13, మార్చి 2020, శుక్రవారం

శ్రీ ఆంజనేయ స్వామి

శ్రీ ఆంజనేయ దండకం
శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రబాధివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజేవాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం
భజే సూర్య మిత్రం భజే రుద్రరూపం
భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు
సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి
నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ
నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండనై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్
నీ కటాక్షంభునన్ జూచితే వేడుకల్ చేసితే
నా మొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాస్వయా దేవ
నిన్నెంచ నేనెంతవాడన్
దయాశాలివై జూచితే ధాతవై బ్రోచితే
దగ్గరన్ నిల్చితే తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై
స్వామి కార్యార్దమై యేగి
శ్రీరామ సౌమిత్రులన్ జూచి వారిఁవిచారించి
సర్వేశు బూజించి యబ్బానుజుం బంటు గావించి
యవ్వాలినిన్ జంపించి కాకుత్త్స తిలకున్ దయాదృష్టి వీక్షించి
కిష్కిందకేతెంచి శ్రీరామ కార్యార్దమై లంక కేతెంచియున్
లంకినిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భుమిజన్ జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి
యారత్నమున్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతుష్టునింజేసి
సుగ్రీవునిన్ అంగదున్ జాంబవంతాది నీలున్నీలున్ గూడి
యాసేతువున్ దాటి వానరుల్మూకలై పెన్మూకలై
యా దైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి
బ్రహ్మాండమైనట్టి యా శక్తినివేచి యాలక్ష్మణున్ మూర్చనొందింపగానప్పుడే నీవు
సంజీవినిందెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదులన్ వీరులంబోర శ్రీరామ బానాగ్ని
వారందరిన్ రావనున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ
నవ్వేళను విభీషణున్ వేడుకన్ దోదుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,
యంతన్నయోద్యాపురింజొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా
నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్బాయునే భయములున్
దీరునే భగ్యముల్ గల్గునే సాంరాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో
వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర
నీవే సమస్తంబుగా నెంచి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరముగన్
వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరమ శ్రీరమయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్
తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహంబు తైలోక్య సంచరివై రామ
నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల
కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్
పిశాచంబులన్ శాకినీ డాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలంబడంగొట్టి నీముష్టి ఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి,
కాలాగ్ని రుద్రండవై బ్రహ్మప్రభా భాసితంభైన నీదివ్యతేజంబునున్ జూచి,
రారనాముద్దునరసింహాయంచున్,
దయాదృష్టివీక్షించి,
నన్నేలు నాస్వామి ! నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే ! వాయుపుత్రా నమస్తే !
నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః
—————————————————————————-
 హనుమంతుని ఈ 12 నామాలు, పడుకొనేముందు, ప్రయాణ సమయమున పఠించిన మృత్యుభయం ఉండదు. సర్వత్రా విజయం కలుగును.
హనుమంతుని ద్వాదశనామాలు
హనుమా, అంజనాసుతః, వాయుపుత్రో, మహాబలః
రామేష్టః, ఫల్గుణ సఖః, పింగాక్షో మిత విక్రమః
ఉధధిక్రమణశ్చ్చైవ, సీతాశోక వినాశకః
లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః, తస్య మృత్యు భయం నాస్తి సర్వత్రా విజయీ భవేత్
“రామ”నామ విశిష్టత
రావణాసురుని చంపిన తర్వాత అయోధ్యానగరం చేరుకున్న శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేపట్టాక, అయోధ్యానగరంలో రామసభ కొలువుదీరి వున్న సమయంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి సభకు వచ్చాడు. మహర్షిని చూస్తూనే రాముడితో సహా సభలోని అందరూ లేచి నిలబడి మహర్షికి నమస్కరించారు. కానీ ఆంజనేయుడు రామనామ జపంలో మునిగి వుండటం వల్ల విశ్వామిత్రుడి రాకను గమనించక నిలబడలేదు, నమస్కరించలేదు. దీనిని ధిక్కారంగా భావించిన విశ్వామిత్రుడు కోపంతో “రామా ! నీ సేవకుడు నన్ను అవమానించాడు. నీవు అతడిని శిక్షించు” అని రాముడిని ఆదేశించాడు.
విశ్వామిత్రుడి మాటను జవదాటలేని శ్రీరాముడు హనుమంతుడిని శిక్షించేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన హనుమంతుడు నారద మహర్షి సలహా మేరకు ‘రామ’ నామాన్ని జపించడం మొదలుపెట్టాడు. ఈ సమయంలోనే విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు హనుమంతుడిపై బాణాల వర్షం కురిపించసాగాడు. ‘రామ’ నామ జపంలో నిమగ్నమైన ఆంజనేయుడిని రామబాణాలు ఏమీ చేయలేకపోయాయి. అలసిపోయిన శ్రీరాముడు పట్టుదల అధికంకాగా చివరకు బ్రహ్మస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు. ఈలోగా నారదమహర్షి అక్కడకు చేరుకుని “మహర్షీ! హనుమంతుడు నీ రాకను రామనామ జపం వల్ల గమనించక నమస్కరించనంత మాత్రమున మీరు మరణదండన విధించమనాలా? ‘రామ’ నామ జపం హనుమంతుడిని రామ బాణాల నుంచి రక్షిస్తూ వుంది. ఇప్పటికైనా మీ ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకుని ఆజ్ఞను ఉపసంహరించండి” అని విశ్వామిత్రుడితో చెప్పాడు.
ఈ మాటలను విని విశ్వామిత్రుడు బ్రహ్మస్త్ర ప్రయోగాన్ని నిలుపుదల చేయించి హనుమంతుడి రామభక్తిని మెచ్చుకున్నాడు. దీనిని బట్టి రామబాణం కంటే కూడా రామనామం గొప్పదని అర్థమయింది. యుగయుగాలకు సర్వలోకాలను తరింపజేసిన మహిమాన్వితమైన నామం ‘రామనామం
———————————————
ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా చేస్తె ……….!!
గమనిక – ఈ పరిహారాల్లో దేన్నైనా… ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా చేయాలి. స్త్రీలు మధ్యలో విరామం ఇచ్చి తిరిగి ప్రారంభించి 41 రోజులు పూర్తి చేయవచ్చు.
1. అనారోగ్య సమస్యలు బాధిస్తున్నప్పుడు
అవనూనెతో దీపారాధన – ఆరోగ్యం
2. ఉపద్రవాలు ఆటంకాలు తొలగడానికి
గోధుమలు, తెల్ల నువ్వులు, మినుములు, పెసలు, బియ్యం – ఈ ఐదింటిని పిండి చేసి, దీపప్రమిదగా చేసి, అందులో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.
3. పెళ్ళి చూపుల్లో ఆకర్షణ ఏర్పడి వివాహం కావడానికి
బియ్యపు పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి
4. శని వల్ల వచ్చే దోషాలు, తీవ్రమైన కష్టాలు, గాలిధూళి దోషాలు తొలగడానికి
నల్ల నువ్వుల పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి
5. కోరికలు నెరవేరేందుకు
బియ్యపు పిండి, గోధుమ పిండి సమపాళ్ళలో కలిపిన ప్రమిదలో దీపారాధన చేయాలి
6. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నిలవడానికి
కందిపిండితో చేసిన ప్రమిదలో దీపారాధన చేయాలి
7. దృష్టి దోషాలు పోయి, శత్రువుల మీద విజయం సాధించడానికి
పొట్టు తీయని మినుముల పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి
8. వివాహం కాని వారికి వివాహం అయ్యేందుకు
ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, నువ్వుల నూనెలో కలిపి, దాంతో దీపారాధన చేయాలి.
పువ్వులకంటే ఆకు పూజతో ప్రసన్నుడయ్యే హనుమంతుడు ….!!
హనుమంతుడు పూలతో కూడిన పూజతో కంటే ఆకు పూజకే అధిక ప్రాధాన్య ఇస్తాడని పండితులు అంటున్నారు. హనుమంతుడికి ఆకుపూజ చేస్తే అనేక గండాలు, ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.
హనుమంతుడు ఆకుపూజకు ఇష్టపడటం ఎందుకంటే.. హనుమంతుడు లంకానగారానికి వెళ్లి సీతమ్మవారి జాడను తెలుసుకుంటాడు. ఆమెకి ధైర్యం చెప్పి .. శ్రీరాముడి సైన్యం పట్ల లంకానగర వాసులకు భయం కలిగేలా చేస్తాడు. ఆ తరువాత అక్కడి నుంచి తిరిగి వచ్చి రాముడిని కలుసుకుని .. సీతను చూసిన విషయం చెబుతాడు.
సంతోషించిన శ్రీరాముడు అక్కడ గల తమలపాకులను తెంపి మాలగా చేసి ఆయన మేడలో వేసి అభినందిస్తాడు. శుభవార్తను తెచ్చినవారికి తమ దగ్గర గల ఖరీదైన వస్తువును బహూకరించడం అప్పట్లో ఒక సంప్రదాయంగా ఉండేది. రాముడు వనవాసంలో ఉన్నాడు … ఇక హనుమంతుడు లంకా నగరంలోని కొన్ని భవనాలను తగలబెట్టి మరీ వచ్చాడు. అందువలన ఆయన శరీరం వేడిగా ఉండటంతో, తాపాన్ని తగ్గించడం కోసం రాముడు ఆయన మెడలో తమలపాకుల మాలను వేసినట్టు పురాణాలు చెబుతున్నాయి.
ఆ తమలపాకుల మాల మెడలో పడగానే అప్పటివరకూ హనుమంతుడు పడిన శ్రమనంతా మరిచి సంతోషంతో పొంగిపోయాడు. అందుకే తమలపాకులతో పూజ చేస్తే కోరుకున్న వరాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని పురోహితులు చెబుతున్నారు.
______________
ఉత్తరభారత దేశంలో క్రీ.శ. 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాసును సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ,ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెప్తాడు. తులసీదాస్ రచించిన ‘రామచరిత మానస్’ సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకధను సుపరిచితం చేసింది.

వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండే వాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయ్యేవి. ఆ ప్రభావంతో ఎందరో మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి అక్బర్ బాదుషా కు తరచుగా ఫిర్యాదులు వచ్చేవి. అయితే అక్బర్ ఇవేమీ అంతగా పట్టించుకోలేదు.

ఇది ఇలాగ ఉండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థు,తన ఏకైక కుమారునికి చక్కని అమ్మాయితో వివాహం జరిపించారు. వారిద్దరు ఆనందంగా జీవితం సాగిస్తూ ఉండగా ,విధి వక్రించి ఆ యువకుడు కన్ను మూశాడు. జరిగిన దారుణానికి తట్టుకోలేకపోయిన అతని భార్య హృదయవిదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకుడికి అంత్యేష్టి జరగకుండా అడ్డుపడుతున్న ఆమెను బంధువులంతా ఆపుతూ ఉండగా… ఆమె అక్కడే ఉన్న  తులసీదాస్ ఆశ్రమానికి వెళ్ళి ఆయన పాదాల వద్ద పడి రోదించసాగింది. అప్పుడు ఆయన రామనామ ధ్యానంలో ఉన్నారు. హఠాత్తుగా కన్నులు విప్పి ఆమెను చూసి ‘దీర్ఘసుమంగళీ భవ’ అని దీవించారు. అప్పుడు ఆమె జరిగినది అంతా తులసీదాస్‌కు విన్నవించుకుంది. అప్పుడు తులసీదాస్ `నా నోట అసత్యం పలికించడు రాముడు’…అని అంటూ.. అప్పుడు ఆయన వారి కమండలంలో జలమును తీసి ఆ యువకుని దేహం మీద చల్లగానే అతనికి ప్రాణం లేచి వచ్చింది. ఆ మరుక్షణం అతను పునర్జీవితుడయ్యాడు.

ఈ సంఘటన ప్రత్యేకించి తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామ భక్తులుగా మారేవారి సంఖ్య నానాటికి ఎక్కువ అయిపోసాగింది. ఇంక ఉపేక్షించితే కుదరదని గ్రహించిన ఇతర మత పెద్దలంతా పాదుషా వద్దకు వెళ్ళి జరుగుతున్నవి వివరించి తగిన చర్య తీసుకోవలసిందిగా ఒత్తిడి తెచ్చారు. అప్పుడు ఆ పాదుషా వారు తులసీదాస్‌ను తన దర్బార్లోకి రప్పించారు. అప్పుడు ఆయనతో విచారణ ఇలా సాగింది.

‘తులసీ దాస్‌మీరు రామనామం అన్నిటి కన్నా గొప్పది అని ప్రచారం చేస్తున్నారట?’ అని పాదుషా ప్రశ్నించారు. అందుకు తులసీదాస్ ‘అవును ప్రభూ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీ రాముడే ప్రభువు! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరం కాదు..’ అని బదిలిచ్చాడు. మరల పాదుషా ‘ సరేమేము ఇక్కడ ఒక శవాన్ని చూపిస్తాము ..దానికి ప్రాణం పోయండి.. రామ నామంతో బతికించండి.. అప్పుడు మీరు చెప్పినది నిజమని మేము నమ్ముతాము’ అని సమాధానం చెబుతాడు. అందుకు తులసీదాస్ ‘క్షమించండి ప్రభూ! ఫ్రతి జీవికి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్ఛానుసారం జరుగుతాయి. మానవమాత్రులు మార్చలేరు.. అని సమాధానం చెప్పాడు. మరల పాదుషా ‘ అయితే తులసీ దాస్ జీ! ఈ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవి అన్నీ అబధ్ధాలు అని సభాముఖముగా అందరిముందు ఒప్పుకోండి!’ అని అంటాడు. అప్పుడు తులసీదాస్ ‘క్షమించండి నేను చెప్పేది నిజం!’ అని బదులివ్వడంతో పాదుషాకి పట్టరాని ఆగ్రహం వచ్చింది. ‘తులసీ  మీకు ఆఖరిసారి అవకాశం ఇస్తున్నాను నీవు చెప్పేవన్ని అబద్ధాలు అని ఒప్పుకో..నీవు చెప్పేవన్నీ అబద్ధాలు అని చెప్పి నీ ప్రాణాలు దక్కించుకో..’ అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీ రామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు. అది రాజ ధిక్కారముగా భావించిన పాదుషా తులసీదాస్ ని బంధించమని ఆదేశించాడు.

అంతే ! ఎక్కడ నుండి వచ్చాయో..కొన్ని వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్‌ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని ,వారిపై గురిపెట్టి కదలకుండా చేశాయి. ఈ హఠాత్తు సంఘటనతో అందరు హడలిపోయి ఎక్కడివారు అక్కడ స్థాణువులై పోయారు.

ఈ కలకలానికి కనులు విప్పిన తులసీ దాస్‌కు సింహద్వారంపై హనుమంతులవారు దర్శనం ఇచ్చారు. ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశారు. ఆ స్తోత్రంతో ప్రసన్నుడైన హనుమ ..  తులసీ ! నీ స్తోత్రముతో మాకు చాలా ఆనందమైనది..ఏమి కావాలో కోరుకో. అన్నారు..అందుకు తులసీదాస్ తండ్రీ! నాకేమి కావాలి.! నేను చేసిన ఈ స్తోత్రము లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు,నా జన్మ చరితార్ధమవుతుంది. నా ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు వేడుకున్నా,వారికి అభయం ప్రసాదించు తండ్రీ! అని కోరుకుంటాడు.  ఆ మాటలతో మరింత ప్రీతి చెందిన హనుమ ‘తులసి ! ఈ స్తోత్రంతో మమ్మల్ని ఎవరు స్తుతించిన,వారి రక్షణ భారం మేమే వహిస్తాము’ అని వాగ్దానం చేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు హనుమాన్ చాలీసా కామధేనువు అయి భక్తులను కాపాడుతూనే ఉంది. అపర వాల్మీకి అయిన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక హనుమాన్ చాలీసా దాదాపు 500 ఏళ్ళ తరువాత కూడా ప్రతి ఇంటా హనుమాన్ చాలీసా పారాయణ, గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామ జ్యోతి ఎప్పటికి వెలుగుతూనే ఉన్నది శ్రీ రామ జయ రామ జయ జయ రామ.


శ్రీమదాంజనేయ కల్యాణము
శ్రీ ఆంజనేయ స్వామి అజన్మ బ్రహ్మచారి.. యజ్ఞోపవీతము ధరించే పుట్టినవాడు. ఘోటక బ్రహ్మచారి అయినా వివాహము చేసుకున్నాడు.. వివాహము చేసుకున్నా కూడా బ్రహ్మచారిగానే మిగిలిపోయినాడు.. లోక కల్యాణము కోసము హనుమంతులవారు మొదట తన కల్యాణము చేసుకోవలసి వచ్చింది.. పరాశర సంహితలో ఆసక్తికరమైన ఈ ఉదంతము ఉంది.
ఒకప్పుడు సూర్యదేవుడు , విశ్వకర్మ కూతురైన సంజ్ఞాదేవిని పెళ్ళాడతాడు. అయితే , సంజ్ఞా దేవికి సూర్యుని తాపమును తట్టుకొను శక్తి లేదు..ఖిన్నురాలై , తన తల్లికి తన కష్టాన్ని చెప్పుకుంటుంది.. కూతురి సమస్యను అర్థము చేసుకున్నదై, ఆమె తల్లి , విశ్వకర్మకు సంగతి విశదీకరిస్తుంది.
విశ్వకర్మ , సూర్యుడి ప్రకాశమును కొంత తీసివేస్తాడు. సూర్యునినుండీ బయట పడ్డ ఆ ప్రకాశము , ఒక సుందరమైన కన్యగా మారుతుంది. ఆమె రూప లావణ్యములను చూసి దేవతలే భ్రాంతి చెందుతారు. సంగతేమిటో తెలుసుకోవాలని ఇంద్రుడు , బ్రహ్మ దేవుని వద్దకు వెళ్ళి , ” ఆ కన్య ఎవరు ? ” అని అడుగుతాడు. ఇంద్రుడి ఉద్దేశము కనిపెట్టిన బ్రహ్మ ,ఆమెకు కాగల పతి శివాంశ సంభూతుడైన హనుమంతుడు తప్ప వేరొకరు కారు అని చెబుతాడు.
బాల హనుమంతుడు తల్లి అంజనా దేవి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగి , ఆమె అనుజ్ఞ మేరకు సూర్యుని దగ్గర విద్యాభ్యాసము చేస్తాడు. శిక్షణ పూర్తికాగానే గురువు వద్దకు వచ్చి వినమ్రుడై , ” గురుదేవా , నా శిక్షణ పూర్తయిందని తమరి అనుజ్ఞ అయినది , నాకు ఇక వెళ్ళుటకు అనుమతినీయండి , మీకు గురు దక్షిణగా ఏమివ్వవలెనో చెప్పండి ” అంటాడు.
” శివాంశతో పుట్టినవాడవు , ఆంజనేయా , నిన్ను నేనేమని కీర్తించను ? సాగర మథనములో పుట్టిన గరళాన్ని జగద్రక్షణ కోసము మింగిన సాక్షాత్తూ ఆశివుడవే నువ్వు. నువ్వు వాయు దేవుడి పుత్రుడవు కూడా.. అగ్నికి పుత్ర సమానుడవు. మనము గురుశిష్యులమన్నది కేవలము ఔపచారికము మాత్రమే.. అయిననూ , అడిగినావు గనక , విను… విశ్వకర్మ , నాలోని ప్రకాశమును కొంత వేరుపరచినాడు. ఆ నాయొక్క ప్రభ ఇప్పుడు నా కూతురు రూపములో ఉన్నది. నా కాంతి నుండీ పుట్టిన నా కూతురు సువర్చలా దేవిని నీకిచ్చి వివాహము చేయవలెననునది నా కోరిక. ఇదే నువ్వు నాకు ఇవ్వవలసిన గురు దక్షిణ ” అంటాడు సూర్యుడు.
హనుమంతుడు వినీతుడై సూర్యునికి తలవంచి , రెండు చేతులూ జోడించి నమస్కరించి , ” దేవా , నేను బ్రహ్మచర్యమును పాలించవలెనని తీర్మానించుకున్నాను.. అది మీకు తెలిసినదే కదా .. నా జీవన లక్ష్యము అదే. నేనీ వివాహము ఎలా చేసుకోగలను ? ” అని అడుగుతాడు.
సూర్యుడు ఉత్తరమిస్తాడు , ” సువర్చల దైవాంశ సంభూతురాలు. నేను నీకొక వరమునిస్తాను. నువ్వు ఆమెను పెళ్ళాడిననూ , ప్రాజాపత్య బ్రహ్మచారిగనే మిగిలిపోతావు. నీ ఈ వివాహము కేవలము జగత్కల్యాణము కోసమే తప్ప , నీ వ్రత భంగానికి కాదు. నువ్వు యజ్ఞోపవీతము ధరించియే పుట్టినవాడవు కాబట్టి పుట్టిన క్షణమునుండే నువ్వు బ్రహ్మచారివి. భవిష్యత్తులో , కలియుగానంతరము , ప్రళయానంతరము తరువాత తిరిగి జరగబోయే సృష్టికి నువ్వే బ్రహ్మవవుతావు. నువ్వు బ్రహ్మదేవుని పదవిని అలంకరించిన తరువాత , సువర్చలాదేవి వీణాపాణియైన ఆ వాణి స్థానములో ఉంటుంది. ”
సందేహ నివృత్తి అయిన హనుమంతుడు , సూర్యుని ఆజ్ఞమేరకు సువర్చలా దేవిని వివాహమాడుతాడు. హనుమంతుని కల్యాణమైన దినము , జ్యేష్ఠ శుద్ధ దశమి.. [ ఈ నెల పదునాలుగో తారీఖు..మంగళ వారమే కావడము విశేషము ]
ఆ దినము ఉత్తరా నక్షత్రము ఉండినది.
హనుమంతుని కల్యాణము ఆనాడు చేయుట ఆనవాయితీ అయినది. హనుమ పూజలో అగ్ని సూక్తముతోను , [ పంచామృతములతోను కూడా ] హనుమంతుడికి అభిషేకము [ విగ్రహ శోధన ] చేస్తారు. సువర్చలా పూజనుకూడా తమలపాకులపై సువర్ణ సహిత పుష్పాక్షతలతో చేస్తారు.
భక్తులందరూ ఈ హనుమ కల్యాణ గాథను చదివి తరింతురు గాక
|| శుభమస్తు ||
______________
ఆంజనేయస్వామిని పూజిస్తే కలిగే ఫలితాలు…..!!!
స్వామికి తమలపాకులతో చేసే పూజ అత్యంత ప్రియం. సహస్ర నామార్చన, అష్టోత్తరములతో తమలపాకులు సమర్పించిన శుభం కలుగుతుంది. తమలపాకులు పూజకు ఉపయోగించుట మంగళకరం.
శతవృద్ధ జిల్లేడు, తెల్లజిల్లేడు వేరు చెక్కతో హనుమంతుని ప్రతిమను చేయించి అరటితోటలో పూజించుట వలన సత్వరం హనుమంతుడు అనుగ్రహిస్తాడు. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితాలను ఇస్తుంది.
అరటిపండ్ల నివేదన, సింధూర సమర్పణ, శని, మంగళవారములలో తమలపాకులతో పూజ హనుమంతుని ఆరాధనలో ముఖ్యమైనవి. ఒకసారి సీతమ్మవారి పాపిట సింధూరాన్ని రాముడు ఇష్టపడతాడని తెలుసుకొని తన ఒంటినిండా సింధూరం పూసుకొన్న రామభక్తుడాయన. అందుకే స్వామికి సింధూరం అత్యంత ఇష్టమైనదిగా చెప్తారు.
హస్తమృగశీర్షానక్షత్రములతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులు. భూత, ప్రేత పిశాచాది బాధలు, రోగాలు, కష్టాలు తొలగడానికి అభీష్టసిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణములు శ్రేష్ఠం.
స్వామి మహిమలు పరాశర సంహిత, ఉమాసంహిత, హనుమ సంహిత తదితర గ్రంథాలు చెబుతున్నాయి.
హనుమారాధన భోగ, మోక్షములను రెండింటినీ ఇస్తుంది. రామ భజన ఎక్కడ జరుగుతున్నా హనుమంతుడు వచ్చి కూర్చుంటాడని భక్తుల విశ్వాసం.
శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు ఎలా చేయాలి?
……………………………………………….
హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. ‘ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా’ అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ, భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు, అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు, పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం.
‘శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్’
శ్లో|| ఆంజనేయం మహావీరం-బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభంశాంతం – రామదూతం నమామ్యహం
శ్లో|| మర్కటే శ మహొ త్సాహ- సర్వశోక వినాశన
శత్రూన్సంహర మాం రక్ష – శ్రియం దాపయ మే ప్రభో||
అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి
”యాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు”
అని జలాన్ని అక్షతలతో వదలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం, శిర స్స్నానం, నేలపడక, సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.
ఆచరణ: భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పివారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వారా తోలగునట్లు చేయాలి. హనుమత్ప్ర దక్షిణ ధ్యానం శీలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెలపాలి.
* అభి షేకం
పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. అందులోనూ మన్యు సూక్త అభిషేకస్తే పరమానంద భరితుడు అవుతాడు, కోరికల్ని తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి. వారం వారం, నిత్యమూ చేయగలగటం మరీ మంచిది.
ఆచరణ : మన్యుసూక్తం నేర్చుకొని భక్తులకు దాని విలువ తెలిపి ప్రతి పర్వదినానా దాతల ద్వారా అభిషేకం జరిపింపజేయాలి
* మంగళ వార సేవ
మంగళవారంనాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం చాల ఇష్టం. అంతా కుదురనివారు మూతికయినా తప్పక పూయాలి. సింధూరార్చన చేయటం, అరటి పండ్లు నివెదించటం చేయాలి. అందుకు కారణమైన విశేషగాధ ఉంది.
* శనివార సేవ
హనుమంతుడు శనివారం జన్మించాడు. కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. నాడు యథాశక్తి విశేషార్చన, సహస్రనామాదికం చేయాలి. భక్తులచే అప్పాలు, వడ మాల వంటి విప్రోత్సహించి చే యించి స్వామికి సంతృప్తి కలిగించాలి.
* పంచ సంఖ్య
హనుమంతుడు పంచ (ఐదు) సంఖ్య ఇష్టం కాబట్టి చెస్వ ప్రదక్షిణాలు, నమస్కారాలు ఐదు చేయాలి. అరటి పండ్లు వంటి వేవ యినా ఐదు సంఖ్యలలో సమర్పించుట స్వామికి ప్రీతికరం.
* హనుమజ్జయంతి
హనుమంతుడు వైశాఖ మాసంలో, కృష్ణ పక్షంలో, దశమితిథి పూర్వభాద్రా నక్షత్రం, శనివారం, కర్కాటక లగ్నంలో, వైదృతి యోగంలో జన్మిచాడు. ఇవి ఖగోళాది సకల ప్రమాణాలతో ఏ, కల్పంతర గాధలను బట్టి ఎవరో చేప్పారని భిన్న భిన్న తిథులలో హనుమజ్జయంతి కొందరు జరుపుతున్నారు. సాధారణంగా మే నెలలో వచ్చే వైశాఖ బహుళ దశమినాడు తప్పక జయంతి జరపాలి. వీటిని పంచాహ్మికంగా ఐదు రోజులు ఇలా శక్తి కొలది జరుపవచ్చు. విశేషార్చనలు సామూహిక కార్యక్రమాలు నిర్వహించాలి.
ఆచరణ : సంవత్సరంలో ఈ ఒక్క జయంతినాడ యినా భక్తులను మారేడుదళం, సింధూరం మల్లెపూలు లేదా త ములపాకులు, తులసిదళం, ప్రత్సహించి లక్షార్చన వంటి వాటితో జరిపించాలి.
శాస్త్రమునందు హనుమకు వివాహం అయింది. ఆయనను సువర్చలా సహిత హనుమ అని పిలుస్తారు. సువర్చలా సహిత హనుమకు కళ్యాణం చేయడం శాస్త్రంలో అంగీకరించారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళకుంటే పెద్దలైనటువంటివారు తరించరు. శాస్త్రంలో హనుమకు ప్రవర ఉన్నది. తండ్రిగారు కేసరి, తాతగారి పేరు, ముత్తాతగారిపేరు కళ్యాణంలో చెప్తారు. హేమగర్భుడు అని వారి ముత్తాతగారి పేరు. ఒకతండ్రి కడుపున పుట్టిన పిల్లవాడు వివాహం చేసుకోకుండా ఉండిపోతే తల్లిదండ్రులు దేహములు చాలించిన తరువాత వారి శరీరాలను చెట్లకి త్రిప్పి కట్టేస్తారు. ఎందుకంటే నువ్వు వివాహం చేసుకోనటువంటి సంసార భ్రష్టుడిని కన్నావు కనుక అని. అందుకని పిల్లలు వివాహం చేసుకోకుండా ఉండకూడదు. అలా చేయడం తల్లిదండ్రులయొక్క ప్రధానమైన బాధ్యత. నవ వ్యాకరణపండితులు, మహా బుద్ధిమంతుడైన హనుమ వివాహం చేసుకోకుండా అటు సన్యాసం తీసుకోకుండా ఉండరు కదా! మీకు అందుకే భారతీయ సంప్రదాయంలో ఋషులందరూ వివాహం చేసుకొని ఉంటారు. అలాగే హనుమ కూడా శాస్త్రమునకు సంబంధించినంతవరకు గృహస్థాశ్రమంలో ఉంటారు. కాపురం చేసినట్లు, పిల్లల్ని కన్నట్లు లేదు. ఎందుకంటే ఆయన బ్రహ్మజ్ఞాని. అందుచేత సువర్చలను వివాహం చేసుకున్నారు. ఇద్దరూ యోగమును అనుసంధానం చేశారు.
______________

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి