసిక ఒత్తిడి “. జీతం సరిపోవట్లేదని కార్మికుడు; పంటలు పండటం లేదని కర్షకుడు; పైఅధికారుల వేధింపులు, పని ఎక్కువైందని చిరుఉద్యోగి; తన విలువను సరిగా యాజమాన్యం గుర్తించటలేదని ఉన్నత ఉద్యోగి; తింటానికి తిండి, ఉండటానికి ఇల్లు లేదని బీదవాడు; మితిమించిన సంపాదనను, పన్ను కట్టకుండా ఎక్కడ, ఎట్లా దాచిపెట్టాలని కోటీశ్వరుడు; పుస్తకాల బరువును మోయలేక పోతున్నానని వాపోయే ఒకటవ తరగతి విద్యార్ధి; ఉన్నతవిద్య చదివినా మంచి ఉద్యోగం రాలేదని ఉన్నతవిద్య చదివిన విద్యార్ధి; వీఅందరికిగల ఒకే ఒక సమస్య ” మానసిక ఒత్తిడి “.అన్ని దారులు మూసుకు పోయాయి,ఇక జీవితం శూన్యం అని ఆత్మహత్యకు ప్రయత్నించే వారెందరో.
ఈ సమస్యకు పరిష్కారం లేదా? అన్నది ప్రశ్న. ఉన్నది అనేది సమాధానం.

ఒక కారు, ఆగకుండా పన్నెండు గంటలు ప్రయాణించిందనుకోండి. అప్పుడు, ఆ కారులోని ఇంజన్ చాలావేడెక్కి కారు ఆగిపోతుంది. ఇంజనును చల్లార్చి, రేడియేటర్లో చల్లటి నీళ్ళు పోసినట్లైతే, కొంతసేపటికి ఇంజన్ చల్లబడి, తిరిగి కారు ప్రయాణించిటానికి సిద్ధమైవుతుంది. అదేవిధంగా, అనేక సమస్యలతో వేడెక్కిన మన మనస్సు, ఆ సమస్యలకు పరిష్కారం కనుక్కోలేక, ఆలోచనలు స్తంభించి పోతాయి. ఒక సమస్యకు పరిష్కారం కనిపెట్టగానే, మరొక సమస్యను ఎదుర్కోవాల్సివస్తే, మళ్ళీ, మళ్ళీ, మనసు చికాకుపడిపోతుంది. పర్యవసానం, ఇతరులపై కోపం, కసి, ద్వేషం పెరిగిపోతాయి. తనపై తనకు కోపం పెరిగి, తను అసమర్ధుడినేమో అనే అపోహ కలిగి, చివరకు ఏమీ చేయలేని స్థితికి చేరుకుంటుంది మనసు. కాబట్టి, మనసుకు ప్రశాంతత కావాలి. మనసుకు బలం కావాలి.

ఈ పై సమస్యకు చక్కటి పరిష్కారం మన ఋషులు చెప్పినదే ” ధ్యాన క్రియ “. “ధ్యానం” అంటే: ధీ + యానం. “ధీ” అంటే మతి, లేదా బుద్ధి అని అర్ధం. “యానం” అంటే, ప్రయాణించటం. మతి లేదా బుద్ధి అనేవి “మనసుకు సంబంధించినవే”. అంటే, మనసుతో ప్రయాణించటం అని అర్ధం. శరీరంతో ప్రయాణిస్తాం కానీ, మనసుతో ప్రయాణించటం ఏమిటి అని అంటారా? అవును, ఇది సరిఅయినదే. మనం ఒక్క నిముషం, ఏ పనీలేకుండా కూచున్నామనుకోండి. మన శరీరం, కుర్చీలోనే వుంటుంది; కానీ, మన మనస్సు “అమెరికా” కు ఎగిరిపోతుంది. నిన్ననే చేతికి వచ్చిన “అమెరికా వీసా” విషయం మన మనసులో వున్నది కదా! అంటే, “మనసుతో ప్రయాణించాం గదా!!” అయితే, ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయమేమిటంటే, మామూలుగా వున్నప్పుడు, పనులను బట్టి, మన మనసు ఆలోచనలతోసహా ఇంకో చోటికి ప్రయాణిస్తుంది. అంటే, అక్కడ కూడా ఆలోచనలతో కూడిన “ట్రాఫిక్ జామ్”. కానీ, “ధ్యానం” లో, ఆలోచనలను ఎక్కడ వున్నవాటిని అక్కడే వదిలేసి, అనగా చెత్తను వదిలేసి  ఆలొచనలు లేని, చేరని కేంద్రానికి మనసు ప్రయాణిస్తుంది. ఈ కేంద్రాన్ని ” సమాధి కేంద్రం ” అని అనవచ్చు. అక్కడ వున్న మానసిక స్థితిని ” సమాధి స్థితి ” అని అనవచ్చు.
మరికొన్ని వివరాల్లోకి వెళ్దాం.
మనకు మూడురకాల శరీరాలున్నాయి. ఒకటి భౌతిక శరీరం; రెండవది: సూక్ష్మ శరీరం; మూడవది: కారణ శరీరం ( దీని విషయం మనకు ఇప్పుడు అంతగా అవసరం లేదు). భౌతిక శరీరంలో అన్నిరకాల అంగాలు వుంటాయి. సూక్ష్మశరీరంలో మనస్సు వుంటుంది. ఇందులోని అంతర్భాగాలే బుద్ధి, చిత్తం. ప్రకృతి ధర్మం వలన, భౌతిక శరీరం ఉదయం చాల చురుకుగా వుంటే, సాయింత్రానికి, కొంత చురుకుదనం తగ్గుతుంది. చీకటిపడిన తరువాత, మన మనసులోని ” ప్రకృతి గడియారం ” నిద్రవచ్చేటట్లుగా చేసి, భౌతిక శరీరానికి విశ్రాంతి నిస్తుంది. దీనిని నిద్రావస్థ అని అంటాం. ఇక్కడ మనస్సు కొంతమేరకు జాగృతావస్థలో కూడా వుంటుంది. కలలు అందువలనే వస్తాయి. అయితే, జాగృతావస్థలో వుంటూనే, శరీరాన్ని, నిశ్చలంగా వుంచి, మనసు నిద్రావస్థను దాటి, సమాధిస్థితికి వెళ్ళటమే ” ధ్యానం “. ఎన్నో పద్ధతలు అమలులో వున్నప్పటికీ, దీనికి శ్వాస మీద ధ్యాస అనగా ఆనాపానసతి ధ్యానం ఉత్తమం.
చేసే పద్ధతి:–  "ధ్యానం చేయడం ఎలాగ? ధ్యానం అంటే ఏమిటి? " ధ్యానం అంటే మన మనస్సుని ఖాళీ చేసుకోవడం . "యోగః  చిత్తవృత్తి నిరోధః ". దానికి మార్గం ఏమిటి?  - "శ్వాస మీద ధ్యాస", ధ్యానం కోసం భూమి మీద చాప వేసుకుని సుఖాసనంలో కూర్చోవచ్చు,లేదా కుర్చీలో కూర్చోవచ్చు.  కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలు రెండూ ఒకదానికి ఒకటి క్రాస్ చేసుకోవాలి, వ్రేళ్ళలో వ్రేళ్ళు పెట్టుకోవాలి ; వీలైనంతవరకు నిటారుగా కూర్చుని సహజసిద్దంగా జరుగుతున్న ఉచ్వాస నిశ్వాశాలను గమనించాలి. పడుకుని మాత్రం ధ్యాన అభ్యాసం చేయకూడదు. ముసలివాళ్ళు, కూర్చోలేనివాళ్ళు అయితే మాత్రమే పడుకుని చేసుకోవచ్చు. కూర్చోగలిగినవాళ్ళు, ఆరోగ్యవంతులైన వాళ్ళు మాత్రం విధిగా కూర్చునే ధ్యానం చేసుకోవాలి. ప్రారంభంలో గదిని వీలైనంత చీకటి చేసుకోవాలి. ఎవరి వయస్సు ఎంతో కనీసం అంత సేపు రోజూ రెండు పూటలా ధ్యానం చేయాలి. అలా చేసినప్పుడు .. శ్వాస తనంతట తాను చిన్నదిగా అయిపోతూ చివరికి ‘నాసికాగ్రం’ లో అంటే ‘భ్రూమధ్యం’ లో, అంటే ఆజ్ఞాచక్రస్థానం లో, అంటే సుదర్శనచక్రస్థానంలో తనంతట తాను సుఖంగా స్థితం అయిపోతుంది. అప్పుడు ఆ స్థితిలో మనం తదేకమై, తన్మయమై వుంటే .. “మూడవ కన్ను” యొక్క విస్పోటనం మొదలవుతుంది.’ .. అదే మూడవ కంటిచూపు -ముక్కంటి చూపు .. థర్డ్ ఐ విజన్ !
కళ్ళు రెండూ మూసేసుకోగానే ధ్యానానుభవాలు రావు. మొదట్లో రకరకాల ఆలోచనల పరంపర మొదలవుతుంది. ఏంతో సేపటికికానీ ఆ ఆలోచనల పరంపర శమించదు. ఆలోచనలు వస్తూంటాయి...., పోతుంటాయి... వాటిని ఎప్పటికప్పుడు ' కట్ ' చేసేసి మళ్ళీ మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడుతూండగా ఆ ఆలోచనల పరంపర యొక్క ప్రెషర్ తగ్గుతుంది. ఒక్కొక్క ఆలోచనా మటుమాయమైపోతూ చివరకి ఆలోచనా రహితస్థితి వస్తుంది.  అప్పుడు ధ్యానానుభవాలు మొదలవుతాయి.ఎప్పుడయితే ధ్యానస్థితిలోకి వెళ్తామో అంటే ఇక్కడ ఆలోచనా రహిత స్థితే ధ్యానస్థితి అప్పుడు ధ్యాననుభవాలు మొదలవుతాయి.ధ్యానం అయిపోయిన తరువాత లేచేముందు కళ్ళని ఒక్కసారిగా తెరవకండి. నెమ్మదిగా, రెండు చేతులు 5 సెకన్ల పాటు  ముఖం పై వుంచుకొని క్రమంగా కళ్ళు తెరవండి.
ఇంతకీ, ఈ ధ్యానంలో ఏం జరుగుతుంది? ఒక్కమాటలో చెప్పాలంటే, “ఎనర్జీ కన్జర్వేషన్”, అంటే, మనలోని ప్రాణశక్తిని, పొదుపుగా వాడటం జరుగుతుంది. మనసు, తనకుతానే, “స్వయం సలహ ( ఆటో సజెషన్ ) ద్వారా, భౌతికమైన చర్యలను క్రమబద్ధీకరించి, ఆలోచనలను అదుపులోనికి తెచ్చి, సమాధి స్థితిలోకి వెళ్ళ్తుంది. ఈ ధ్యానాన్ని నిత్యం సాధన చేయటంవల్ల కలిగే లాభాలు:
మన శరీరంలో కోట్లాది ” న్యూరాన్స్ ” వుంటాయి. ఇవి ఒక ప్రత్యేక కణ వ్యవస్థ. ఇందులోని కణాలు ఒకదానికి ఒకటి తగులుకొని వుంటాయి. ఒక గొలుసుకట్టుగా వున్నటన్నమాట. మెదడునుంచి వచ్చే ప్రతి ఆజ్ఞని ఇవి ఆయాభాగాలకు అతివేగంగా తీసుకువెళ్తుంటాయి . తిరిగి, ఆయా భాగాల నుంచి వచ్చిన ప్రతిస్పందనను మెదడుకు తీసుకువెళ్తాయి.

ఉదా:- చీకటిలొ వెళ్ళాలి. ఉన్న కొద్ది వెలుతురు, కంటికి సరిపోవుటలేదు. కంటినుంచి ఈ సమాచారాన్ని మెదడుకు అందచేస్తాయి ఈ న్యూరాన్స్. మెదడు, కంటిపాపను పెద్దదిగా చేసి చూడు అన్న ఆజ్ఞను కంటి కండరాలకు చేరవేస్తాయి. ఈ విధంగా అనేక పనులను అవిశ్రాంతంగా చేస్తూ వుంటాయి. రోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకు లేవాలి అనుకోని  సాధనచేస్తే, ఈ న్యూరాన్స్ మనలను సరిగ్గా అదే సమయానికి, అలారం వున్నా లేకపోయినా, నిద్ర లేపుతాయి.

ఈ న్యూరాన్స్, ఒక పనిని, అనేకమార్లు, ఒకే పద్ధతిలో చేస్తూవుంటే, ఆ పద్ధతిని ఎప్పటకీ గుర్తుపెట్టుకోగలవు. ధ్యాన ప్రక్రియలో కూడా, నిత్యం ధ్యానం చేస్తూవుంటే, ధ్యాన పద్ధతులను అవి గుర్తుపెట్టుకుంటాయి. అంటే, మనం ధ్యానం చేయటానికి కూర్చోగానే, శ్వాసపై ధ్యాసను పెంచటం; ఆలోచనలను అదుపులోకి తీసుకురావటం; తక్కువ గాలితో ప్రాణశక్తిని వాడుకోవటం; ఎంతసేపైనా కదలకుండా కూర్చొనే శరీర శక్తిని పెంచుకోవటం; శబ్దాలు వినవస్తున్నా వాటికి స్పందించకపోవటం, మనలోని ” ప్రకృతి సిద్ధంగావున్న జీవ గడియారాన్ని ” జాగృతి పరచకుండా వుండటంవంటి అతి ముఖ్యమైన పనులను క్రమబద్ధీకరించి, ఒక అలవాటుగా మన మనసులో నాటుకొనేటట్లు చేస్తాయి. దీనినే అభ్యాసం లేదా సాధన అని అంటాం.

పైవిధంగా మనం ధ్యానప్రక్రియను కొనసాగించినట్లైతే, మన మనసు అధీనంలోకి మన శరీరం, మనస్సు కూడా వస్తాయి. మనసు అధీనంలోకి మనసు రావటమేమిటంటారా? ఆత్రేయగారి పాట గుర్తులేదా? “మనసున మనసై” అని. అంటే, బాహ్య ప్రపంచంతో ఎక్కువుగా సంబంధం పెట్టుకొనే మనస్సు, తనలోని ప్రపంచంలోకి వెళ్ళి ప్రశాంతతను పొందుతుంది. దీనె వలనె మనపై మనకు మానసిక నియంత్రణ శక్తి కలుగుతుంది. ఇదే ” శక్తి ” మొట్టమొదట పేరాలో చెప్పుకున్న ” మానసిక ఒత్తిడి “ని తగ్గించ కలుగుతుంది. మానసిక బలాన్ని పెంచుతుంది. మానసికంగా అలసటను దూరం చేస్తుంది. కోపం, అసూయ, ద్వేషం మొదలైనవాటిని రూపుమాపుతుంది. ఏ సమస్యవచ్చినా, ప్రశాంతంగా ఆలోచించి, పరిష్కారాన్ని కనుక్కోగలుగుతుంది. అందుకే అన్నారు: ” మనసుంటే మార్గమే ఉండదా? ” అని.

ఉపసంహారం:- ధ్యాన ప్రక్రియ కుల, మతాలతో సంబంధం లేదు. ఇందులో ఎటువంటి మంత్రాలు, యంత్రాలు లేవు. గాలికి కులమేది? ఆ గాలి అనబడే ప్రాణశక్తిని, శ్వాస ప్రక్రియ ద్వారా మనం పొందుతాం. అటువంటి శ్వాస మీద ధ్యాస పెట్టటమే ఈ ధ్యానం అనేది. “అన్ని జబ్బులకు మనసే కారణమని” ఆధునిక వైజ్ఞానిక శాస్త్రాలుకూడా నమ్ముతున్నాయి. ధ్యానం ద్వారా, మానసిక ప్రశాంతతను పొందినప్పుడు, గొలుసుకట్టు మానసిక మరియు శారీరక జబ్బులు రావు. కోటి పూజలుకన్నా ఒక జపం; కోటి జపాలుకన్నా ఒక మంత్రం; కోటి మంత్రాలుకన్నా ధ్యానం అత్యున్నతమైనది అని పెద్దలు చెప్పారు.
” పిరమిడ్ ” ను ఉపయోగించి కూడా ధ్యానం చేయవచ్చు. ఇది ధ్యాన ప్రక్రియను 3రెట్లు  వేగవంతం, ధృడవంతం చేస్తుంది.  ఇంత అద్భుతమైన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పత్రీజీ గారికి ప్రణామములు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి