26, మార్చి 2024, మంగళవారం

శివాలయంలో నంది ఎందు కుంటుంది? నంది కొమ్ముల మధ్య నుండి శివుని చూడమంటారెందుకు?*

*ప్ర : శివాలయంలో నంది ఎందు కుంటుంది?  నంది కొమ్ముల మధ్య నుండి శివుని చూడమంటారెందుకు?*
జ: ఆగమశాస్త్ర ప్రకారం దేవాలయంలోని స్వామివారి వాహనం స్వామి ముందు ఉండాలి. శివుని వాహనం కనుక నంది ఉంటుంది. అంతేకాక శివగణాలకు అతి ముఖ్య నాయకుడు నంది - వృషభం. ఇది ధర్మానికి సంకేతం. సత్యం, అహింస, అస్తేయం (అక్రమార్చన లేకపోవడం), శౌచం (శుచి) - ఈ నాలుగు పాదాలతో ఉండే ధర్మమే వృషభం. దైవం ధర్మాన్నే అధిష్ఠించి ఉంటాడు. ధర్మం ద్వారానే భగవంతుని చూడగలం. ధర్మహీనుని దైవం అనుగ్రహించడు. ధర్మమే భగవత్సాక్షాత్కారానికి మూలం అని తెలియజేసేందుకే, నంది కొమ్ముల మధ్య నుండి శివుని చూడమంటారు. అంతేకాక ప్రతివారూ భ్రూమధ్యంలో (కనుబొమ్మల నడుమ) జ్యోతిర్లింగ స్వరూపునిగా శివుని ధ్యానించడం ఉత్తమ మార్గమని ఉపనిషత్తులు చెప్తున్నాయి. కొమ్ముల మధ్య నుండి చూడడం ఈ విధానాన్నే ఉపదేశిస్తుంది.

*ప్ర : గుళ్ళను దేవుడు రక్షించడెందుకు?*
జ : దేవతలు తమకు తాముగా ఏమీ చేయరు. ఈ గుళ్ళు, గోపురాలు వారు కట్టుకోలేదు; కట్టమని కోరలేదు. మానవుడు తన కోసం నిర్మించుకొన్నాడు. కాపాడుకోవటం కూడా తన బాధ్యతే. దేవుడు సాక్షిమాత్రుడు. కట్టినవాడికి పుణ్యమిస్తాడు. పడగొట్టినవాడికి పాపమిస్తాడు. ఆయా పాపపుణ్యఫలాలను పరిపక్వకాలంలో అనుభవిస్తారు. ఒకడెవడో తనకు గుడి కట్టాడుగదా అని దేవుడక్కడ కాపలా ఉండి ఆలయ నాశకులను శిక్షిస్తూ ఉండడు. పూజలు చేస్తే కోరికలు తీరుస్తాడు. పాపములు చేస్తే కాలాంతరమున ఫలం అనుభవింపజేస్తాడు.
తనను రక్షించుకోలేనివాడు, తన గుడిని నాశనం చేస్తుంటే, దోచుకొంటుంటే చూస్తూ ఊరుకొన్నవాడు (ఇక) భక్తులనేమి కాపాడతాడు - అనేది ఆధునిక వాదన.
దీనికి జవాబు : భక్తితో ప్రార్థించిన వారి కోరికలను తీర్చగలడు. తన గుడిని రక్షించుకోవాలని మాత్రం సంకల్పించడు. ఎందుకంటే, ఆయనకు (తనవే అయిన) సంకల్ప వికల్పములు లేవు. కోరగల భక్తుడు, పిలువగల భక్తుడు, ఆవాహన చేయగల భక్తుడు పిలిస్తే, కోరితే, గుడిని రక్షించమంటే ఆ భక్తుని కోసం రక్షిస్తాడు; తన కోసం మాత్రం కాదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి