8, నవంబర్ 2018, గురువారం

ప్రయాణం అంటే పరిగెత్తటడం కాదు🔥

ప్రయాణం అంటే పరిగెత్తటడం కాదు🔥

🔺 పదార్థం వెంట పరిగెత్తడం ఆపితేనే, యదార్థం వైపు ప్రయాణం మొదలవుతుంది ..

🔺 కోట్లజన్మల నుండి పరిగెత్తుతూనే ఉన్నాము. ఇప్పుడైనా పరుగు ఆపాలి, "భ్రమ"కు, "బ్రహ్మ"కు మధ్య తేడాను పట్టుకోవాలి...

🔺 బాహ్యంలో పరుగు ఆపితేనే అంతర్ముఖ  ప్రయాణం మొదలవుతుంది...

🔺 శరీరం అనేది సాధనం , శరీరపోషణకు కాదు 'సత్య శోధనకు' అని గ్రహించాలి...

 🔺 అసత్యం వెంట పరిగెత్తడంలో ,కాళ్ళు అరుగుతాయి, కీళ్లు విరుగుతాయేతప్ప శరీరంలో గ్రుచ్చుకున్న ఆత్మ అనే ముళ్ళు మాత్రం విరుగదు...

🔺 మాంసనేత్రం మాయను మోహిస్తుంది,మనోనేత్రం మర్మాన్ని గ్రహిస్తుంది...

🔺 అసత్యం వెంట పెట్టే పరుగు చీకటిని చూసి ఆగిపోతుంది ...

🔺 అసలైన ప్రయాణం చీకటిని చీల్చుకుని వెలుతురువైపుకి సాగుతుంది...

🔺 అహం కోసం పరిగెత్తడంలో దేహం  అలుస్తుంది...

🔺 అహం నశించినాడు జీవం, దైవంలో కలుస్తుంది...

🔥ఈ శరీరంతో పరమాత్మను వెతకగలిగితే , మళ్ళీ ఇంకోశరీరాన్ని వెతికే అవసరం జీవాత్మకు   ఉండదు...

🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♀🧘‍♀🧘‍♀🧘‍♀🧘‍♀

ప్రయాణం

పూర్వం ఒక అమాయకుడు సాయంత్రం ఆరు గంటలకు పొరుగూరికి బయలుదేరాడు. చీకటి గనుక లాంతరు, అగ్గిపెట్టె వెంట తీసుకెళ్ళాడు. బాగా చీకటి పడడంతో దారి కనిపించడం లేదు. అందుకే లాంతరు వెలిగించాడు. వెంటనే ఏదో ఒక ఆలోచన వచ్చి చతికిలబడి కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడు. దారిలో వస్తున్న బాటసారి "ఎందుకయ్యా ఏడుస్తున్నావ్" అన్నాడు. "బాబూ ఏమని చెప్పేది..... నేను నాలుగు మైళ్ళు ఈ చీకట్లో పోవాలి... ఈ లాంతరు వెలిగిస్తే పది గజాల దూరం కన్నా ఎక్కువ కాంతి పడడం లేదు. ఎక్కడి నాలుగుమైళ్ళు? ఎక్కడి పది గజాలు? ఈ పది గజాలు దాటితే ఆ కటిక చీకట్లో ఎలా ప్రయాణిస్తాను?" అన్నాడు.
 అతడి వెర్రికి నవ్వుకుంటూ.... "ఓరి వెర్రివాడా! లేచి లాంతరు పట్టుకొని నడక సాగించు.... నీవు ఎంతదూరం వెళ్ళినా ఈ పది గజాల దూరం కాంతి పడుతూనే వుంటుంది.... నాలుగు మైళ్ళు కాదు.... నలభై మైళ్ళు అయినా వెళ్ళవచ్చు" అన్నాడు. దానితో అతడు ప్రయాణం సాగించి గమ్యాన్ని చేరుకున్నాడు.
 అలాగే మనం శాస్త్ర శ్రవణం ద్వారా ఆత్మను గురించి తెలుసుకొని ఆ ఆత్మను నేనేనని తెలుసుకొని ఆత్మధ్యాన సాధన కొనసాగించాలి. అలా నిత్యం సాధన చేయగా, చేయగా గమ్యంవైపు.... ఆత్మవైపు...... "స్వస్ధితి" వైపు ప్రయాణం సాగుతుంది. ఒకనాటికి ఆత్మతో ఏకమై ఆత్మగా వుండిపోవడం జరుగుతుంది. అలాగాక నిరాశతో కూర్చుంటే ఏనాటికీ గమ్యం చేరుకోలేం. నడక సాగిస్తే చాలు.... చీమ కూడా వేలమైళ్ళు ప్రయాణిస్తుంది... కదలకుండా కూర్చుంటే గరుత్మంతుడైనా సరే ఒక్క అడుగు ముందుకు వేయలేడు.

“పిరమిడ్ ధ్యానం”


Pyramid-Northపిరమిడ్‌లో కూర్చుని ధ్యానం చేయడం వల్ల మూడు రెట్లు అధిక విశ్వశక్తి లభిస్తుంది. పిరమిడ్ అనేది ఒక భూతద్దం (Magnifying Glasses) లాంటిది. సూర్యుడి కిరణాలు అన్ని వైపులా ఉన్నాయి, కానీ ఆ సౌరశక్తి కంటికి కనిపించదు. అయితే ఒక కాగితం ముక్కను ఆ భూతద్దం క్రింద వుంచితే, అదే సౌరశక్తితో కాగితం మాడి బూడిద అవుతుంది. అలాగే, విశ్వశక్తి అన్ని చోట్లా ఉన్నా, పిరమిడ్ క్రింద మాత్రం మూడు రెట్లు అధికంగా ఉంటుంది.

పిరమిడ్ క్రింద కానీ, పిరమిడ్ లోపల కానీ కూర్చొని చేసే ధ్యానం – ‘పిరమిడ్ ధ్యానం’ అంటారు.

“ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాన సిద్ధాంతాలు”


Patriji-Speakingఈ భూమిపై మానవుల్లా జన్మతీసుకున్న మనం… మన జీవితక్రమంలో ఎదురయ్యే సంఘటనల పట్ల మరి సమస్యల పట్ల సరియైన రీతిలో ప్రతిస్పందిస్తూ… వాటి నుంచి జ్ఞానాన్ని గ్రహిస్తూ… ప్రతిక్షణం ఆత్మోన్నతిని పొందుతూనే ఉండాలి. ఇందుకు ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం యొక్క మూల సిద్ధాంతాల పట్ల విశేషమైన అవగాహన తప్పక ఉండాలి.

1.ఆత్మసిద్ధాంతం: ఈ శరీరాన్ని మనం ఒక ‘రథం’ అనీ .. మరి అందులో ఉండే మనల్ని రథాన్ని తోలే రథికుడు అన్నారు. మనం ఈ శరీరంలో వుండి దానిని నడిపించే ‘ఆత్మస్వరూపులం’ అన్న సత్యాన్ని మనం సదా ఎరుకలో ఉంచుకోవాలి. అన్ని మతాలు, మరి అందరు గురువులూ కూడా బోధించే సత్యం ఇదే.

2.జన్మ – పునర్జన్మ సిద్ధాంతం: అలాగే ఒక ఆత్మ ఒక శరీరాన్ని ఎంచుకుని కొన్ని అనుభవాల కోసం మొట్టమొదటిసారి ఈ భూమి మీద పుడితే… దానిని “జన్మ” అంటాం. అదే ఆత్మ మళ్ళీ మళ్ళీ రకరకాల వాసనలతో కూడి రకరకాల శరీరాల్లో జన్మలు తీసుకొంటూ రకరకాల కర్మలు చేస్తూ ఈ భూలోకానికి వస్తూ పోతూ ఉంటూంటే… వాటిని “పునర్జన్మలు” అంటాం. ఇదంతా కూడా ఆత్మ తన ఎదుగుదల కోసమే కావాలని సృష్టించుకునే ఒకానొక “ఆత్మప్రణాళిక”. ఇందులో తల్లి, తండ్రి, తోబుట్టువులు, భర్త, భార్య ఇంకా ఇతరత్రా బంధుగణం, స్నేహగణం మరి పరిసరాలూ… అన్నీ కూడా ఆత్మ తన ‘స్వ’ ఇచ్ఛ ప్రకారమే ఎన్నుకుంటుంది. ఇక్కడ ఎవరి ఇష్టం వారిది కనుక ఒకటో, పదో, వందో మరి పది వందలో…ఎవరికి ఇష్టమైనన్ని జన్మలు వాళ్ళే తీసుకుంటారు. దీనినే మనం “జన్మ – పునర్జన్మ సిద్ధాంతం” అంటాం.

3.కర్మ – కర్మఫల సిద్ధాంతం: ఈ భూలోకంలో జన్మ తీసుకున్నాక మనం చేసే ఏ రకమైన కర్మ అయినా వెంటనే తిరిగి మనం అదే ప్రతిఫలాన్ని పొందడమే… “కర్మ – కర్మఫల సిద్ధాంతం” అన్నమాట. కాబట్టి మనం ముందుగా కర్మ చేసే విధానంలోనే అత్యంత జాగరుకతతో ఉంటే… ఇక కర్మఫలితాన్ని గురించి బెంగపడనవసరం లేదు. అందుకే… ఈ “కర్మ – కర్మఫల సిద్ధాంతం” పట్ల మనం అత్యంత ఎరుకతో ఉంటూ… అన్నిరకాల హింసలనూ మానాలి… మరి శుద్ధ శాకాహారులమై విలసిల్లాలి.

4.పురోగమన సిద్ధాంతం: ఎప్పుడైనా, ఎక్కడైనా మరి ఏ క్షణమైనా కూడా ఆత్మకు పురోగమనమే కాని.. ‘తిరోగమనం’ అన్నది ఎన్నటికీ వుండదు.

సాధారణంగా మనం ఒక విద్యార్థికి ఒకానొక పరీక్షలో 20 శాతం మార్కులు వస్తే అతడు ‘ఫెయిల్ అయ్యాడు’ అనుకుంటాం. కానీ ఆ పరీక్షలో నూటికి 20 శాతం మార్కులు తెచ్చుకున్న ఆ విద్యార్థి .. “నాకు ఆ సంబంధిత సబ్జెక్టులో కనీసం 20 శాతం పరిజ్ఞానం వుంది; మరి నేను ఇంకా 80 శాతం తెలుసుకోవలసింది వుంది; అన్న జ్ఞానాన్ని పొందుతాడు. ఇలా అతడు తన గురించిన సంపూర్ణ అవగాహనను మరి జ్ఞానాన్నీ తాను పొందడం అన్నది ‘అపజయం’ ఎలా అవుతుంది?

కాబట్టి ఎవరైనా సరే… ఫలానా విషయంలో అపజయం అయ్యారు అనుకోవడం మూర్ఖత్వం తప్ప మరేమీ కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులంతా కూడా తమ తమ పిల్లల పట్ల ఇలాంటి మూర్ఖత్వాలను వదిలిపెట్టాలి. ఉదాహరణకు: సంగీత విద్వాంసులు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆదిలో అపస్వరాలు పలుకకుండానే … గొప్ప సంగీత విద్వాంసులయ్యారా? ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చిన్నప్పటి నుంచీ ఒక్క ఆట కూడా ఓడిపోకుండానే… ప్రపంచ ఛాంపియన్ అయ్యాడా? అసలు ‘ఫెయిల్యూర్’ అన్న పదమే ఈ సృష్టిలో లేదు. అవన్నీ కూడా ఆత్మ పురోగమనానికి ఏర్పాటు చేయబడ్డ సోపానాలే.

5.యోగ సిద్ధాంతం: ఒకానొక విద్యార్థి ఒక పరీక్షలో 20 శాతం మార్కులు తెచ్చుకుని “ఆ సంబంధిత సబ్జెక్టులో నేను ఇంకా 80 శాతం తెలుసుకోవాలి” అన్న జ్ఞానాన్ని పొందాక … ఇక అతడు ఆ “చేరుకోవల్సిన దిశ”గా తన ప్రయత్నాలను మొదలుపెడతాడు. అందుకోసం కష్టపడి చదువుకుంటూ మరి ఇంకొంచెం అంటే … 30 శాతం మార్కులు తెచ్చుకోగలిగితే అది అతడికి పురోగమనమే… మరి అలా పురోగమనం చెందుతూన్న విద్యార్థి ప్రతిరోజూ ధ్యానసాధన కూడా చేస్తూ ఉంటే… అతడిలోని పురోగమనానికి అడ్డుపడే ఆలోచలన్నీ తొలగిపోయి, విశ్వశక్తితో అతడి మెదడు యొక్క గ్రహణ సామర్థ్యం పెరిగి… అదే విద్యార్థి.. అంతే సమయంలో తక్కువ శ్రమతో రెట్టింపు ఫలితాన్ని.. అంటే 60 శాతం మార్కులను పొందుతాడు. ఇలా “ధ్యానసాధన అతడి పురోగమనాన్ని వేగవంతం చేస్తుంది” …. మరి దీనినే “యోగసిద్ధాంతం” అంటాం. నడిచి వెళ్ళేవాడు వాహన యోగం ద్వారా తన గమ్యాన్ని ఇంకా తొందరగా చేరుకున్నట్లు… ధ్యానయోగం ద్వారా మనం మన జన్మ ప్రణాళిక అమలులో ఉన్న అవరోధాలను సునాయాసంగా దాటుకుంటూ ఆత్మ పురోగమనాన్ని ఇంకా వేగవంతం చేసుకుంటాం.

6. అనేకానేక సిద్ధాంతం: ధ్యానం ద్వారా మనం సత్యశోధన మరి దైవశోధన చేస్తాం… మరి ఈ సృష్టిలో మనం వుంటోన్న ఈ ఒక్క భూలోకమే కాకుండా ఇంకా అనేకానేక లోకాలు ఉన్నాయనీ, అనేకానేక జీవులు ఉన్నాయనీ, అనేకానేక జ్ఞానాలు ఉన్నాయనీ, అనేకానేక కోణాలు ఉన్నాయనీ తెలుసుకుంటాం. ఇలా ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానపు సిద్ధాంతాల పట్ల చక్కటి అవగాహనతో కూడిన ఎరుకతో మన జీవితాలను గడుపుతూ ఉంటే… జీవితాలను గడుపుతూనే ఉంటే జీవితంలోని ఒక్కోక్షణం మనకు అందించే అద్భుత ఆనందాలను మనం ఆస్వాదించగలుగుతాం.                    http://www.pssmovement.org/telugu/6-laws-of-spiritual-science/        నుండి గ్రహించబడినది

మాంసాహార మిత్రమా! ఒక్కసారి ఆలోచించు

మాంసాహార మిత్రమా! ఒక్కసారి ఆలోచించు

 ☘️మహాత్మా గాంధీ          “గొర్రెప్రాణం విలువ … మానవుని ప్రాణం కన్నా తక్కువ ఏమీ కాదు. మనిషి శరీరాన్ని పోషించుకోవడానికి గొర్రెను చంపడం ఎప్పటికీ అంగీకరించలేను.జంతువు చాలా నిస్సహాయమైన ప్రాణి. మానవుడి సహాయం పొందడానికి అది అధికారి. అయితే, దానికి సాయం చెయ్యాలంటే మనిషికి ఎంతో యోగ్యత,అధికార విచక్షణ వుండడం అవసరం.”
“హింస ద్వారా హింస మాత్రమే పుడుతుంది; అహింసను ఆధారం చేసుకుని ప్రపంచంలోని ఏ క్రూరశక్తినయినా జయించవచ్చు.”

☘️వీరబ్రహ్మేంద్రస్వామి  “జీవులను వధించి జీవికి వేసిన  జీవ దోషములను జిక్కువడును: జీవహింస చేత చిక్కునా మోక్షంబు?    కాళికాంబ ! హంస కాళికాంబ ! “

☘️యోగి వేమన      ” పక్షిజాతి బట్టి పరగ హింసల బెట్టి     కుక్షినిండ కూడు కూరుటకును   వండి తినెడివాడు వసుధ ఛండాలుడు
విశ్వదాభిరామ వినురవేమ !”
జార్జి బెర్నార్డ్‌షా    “మాంసాన్ని తినే మనము నడుస్తూ, తిరుగుతూ ఉన్న సమాధులం. వీటిలో మన జిహ్వ చాపల్యం కోసం చంపబడిన జంతువుల శవాలు పూడ్చిపెట్టబడ్డాయి.”
“శవాల కుళ్ళు మాంసాన్ని పీక్కుతినే కాకుల వలె మనం మాంసం తింటూ జీవిస్తున్నాం. దీనివల్ల జీవులకు భయంకరమైన బాధ, కష్టం కలుగుతుందనే దాని గురించి మనకు చింతలేదు. మనము పట్టించుకోం. ఎంతటి దౌర్భాగ్యమో ..”

☘️ఓషో రజనీష్     “జంతువులు మన సహోదరులు. మీరు తినడానికి ఒక జంతువును చంపడం అనే ఆలోచనే అసహ్యకరమైనది. ఏ జంతువూ చంప బడకూడదు. భూమి మీద ఏ జంతువు అవసరం వున్నా అది జీవిస్తుంది. అలాగే ఏ జంతువు అవసరం భూమి మీద వుండదో దాన్ని చంపినా చంపకపోయినా భూమిమీద నుండి అది అదృశ్యమైపోతుంది.“
“జంతువులు మానవులకు సోదరులు, తోబుట్టువులు. కారణం వారి నుండే మానవుడు వచ్చాడు. అది మన కుటుంబం. మానవుడిని చంపడమంటే ఎదిగిన జంతువును చంపడం. జంతువును చంపడమంటే ఎదుగుతున్న మానవుడిని చంపడం. రెండూ సమానమే. కారణం ఒకనాటి జంతువులే మనుష్యులుగా పరిణామం చెందుతున్నారు.”

☘️తిరువల్లువర్      “తన స్వంత మాంసాన్ని క్రొవ్వు పట్టేలా చేసేందుకు ఒక జంతువు మాంసాన్ని తినేవాడు నిజమైన కరుణను ఎలా అభ్యసించగలడు?”
“ప్రజలంతా మాంసాన్ని కొనడం మరి వినియోగించడం చేయకపోతే కనుక జంతువులను వధించి మరి మాంసాన్నిఅమ్మకానికి ఉంచేవాళ్ళు ఎవ్వరూ ఉండరు.”
“ఎవరు జంతువులను చంపడం మీదే జీవిస్తారో వారు చివరకు అనారోగ్యంతో దారిద్య్రంతో బాధపడటమే కాదు, అవమానాలకు కూడా గురవుతారు.”

☘️కబీర్ దాస్      “జంతువులను ఒక్క పెట్టున నరకడం, చాలాసేపు రక్తం కార్చుతూ చంపడం దోషపూరితం, అధమం మరి దయా రహితం. అలాంటివారు అంత్య సమయంలో శిక్ష అనుభవించవలసి వస్తుంది.”
“కడుపు నిండా చేపల్ని తిని కోటి గోవులను దానమిచ్చినా .. నరకానికే వెళతారు. బాధ అనేది ఏ జీవికైనా ఒక్కటే, మూర్ఖులైన జనులు గ్రహించడంలేదు.”

☘️స్వామి దయానంద సరస్వతి   “మాంసం భుజించడం ఒక వ్యక్తి స్వభావాన్ని హింసాత్మకం చేస్తుంది. మాంసం తినేవారి, మత్తుపానీయాల్ని త్రాగేవారి శరీరాలు మరి వీర్యకణాలు కూడా కలుషితమవుతాయి.”

☘️మైఖేల్ నేమి  “ఎవరైతే జీవుల మాంసాన్ని చీల్చుతారో వారి మాంసం కూడా చీల్చబడుతుంది. ఎవరైతే ఎముకలను విరుస్తారో వారి ఎముకలు కూడా విరువబడతాయి. ప్రతీ రక్తపు బొట్టుకి తన రక్తపు బొట్టుతో లెక్కలు అప్పగించవలసిందే” ఇది తిరుగులేని న్యాయ సూత్రం.
మనుస్మృతి      “జీవులను చంపేవారు, చంపించేవారు, అమ్మేవారు, వండేవారు, వడ్డించేవారు, మాంసం కోసేవారు, తినేవారు, తినిపించేవారు ఈ ఎనిమిది రకాల వారు హత్యలో భాగస్వాములే.”

☘️ఇస్లాం
“భూమిపై సంచరించు జంతువులు గానీ, ఆకాశంలో రెక్కలతో ఎగురు పక్షులు గానీ, సృష్టిలోని సమస్తమూ మీవంటివే.” -7వ కాండ 38వ వాక్యం, ఖురాన్
                                                                                                                                                 
“అతడే పందిళ్ళపై నెక్కింపబడు తోటలను, పందిళ్ళగా మారని వృక్షములను సృష్టించెను. అలాగే ఖర్జూర వృక్షములను, పొలములను సృష్టించెను. వాని ఫలములు వేరువేరుగా నున్నవి. దానిమ్మను కూడా సృష్టించెను. ఒకదానికొకటి పోలికలు లేని ఫలములను సృష్టించెను.అవి ఫలించినప్పుడు వాటిని భుజింపుము. వృధాగా ఖర్చుచేయకుము. అటువంటి వారిని భగవంతుడు ప్రేమించడు.”                     -8వ కాండ 142వ వాక్యం, ఖురాన్
                                                                                                                                             
“ఓ జనులారా ! భూమిలోని వస్తువులలో శాస్త్ర సమ్మతములై, పవిత్రములైన వాటిని భుజింపుము. ‘సైతాను’మార్గంలో నడవకుము.నిశ్చయముగా ‘సాతాను’మీకు సుస్పష్టమైన శత్రువు. హింసాకార్యములను చేయు దిశగా మిమ్ములను ప్రేరేపించును. అసత్యములను పరమాత్మపై మోపుటకు మిమ్ములను ఆజ్ఞాపించును.”                                                                                                                   -2వ సూరా 168వ వాక్యం, ఖురాన్

“ఎవడు ఒక హత్య బదులుగా కాక భూమిలో ఉపద్రవమునకు గాక ఒక జీవిని చంపునో, అట్టివాడు సర్వజీవులను చంపినవాడగును.ఎవడు ఒక ఆత్మను బ్రతకనిచ్చునో, వాడు సర్వ ఆత్మలను బ్రతుకనిచ్చిన వాడగును.”                                                                 -6వ కాండ 32వ వాక్యం, ఖురాన్
                                                                                                                                         
☘️క్రైస్తవం
ఎడ్మండ్ జకై ప్రచురించిన “గాస్పెల్ ఆఫ్ పీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్” అనే పుస్తకంలో ఏసుక్రీస్తు ప్రవచనాలను ఈ విధంగా వ్రాశారు:
“ఎవరైతే చంపుతారో వారు నిజానికి తమను తామే చంపుకుంటున్నారు. ఎవరైతే చంపబడిన జంతు మాంసాన్ని తింటారో వారు నిజానికి తమ మృత మాంసాన్ని తింటున్నారు. జంతువుల మృత్యువు వారి స్వీయ మృత్యువు. ఎందుకంటే ఈ పాపానికి ఫలితం అంటే శిక్ష మరణం కంటే తక్కువుగా వుండజాలదు. ఎందుకంటే వాడి శరీరంలో ఆ జంతువుల రక్తం యొక్క ప్రతి చుక్కా విషంగా మారుతుంది. వాని శ్వాసలో మృత పశువుల శ్వాసల దుర్గంధముంటుంది. వాని రక్తం మృత పశువుల రక్తంలానే పొంగుతుంది .. మరి పశువుల మరణం వాని మరణం అవుతుంది” అని చెప్పారు.
“మూగ జీవులను చంపకు. అలా చంపిన అమాయక జీవి మాంసాన్ని తినకు. నీవు సైతాన్‌కు బానిస అవగలవు. ఎందుకంటే అది దుఃఖంతో కూడిన మార్గం. అది మృత్యువు వైపుకు తీసుకు వెళ్తుంది. పరమాత్మ ఆజ్ఞలో జీవించు, అలా జీవిస్తే ఆయన దూతలు జీవితపు మార్గంలో నీకు సహాయం చేస్తారు. అందువలన పరమాత్మ యొక్క ఈ ఆదేశాన్ని పాటించు. చూడు .. నేను నీకు భూమిపైన అనేక రకాల ఫలాలనూ, ధాన్యాలనూ ఇచ్చాను. ఫలాలు కాచే అనేక వృక్షాలను ఇచ్చాను. ఇవి నీకు మాంసానికి బదులుగా ఇవ్వబడ్డాయి.రక్తమాంసాలతో వున్న వాటిని నీవెన్నడూ తినకు.                                                                                           – The Gospal of peace, Jesus p.48,49   
                        
☘️జైన్ బోధనలు 
      “జీవించు–జీవించనివ్వు“  “జైన మతం” లో అయిదు మహావ్రతాల్లో మొదటిది మరి అత్యంత అవశ్యకమైన మహావ్రతం ‘అహింస’. ఏ జీవికి ఏ రకమైన దుఃఖాన్నీ,కష్టాన్నీ కలిగించకుండటం, వాటిపై దయ, ప్రేమ చూపడమన్నది ముఖ్యమైన వ్రతంగా భావిస్తారు. వారు దీనినే ‘మహావ్రతం’అంటారు.   జైన మతం ప్రకారం జంతువులను బంధించడం దుఃఖాన్ని కలిగించడం, కొట్టడం, వాటిపైన అధిక బరువు వేయడం కూడా మహాపాపంగా పరిగణించబడుతుంది.

☘️బుద్ధుని బోధన      “ప్రాణాలను ఎవరైనా తీయగలరు, కానీ ఎవరైనా ప్రాణాలను పోయగలరా? ఎంతటి నిమ్న జాతికి, అధమ జాతికి చెందిన వాటికి కూడా ప్రాణం ప్రియమైనదే .. ఎవ్వరూ తమ ప్రాణాలను అర్పించటానికి సిద్ధపడరు. మన మనస్సులో ‘దయ’ అనే భావం వుంటే ఈ జీవితం అమూల్యమైనది. జనులు తాము స్వయంగా నిర్దయులై వుండి దేవతల నుంచి మాత్రం దయను అర్థిస్తారు. దేవతలకు, మానవులు,పశువులూ ఇద్దరూ సమానమే, సర్వ జీవులూ సమానమేనన్న జ్ఞానం ఎవరికి కలుగుతుందో వారే శ్రేష్ఠమైన మానవులు.”

☘️ఆధ్యాత్మికత .. శాకాహారం
“ఓ దివ్య శక్తులారా ! మా ద్విపాద మరి చతుష్పాద జీవజాతులు రెండింటినీ సంరక్షించండి. వాటి అవసరాలకు ఆహారాన్నీ మరి జలాన్నీ అందించండి. మాతో పాటు వాటి ఉన్నతి మరి దృఢత్వం కూడా వృద్ధి చెందుగాక!”                                               –ఋగ్వేద సంహిత 10.37.11.VE,319

 “ఓరాజా ! .. మాంసపు భాగాన్ని పుచ్చుకునేవాడు, గుర్రపు మాంసం లేదా ఇతర జంతువు మాంసమైనా, మరి గోవులను వధించడం ద్వారా ఇతరులకు పాలు అందుబాటులో లేకుండా చేసే పాపిష్టివాడు దానిని మానుకొనకపోతే కనుక అలాంటప్పుడు అతనికి శిరచ్ఛేదం చేయడానికి నువ్వు సంశయించకూడదు.”                                                                                                                              – ఋగ్వేద సంహిత 1087.16,FS,90

 “ధ్యానాన్నీ మరి ఇతర యోగ మార్గాలనూ అవలంబించే ఉన్నతాత్మలు.. సకల జీవుల పట్ల ఎల్లవేళలా శ్రద్ధ వహించేవారు, జంతువులను సంరక్షించేవాళ్ళు, ఆధ్యాత్మిక అభ్యాసాల గురించి వాస్తవంగా శ్రద్ధ కలిగిన వ్యక్తులు.”       –అధర్వణ వేద సంహిత 19.48.5.FS, 90    
                                                                                       
“భగవంతుడిచే ప్రసాదించబడిన శరీరాన్ని భగవంతుడి యొక్క జీవులను చంపేందుకు వినియోగించకూడదు .. అది మనిషి అయినా,జంతువైనా లేదా మరేదైనా.”                                                                                                                                                   –యజుర్వేద సంహిత 12.32. FS,90

 “అసలైన ధర్మం తెలియని వాళ్ళు, దుర్మార్గులు మరి గర్వాంధులూ అయినప్పటికీ, తమను తాము నీతివంతులుగా పరిగణించుకుంటారు.ఏ విధమైన పశ్చాత్తాపభావం, కనికరం లేదా శిక్ష పట్ల భయం లేకుండా .. జంతువులను చంపుతారు. తరువాత అటువంటి పాపిష్టి వ్యక్తులు తమ తదుపరి జన్మలలో, తాము ఈ ప్రపంచంలో చంపిన జీవులకే ఆహారమవుతారు.”                                        –శ్రీమద్భాగవతం 11.5.4

శ్లో|| ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున|
సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః||                                                                        –భగవద్గీత 6-32

 “ఓ అర్జునా ! ఎవడు సమస్త భూతకోటి యొక్క సుఖ దుఃఖాలు తన సుఖ దుఃఖాలుగా చూస్తాడో అలాంటివాడు అందరిలో నాకు ఎక్కువ ప్రియుడు. ఇది నా నిశ్చితాభిప్రాయం.”      
                         
 From 
  http://www.pssmovement.org/telugu/vegetarianism-2/

“లేదు మరణం”


ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవికి కూడా “దేహ మరణం” తప్పదు! ఇది మనకు తెలిసిన సత్యం!! అయితే “ఆ తరువాత ఏమైనా ఉంటుందా?!” అన్నదే అసలైన ప్రశ్న!
సామాన్య ప్రజాబాహుళ్యానికీ, మరి ఆధ్యాత్మికపరంగా అంతగా ఎదగని ఆత్మలకూ ఈ ప్రశ్న అసంగతంగా మరి “తెలుసుకోవడానికి ఏమీ ఉండదు” అన్నట్లుగా అనిపించినా .. తెలివైన ప్రతి మనిషికీ మరి పరిణితి చెందిన ప్రతి ఆత్మకూ .. అది సహజసిద్ధంగా వచ్చే మౌలిక సందేహం మరి కీలక ప్రశ్న!
మానవజీవితంలో “శైశవ దశ” .. “బాల్య దశ” .. “యవ్వన దశ” .. “ప్రౌఢదశ” మరి “వృద్ధాప్య దశ” అనే రకరకాల దశలు ఉంటాయి. ఈ అన్ని దశలలో కూడా పుడుతూనే చనిపోతూన్న వాళ్ళు .. శిశువులుగా చనిపోయిన వాళ్ళు .. యువకులుగా మరి పెద్దవాళ్ళుగా .. చనిపోతూన్న వాళ్ళు ఉంటారు. ఇక ముసలితనం వచ్చాక అందరూ విధిగా చావవలసిందే. ఒక్కోసారి రకరకాల సమస్యలను తట్టుకోలేక బెంబేలెత్తిపోయి “చావే శరణ్యం” అనుకుని ఆత్మహత్యలకు పాల్పడేవాళ్ళు కూడా అన్ని దశలలో ఉంటారు.
మరికొందరు ఏదో విధంగా తమ జీవితాన్ని పొడిగించుకోవాలని యుక్తులూ కుయుక్తులతో రకరకాల వృధా ప్రయాసలు పడుతూ మరి వ్యర్థ ప్రయోగాలు చేస్తూంటారు. ఇదంతా కూడా “మరణం తరువాత ఇక ఏమీ ఉండదు కనుక చనిపోయే లోపలే అంతా తినెయ్యాలి .. అంతా మ్రింగి వేయాలి .. మంచి అయితే మంచిగా .. చెడు అయితే చెడుగా అంతా అనుభవించెయ్యాలి” అన్న అజ్ఞానం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామం. దీనివల్ల ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పరుగులాటలు మరి అంతులేని కీచులాటలు మొదలవుతూ ఉంటాయి!!
అయితే “మరణం తరువాత కూడా జీవితం ఉంది; ఆత్మ యొక్క శాశ్వత ప్రయాణంలో ‘భౌతిక మరణం’ అన్నది ఒకానొక మలుపు మాత్రమే” అని అనుభవ పూర్వకంగా తెలుసుకున్న ధ్యానయోగులు మరి సద్గురువుల జీవితాలలో సామాన్య ప్రజల జీవితాలలో ఉన్నంత పరుగులాటలూ మరి కీచులాటలూ ఉండనే ఉండవు. “ఇప్పుడే అన్నీ సాధించుకోవలసింది ఏమీ లేదు; క్రమక్రమంగా అవే వస్తాయి” అన్న మనోనిబ్బరత వారిలో ఉంటుంది.
“గౌతమబుద్ధుడు”, “మహావీరుడు”, “గురునానక్”, “జొరాస్టర్”, “ఏసుక్రీస్తు”, “మహమ్మద్ ప్రవక్త” వంటి యోగిపుంగవులు అందరూ కూడా తమ తమ స్వంత యోగ సాధనల ద్వార ఈ స్వానుభవాన్ని పొందిన వారే! వారిలాగే ఈ భూమి మీద ప్రతి మానవుడు కూడా స్వానుభవం పొందితీరాలి. అప్పుడే ఈ ప్రపంచం అంతా కూడా శాంతిమయం అవుతుంది.
ఇది శాస్త్రీయ యుగం. ఇక్కడ “శాస్త్రీయ దృక్పథం” అన్నది ప్రతి ఒక్కరికీ ఉండి తీరాలి. అనేకానేక ఆధ్యాత్మిక సత్యాలను పరిశీలించి, పరిశోధించి వాటిలోని శాస్త్రీయతను వెలికి తీయాలి. ఎన్నెన్నో ప్రదేశాలలో చిన్న చిన్న పిల్లలు తమ తమ గత జన్మల అనుభవాలను గురించి చెప్పడం మనం వింటున్నాం. నవీన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు వాళ్ళు చెప్పిన ఆధారాలతో పరిశోధనలు జరిపి “వాళ్ళు చెప్పింది నిజమే” అని నిర్ధారించారు కూడా.
“డాక్టర్ ఇయాన్ స్టీవెన్‌సన్” ఈ దిశగా అనేక పరిశోధనలు చేసి “Twenty Cases Suggestive of Re-Incarnation” అన్న అద్భుతమైన గ్రంథాన్ని మనకు అందించారు. ఇందులో వారు అనేక క్షేత్ర పరిశోధనా వ్యాసాలను అత్యంత శాస్త్రీయంగా ధృవీకరించారు. “డాక్టర్ ఎలిజబెత్ క్యూబ్లెర్ రాస్”, “డాక్టర్ రేమాండ్ మూడీ” గార్లు “మరణ సమయంలో అనుభవాలు (Near death experiences)” అన్న అంశంపై ఎంతో విపులంగా పరిశోధనలు జరిపి అనేక గ్రంథాలను మనకు అందించారు.
ఒక్కోసారి మరణశయ్యమీద ఉన్నవాళ్ళు తాము చనిపోయిన స్థితిలో తమ శరీరాలను వదిలిపెట్టి .. ఏవేవో క్రొత్త లోకాలను చూసి వచ్చాం అని చెబుతూంటారు. సొరంగాల ద్వారా చీకటిలోకి ప్రవేశించి వెలుతురులోకి రావడం, చనిపోయిన తమ పాత మిత్రులనూ మరి బంధువులనూ కలవడం, ఉన్నత లోకాల మాస్టర్ల దగ్గర ప్రత్యక్షంగా శిక్షణ తీసుకోవడం వంటి ఎన్నెన్నో అనుభవాలను వారు పొందుతూ ఉంటారు. అయితే వాళ్ళ జీవితకాలం ముగియకపోవడంతో వారికి ఏ వైద్యమో అందుబాటులోకి వచ్చి వాళ్ళు తిరిగి పునరుద్ధరింపబడిన శరీరంలోకి చేరిపోవడం జరుగుతుంది. ఇలాంటి దృష్టాంతాలు కూడా “మరణాంతర జీవితం ఉంది” అని మనకు తెలియజేస్తున్నాయి.
ఒక్కోసారి కొందరు ఉన్నట్లుండి తమ తమ ముఖ కవళికలను మార్చేసుకుని, వేరే వేరే భాషలను మాట్లాడేస్తూంటారు! ఆ మనిషి మునుపటి మనిషిలా ఉండడు. దీనినే “మీడియమ్‌షిప్” అంటాం ఇది కొన్ని క్షణాలు ఉండవచ్చు .. లేదా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కొన్ని రోజులు .. నెలలు కూడా ఉండవచ్చు. దీనినే “దయ్యం పట్టింది” అని కొన్నిచోట్ల అంటూంటారు.
నవీన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఇలాంటి విషయాలను పరిశోధించి “మరణించిన కొన్ని మూర్ఖపు ఆత్మలు తిరిగి తమ కోర్కెలను తీర్చుకోవడంకోసం అంతగా ఎదగని అజ్ఞానపు ఆత్మలకు సంబంధించిన శరీరాలలో అక్రమంగా ప్రవేశించి కోర్కెలు తీర్చుకుంటూ ఉంటాయి” అని ధృవీకరించారు. ఇలాంటి వారికి చక్కటి జ్ఞానాన్ని అందించడం ద్వారా వారిని ఆ మూర్ఖపు ఆత్మలబారి నుంచి విముక్తులను చేయవచ్చు.
ఇదేవిధంగా ఎంతోమంది తమ తమ నిద్రావస్థలలో కూడా స్వప్న విహారాలు చేసి రాబోయే కాలానికి సంబంధించిన వార్తలను సేకర్తిస్తూంటారు. ఆ వార్తలను విశ్లేషించగా అవి “నిజమే” అని నిరూపించబడ్డాయి. కనుక తెలివైన మానవాళికీ మరి అధిమానస ప్రయోగాలను అవగాహన చేసుకోగలిగే వాళ్లకూ “మరణానంతర జీవితం” అన్నది నిరూపితమైన సత్యం!!
భగవద్గీతలో “శ్రీకృష్ణ పరమాత్మ” కూడా –
“జాతస్య హి ధృవోమృత్యుః ధృవం జన్మ మృతస్య చ
తస్మాత్ అపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి”
(భగవద్గీత 2-27)
“పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు మళ్ళీ పుట్టక తప్పదు. ఇదే పూర్ణయోగ జ్ఞాన సారాంశం. కనుక ఈ గిట్టే దానికి ఎవ్వరూ ఎప్పుడూ ఏడవరాదు” అంటూ మరణానంతరం జీవితం గురించి పరమాద్భుతంగా తెలియజేశారు.
ప్రతి ఒక్క ఆత్మకూడా రకరకాల జన్మల ద్వారా రకరకాల శరీరాలలోకి ప్రవేశిస్తూ .. మరణం ద్వారా వాటిని వదిలిపెడుతూ .. మళ్ళీ పుడుతూ చివరికి పరిపూర్ణ ఆత్మజ్ఞానిగా జనన మరణ పరంపరను చేధిస్తుంది. చివరికి తాను కూడా ఒకానొక “పరమ ఆత్మ”గా పరిణితి చెంది ఇక ఊర్థ్వలోకాలలో శాశ్వతమైన సద్గురువు పదవిని చేరుకుంటుంది!
ఇది తెలుసుకున్న గౌతమబుద్ధుడు “ఆనాపానసతి ధ్యానం” చేసి స్వంత దివ్యచక్షువు ద్వారా తన జన్మ కర్మ పరంపరనంతా చూసుకుని దుఃఖరహితుడు అయ్యాడు. మరెందరో యోగమూర్తులు ఇదే దారిలో నడిచి మోక్షాన్ని పొందారు. జీసస్ క్రైస్ట్ అయితే “నేను క్రితం జన్మలో ‘ఎలియా’ ను” అని చాటి చెప్పాడు.
వాళ్ళలాగే నేను కూడా ధ్యానం చేసి ఇదే సత్యాన్ని తెలుసుకున్నాను. నేనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తెలుసుకున్నారు. ఇందులో విశేషమైన ప్రతిభ ఏమీ లేదు. ఆత్మస్వరూపులమైన మనకు ఆత్మానుభవం ఉండడం సహజం! అది లేకపోవడమే అసహజం! కనుక ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ఈ సత్యాలను తెలుసుకోవాలి. నిజానికి ప్రతి ఒక్క మనిషికి కూడా తన జీవితంలో చిన్నప్పటినుంచీ ఏదో ఒక సమయంలో ఆత్మానుభవాలు వస్తూనే ఉంటాయి.
కానీ సగటు సామాజిక వ్యవస్థలవల్ల అయితేనేమి, మూర్ఖపు పెంపకాలవల్ల అయితేనేమి అవి అన్నీ వారి మస్తిష్కాలలోనే అణిచివేయబడతాయి. అటువంటి వాళ్ళంతా కూడా ఎప్పుడయితే ధ్యానయోగ మార్గంలోకి అడుగు పెడతారో .. ఇక పరంపరగా వారికి ఆత్మానుభవాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. భౌతిక, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరాది సముదాయానికి చెందిన అనుభవాల ద్వారా ఆత్మసత్యాలు అవగతమై వారు చిన్నప్పుడు తమకు వచ్చిన అనుభవాలు ఎంత సత్యమైనవో తెలుసుకుంటారు.
ఎవరికి వారే ధ్యాన సముద్రంలో ఈది తమలోని ప్రశ్నలన్నింటికీ సమాధానాలను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఏ శాస్త్రాన్నీ, ఏ మతాన్నీ లేదా ఏ గురువునూ గ్రుడ్డిగా నమ్మరాదు.
కాస్సేపు హాయిగా కూర్చుని .. కళ్ళు రెండూ మూసుకుని .. సహజంగా జరుగుతున్నటువంటి “శ్వాస మీద ధ్యాస” ఉంచాలి. ఏ రూపాన్నీ ఊహించకుండా ఏ మంత్రాన్నీ జపించకుండా అలా అలా సహజ శ్వాసను గమనిస్తూ ఉంటే క్రమంగా ఆలోచనల ఉధృతి తగ్గిపోయి ఆలోచనారహితస్థితికి చేరుకుంటాం. ఆ అద్భుత స్థితిలో మెల్లి మెల్లిగా దివ్యచక్షువు ఉత్తేజితమై .. మరి భౌతిక శరీరం నుంచి సూక్ష్మశరీరం విడుదల అవుతుంది. ఆ సూక్ష్మశరీరం వెంట ప్రయాణిస్తూ వెళ్తే మరణానంతరం వెళ్ళే సకల లోకాల దర్శనాలు ముందే కలుగుతాయి.
ఇలా ధ్యానంలో భౌతిక శరీరం నుంచి సూక్ష్మశరీరం విడుదల కావడం కూడా అన్నది ఒక రకంగా మరణమే! ఇది ఎలా అంటే .. మన భౌతిక శరీరానికీ మరి సూక్ష్మ శరీరానికీ మధ్యలో “ప్రాణమయ తీగ (Silver Cord)” అనుసంధానమై ఉంటుంది. ధ్యానంలో ఎరుకతో చేసే సూక్ష్మశరీర యానంలో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ ప్రాణమయ తీగ ద్వారా సూక్ష్మశరీరం మళ్ళీ చటుక్కున వచ్చి భౌతిక శరీరంలో దూరిపోతూ ఉంటుంది. అదే మరణంలో అయితే ఈ ప్రాణమయతీగ తెగిపోయి రెండు శరీరాల మధ్య ఉన్న బంధం శాశ్వతంగా ముగిసిపోతుంది.
ఇలా మరణం ద్వారా భౌతిక శరీరాన్ని శాశ్వతంగా వదిలి పెట్టేసిన ఆత్మ .. తన సూక్ష్మశరీరంతో సూక్ష్మలోకాలన్నీతిరిగేస్తూ అంతకు ముందు భూమిమీద తను చేసిన కర్మల యొక్క ఫలితాలను అనుభవిస్తూ ఉంటుంది. అజ్ఞానపు ఆత్మగా శరీరాన్ని వదిలిపెడితే అది భూలోకంలో సృష్టించినట్లే సూక్ష్మ లోకాలలో కూడా చీకటి రూపాలను సృష్టించుకుంటూ వాటిలోపడి నరకయాతనను అనుభవిస్తూ ఉంటుంది .. మరి సుజ్ఞానపు ఆత్మగా శరీరాన్ని వదిలితే అది నేరుగా ఊర్థ్వ లోకాలకు చేరుకుని అక్కడ తన కర్మల ప్రతిఫలాలను ఆనందంగా అనుభవిస్తూ ఉంటుంది.
ఇలా ప్రతి ఒక్క ఆత్మకు కూడా మరణానికి పూర్వపు జీవితానుభవాలు ఎన్ని ఉంటాయో మరణాంతర జీవితంలో కూడా అన్ని అనుభవాలు ఉంటాయి. సూక్ష్మశరీరాలతో అవి కోటానుకోట్ల సూక్ష్మలోక అనుభవాలను పొంది .. అక్కడి తమ గత జన్మ స్మృతుల ఆధారంగా నూతన జన్మలకు సిద్ధపడతాయి. ఇవన్నీ కూడా ధ్యానం చేసి ఎవరికి వారే తెలుసుకోవచ్చు.
ధ్యానానికి కూర్చున్న మొదటిరోజే ఇవన్నీ తెలిసిపోవు! కనుక కనీసం నలభై రోజులు ఏకదీక్షగా తీవ్రతర సాధన చెయ్యాలి. ధ్యానంలో కలుగుతూన్న అనుభవాలను వ్రాసి పెట్టుకోవాలి.
ఇక్కడ “నమ్మకాలకు” ఎంత మాత్రం తావు లేదు. కేవలం శాస్త్రీయ దృక్పధానికీ మరి స్వీయ అనుభవానికీ మాత్రమే తావు ఉంది .. కనుక మానవ జీవితాన్ని మనం సరియైన విధంగా జీవించాలంటే ముందు ఈ మరణానంతర జీవితం గురించి ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. అప్పుడే మన జీవితాలలో పోట్లాడుకోవడాలూ, హింసా ప్రవృత్తులూ, జంతు-పక్షి మాంస భక్షణలూ, జంతువధ మరి ఇతరుల వ్యక్తిగత జీవితాలలో తలదూర్చడాలవంటి అనాచారాలన్నీ మటుమాయం అయిపోతాయి. జీవితమంతా శుభాలతో మరి ఆనందాలతో నిండిపోతుంది.
ఇలాంటి జీవులనే “ముక్తజీవులు” లేదా “ఎన్‌లైటెన్‌డ్ మాస్టర్స్” అంటారు. అలాంటి ముక్తజీవులే సభ్య సమాజ జీవులుగా మెలగగలుగుతారు మరి తమ చుట్టూ ఉన్నవారిని కూడా తమలాగే తయారుచేసి ఈ భువిని దివిగా మార్చగలుగుతారు!
నిజానికి సమాజంలో ఎంత గొప్ప హోదాలో ఉన్నా, ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని కోట్ల ఆస్తులు కూడబెట్టినా మరి ఎన్ని మంచి పనులు చేసినా ఆత్మజ్ఞానం అన్నది లోపిస్తే మాత్రం వారు చివరికి రకరకాల ప్రలోభాలకు లోనై పరితపించవలసిందే .. మరి ఆత్మశాంతి కరువై శోకించవలసిందే!
చాలామంది “మేము భగవంతుని భక్తులం; ఎన్నో మంచి పనులు చేస్తున్నాం; ఆ పుణ్యమే మాకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది” అంటూ ధ్యానం చెయ్యడానికి విముఖత చూపిస్తూంటాయి.
శ్రీకృష్ణ పరమాత్ముల వారు భగవద్గీతలో ..
“తేత్వం భుక్త్వా స్వర్గలోకం విశాలం
క్షీణే పుణ్యే మర్త్య్వలోకం విశంతి
ఏవం త్రయా ధర్మ మనుప్రపన్నా
గతాగతం కామకామా లభంతే”
(భగవద్గీత 9-20)
“ఆ విశాలమైన స్వర్గలోకాన్ని భుజించిన తరువాత, అక్కడివన్నీ భోగించి పుణ్యం క్షీణించిన తరువాత, అందరూ విధిగా ఈ భూలోకానికి అంటే ‘మరణం’ ఉన్న లోకంలోకి తిరిగి ప్రవేశిస్తారు; ఈ విధంగా రావడం, పోవడం అన్నది మూడు ధర్మాలను నిర్వర్తించడంకోసం .. మరి వాళ్ళ వాళ్ళ కోరికలను తీర్చుకోవడం కోసం .. యధావిధిగా జరుగుతూనే ఉంటుంది” అని సుస్పష్టంగా తెలియజేశారు.
మంచి కార్యాలవల్ల పుణ్యం వస్తుంది కానీ ఆత్మజ్ఞానం మాత్రం రాదు! ఆత్మానుభవం వల్ల పొందే అనుభవజ్ఞానంతో మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొంది మనం జనన మరణ చక్రం నుంచి విముక్తులం అవుతాం! కనుక ఆత్మజ్ఞానంతో కూడిన దివ్యజీవితాన్ని మనం భౌతిక శరీరంతో బ్రతికి ఉన్నప్పుడే అనుభవించడం మొదలుపెడదాం.
ఇందుకుగాను మన దైనందిన జీవితంలో ఏ మాత్రం మార్పులు చేసుకోనవసరం లేదు. సంసార సుఖాలను అసలు విడిచి పెట్టనవసరం లేదు. ఇహలోకపు విద్యలనూ మరి సకల కళలనూ ఒకవైపు నేర్చుకుంటూనే మరొకవైపు పరలోకపు సమాచారాన్నంతా విశేషంగా సేకరించుకోవాలి. ఇహలోకపు సుఖాలు ఒకవైపు హాయిగా అనుభవిస్తూనే మరొకవైపు అమరలోకపు ఆనందాలను ఆస్వాదించాలి.
ఇదే సరియైన మానవ జీవన విధి విధానం .. మరి ఇదే పరిపూర్ణమైన మానవ దివ్యజీవన సారాంశం!!

ధ్యానంలో ☄విశ్వ చైతన్య శక్తి అనుభవం🔆

ధ్యానంలో ☄విశ్వ చైతన్య శక్తి అనుభవం🔆
విశ్వ చైతన్య శక్తి అనేది విశ్వమంతా వ్యాపించి వున్న శక్తి . విశ్వ కేంద్రం నుండి విశ్వానికి లభిస్తున్న శక్తి. అయితే మనం నిద్రలో కొద్దిగా ఆ చైతన్య శక్తి ని తీసుకొంటాము. 🙏 దైవ నామ స్మరణతో కొంత వరకు ఆ శక్తి లభిస్తుంది. అయినా గూడ మనం పూర్తిగా ఆ శక్తి ని స్వీకరించాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. ఈ విశ్వ చైతన్య శక్తి మన శరీరములో ప్రవేశిస్తే  చెడ్డ ప్రాణ శక్తి తొలగి 👌దివ్యమైన మంచి ప్రాణ శక్తి లభిస్తుంది. మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు గోపురముపై కలశాన్ని గమనించవచ్చు.నేరుగా ఆ కలశం క్రిందనే గర్భాలయములో  విగ్రహం ఏర్పాటు చేసివుంటారు.ఎందుకు అలా వుంటుందంటే 🔺కలశం ఒక రిసీవర్ యాంటెన్న లాగ పనిచేసి విశ్వ చైతన్య శక్తి ని  గ్రహిస్తుంది. మనం విగ్రహం వద్దకు పోయి  నమస్కరించినప్పుడు  మనకు తెలియకుండానే తలవంచి కళ్ళు మూసుకొంటాము. తల వంచినప్పుడు విగ్రహంలో వున్న శక్తి కాస్త మన బ్రహ్మరంధ్రం నుండి మనలోకి ప్రవేశిస్తుంది. తలవంచి కళ్ళు మూసుకోన్నప్పుడు అర్ధం ఏమిటంటే నిజమైన దేవుడు అక్కడ లేడు అని మనలో వున్న 💥దేవుడిని చూడడానికి కళ్ళు మూసుకొని  ప్రయత్నిస్తున్నాము.
అదేవిధంగా మన శరీర నిర్మాణములో గూడ దేవాలయానికి పోలిక వుంది.మన శిరస్సు గోపురము అయితే తలపై వున్నా బ్రహ్మరంధ్రము కలశం. మన హృదయం పవిత్ర గర్భాలయం. అందులో వున్న ఆత్మ విగ్రహం.అయితే ఆ జీవాత్మ ను పరమాత్మ గా మారడానికి ధ్యానం ఒక్కటే మంచి మార్గం. ధ్యానంలో విశ్వ చైతన్య శక్తి ప్రసరించి ఆ ఆత్మకు దివ్యత్వాన్ని ఇస్తుంది. అదే విధంగా మన శరీరమంతా చైతన్య శక్తి (Energy) ప్రవహించి శరీములో గల బ్లాక్స్ ను తొలగించి ఆ స్థానంలో ప్రవేశిస్తుంది.

మన భౌతిక శరీరంపై భౌతికమైన కంటికి కనిపించని  ఈధరిక్ బాడీ వ్యాపించివుంటుంది. ఆ ఈధరిక్ బాడీ పైన ఆరా వ్యాపించి వుంటుంది. బాగా ధ్యానం చేసే వారికి ఎదుటి వారిలో ఆ ఆరా కనిపిస్తుంది  క్యాన్సర్ లేదా మరేదైనా వ్యాధుల కారణంగా  ఆ ఆరా లో బ్లాక్స్ (చెడ్డ ప్రాణ శక్తి)కనిపిస్తాయి. అయితే ధ్యానం వలన మనలో విశ్వ చైతన్య శక్తి ప్రవేశించి  చెడ్డ ప్రాణశక్తి వున్న ప్రాంతములో  చైతన్య శక్తి ప్రవేశించి వాటిని తొలగిస్తుంది. ధ్యానం లో ఈ ప్రాణశక్తి బ్లూ కలర్ లో ప్రవేశిస్తున్న అనుభూతిని పొందుతారు.అందువల్ల ధ్యానం చేస్తే ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు తొలగిపోతాయి. మనల్ని పట్టి పీడిస్తున్నా దుర్వ్యసనాల నుండి బయట పడవచ్చు. ఆత్మ దర్శనం కలిగి ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతాయి. అప్పుడు దేవుడు ఎక్కడో లేడు, మనలోనే వున్నాడనే అద్భుతమైన అనుభవాన్ని పొందుతాము.  గాఢ ధ్యానం లో మనం కోరుకొనే సంకల్పాలు గూడ నెరవేరుతాయి. మైండ్ లో పేరుకుపోయిన చెత్త అంతా తోలిగిపోవడంతో జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది.