23, జూన్ 2024, ఆదివారం

గాయత్రి మంత్రం ప్రాశస్త్యం

గాయత్రి మంత్రం ప్రాశస్త్యం: ఋషులు, యోగులు, మునులు, సామాన్యులు,j పాపభూయిష్టమైన ఈ ప్రాపంచికము నుండి ముక్తులయి, శాశ్వతమైన బ్రహ్మ పదమును పొందుటకు అనేక విధములయైన ప్రయత్నములు చేయుచున్నారు. ఆ బ్రహ్మపదమును అనుగ్రహించు విద్య :గాయత్రీ మహావిద్య"
" న గాయత్ర్యా: పర: మంత్ర: న మాతు: పరా దేవతా "
గాయత్రీ కంటే గొప్ప మంత్రము, తల్లికంటే గొప్పదేవత సృష్టిలో లేదు.
ఓం భూర్భువస్సువః
తత్సవితుః వరేణియం
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్
       ఈ గాయత్రీ మంత్రమున ఇరవైనాలుగు అక్షరములతో పాటు ఇరవైనాలుగు దేవతమూర్తుల శక్తి అంతర్హితమై వుంటుందని గాయత్రీ మంత్రోపాసకులు ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించటం వలన ఆ ఇరవైనాలుగు దేవతల ఆశీస్సులు, శక్తియుక్తులు చేకూరుతాయని తాంత్రిక గ్రంధాలు అభివర్ణిస్తున్నాయి.
ఇరవై నాలుగు గాయత్రీమూర్తులకు చతుర్వింశతి గాయత్రీ అని పేరు.
ఇరవైనాలుగు అక్షరములు - దేవతలు
1. తత్ – గణేశ్వరుడు- వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.
2. స - నృసింహ భగవానుడు: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.
3. వి - విష్ణుదేవుడు: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.
4. తుః - శివదేవుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.
5. వ - కృష్ణ భగవానుడు: యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.
6. దే - రాథా దేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.
7. ణ్యం - లక్ష్మీదేవి: ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.
8. భ - అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.
9. ర్గః – ఇంద్రదేవుడు- మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.
10. దే - సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.
11. వ - దుర్గాదేవి: దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
12. స్య - హనుమంతుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.
13. ధీ – పృధ్వీదేవి-భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.
14. మ - సూర్యదేవుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.
15. హి - శ్రీరాముడు: ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.
16. ధి - సీతామాత: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.
17. యో - చంద్రదేవుడు: శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.
18. యో - యమదేవుడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.
19. నః - బ్రహ్మదేవుడు: సకల సృష్టికి అధిష్ఠాత.
20. ప్ర - వరుణదేవుడు: భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.
21. చో - నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.
22. ద - హయగ్రీవ భగవానుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.
23. యా - హంసదేవత: వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.
24. త్ - తులసీదేవి: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.
       ఇంతటి మహిమాన్వితం, దివ్యశక్తి గల ఈ మంత్రాన్ని ఉచ్చరించటంలో స్వర, వర్ణ, లోపం ఉండిన హాని కలుగుతుంది.
      గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. గాయత్రి అనే పదము 'గయ' మరియు 'త్రాయతి' అను పదములతో కూడుకుని ఉన్నది. "గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించెను. 'గయలు' అనగా ప్రాణములు అని అర్థము. 'త్రాయతే' అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించునది గాయత్రి.
       వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమునుచేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీ మద్రామాయణమును రచించినారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి