24, ఫిబ్రవరి 2024, శనివారం

లవకుశులు తర్వాత రాముని వంశం

చాలామంది కి లవకుశల తరువాత రాముడి వంశం గురించి పెద్దగా తెలియదు. రామ లక్ష్మణ భరత శత్రుఘనుల సంతానం వారి భార్యలు, గురించి విపులంగా తెలుసుకుందాం... ఆ తరువాత వారి వంశం ఎలా సాగిందో కూడా వివరిస్తాను. పోతనగారి భాగవతం లో నవమస్కందంలో కుశలవుల అనంతర రఘువంశం వివరంగా లిఖించారు. వాల్మీకి రాసిన ఆనంద రామాయణం అనే కావ్యంలో వివాహకాండలో రామలక్ష్మణభరతశత్రుఘ్నుల కుమారుల వివాహల గురించి వివరంగా చెప్పబడింది.

శ్రీరాముడు ఏకపత్నివ్రతుడు అయినప్పటికి తన కుమారులకు, తన తమ్ముళ్ల కుమారులకు ఇద్దరేసి భార్యలు ఉన్నారు.

1). శ్రీరాముడు...సీతాదేవి వీరి కుమారులలో పెద్ద కుమారుడు కుశుడు మరియు చిన్న కుమారుడు లవుడు. కుశుడు కి ఇద్దరు భార్యలు...చంపిక మరియు కుముద్వతి ఈమె నాగకన్య ఈమెకు మరో పేరు కంజాననా. వీరి కుమారుడు అతిధి ద్వారా రఘువంశం వృద్ధి చెందింది. లవుడు భార్య పేరు సుమతి. వీరి సంతానం వివరాలు తెలియరాలేదు.

2). భరతుడు ... మాండవిల పుత్రులు పుష్కరుడు, తక్షుడు.
పుష్కరుని భార్యలు కళావతి(నాగకన్య) మరియు చంచల (గంధర్వ కన్య)
తక్షుడు భార్యలు కాళిక (నాగకన్య ) మరియు చపల (గంధర్వ కన్య).

3). లక్ష్మణ... ఊర్మిళల పుత్రులు
అంగదుడు, చంద్రకేతుడు 
అంగదుని భార్యలు కంజాక్షి (నాగకన్య ),
చంద్రిక (గంధర్వకన్య )
చంద్రకేతుడు భార్యలు కంజాగ్రీ (నాగకన్య), చంద్రాసన (గంధర్వకన్య).

4). శత్రుఘ్నుడు... శృతకీర్తిల పుత్రులు సుబాహుడు మరియు శృతసేనుడు 
సుబాహుని భార్యలు కమల (నాగకన్య),
అచల (గంధర్వకన్య).
శృతసేనుడు భార్యలు మాలతి (నాగకన్య), మదనసుందరి (గంధర్వకన్య).

మొత్తం 16 మంది కోడళ్ళుకు, 120 మంది మనుమళ్లు, 24 మంది మనుమరాళ్లు కలిగారు.
వీరంతా వివిధ రాజ్యాలు స్థాపించుకుని అప్పటి భూమాండలామంతటా విస్తరించారు.

వీరందరి వివాహాలు శ్రీరాముని ఆధ్వర్యంలోనే జరిగినవి. సీతానిర్యాణానంతరం నిత్య యోగాలు యజ్ఞాలు జరిపిస్తూ కఠోర బ్రహ్మ చర్యంతో 11,000 అహోరేవ వత్సరాలు పరిపాలించాడు. అహోరేవ వత్సరాలంటే ఎమిటో తెలుసుకుందాం " ఒక రాజు ధర్మనిష్ఠతో చేసే పాలనలో ఒకరోజు.. ఒక సంవత్సరానికి సమానం". ("for a Maharaja, a person who lives in accordance with dharma, a day is equivalent to a year") అనే సూత్రం ప్రకారం రాజులు చేసిన రాజ్యపాలనని అహోరేవ వత్సరాలతో చెప్తారు. అహోరేవ వత్సరాలని 360 చేత భాగిస్తే సౌరమాన వత్సరాలు వస్తాయి. 11,000/360=30.55
అనగా శ్రీరాముడు ముప్పై సూర్యమాన సంవత్సరాలు పరిపాలించాడు.

ఇకపోతే శ్రీరాముని ప్రధమ పుత్రుడు కుశుడు ద్వారా రఘువంశం ఏవిధంగా వృధి చెందినదో పోతన భాగవతం ఆధారంగా తెలుసుకుందాం. వీరి వంశం కురుక్షేత్ర సంగ్రామం వరకు మనుగడలో ఉంది.

శ్రీరామునికి కుశుడు; కుశునికి అతిథి; అతిథికి నిషధుడు; నిషధునికి నభుడు; నభునికి పుండరీకుడు; పుండరీకునికి క్షేమధన్వుడును; క్షేమధన్వునికి దేవనీకుడును; దేవానీకునికి అహీనుడు; అహీనునికి పారియాత్రుడు; పారియాత్రునికి బలుడు; బలునికి చలుడు; చలునికి సూర్యాంశతో పుట్టిన వజ్రనాభుడు; వజ్రనాభునికి శంఖణుడు; శంఖణునికి విధృతి; విధృతికి హిరణ్యనాభుడు పుట్టారు. అతడు జైమిని శిష్యుడైన యజ్ఞవల్క మహర్షి నుండి అధ్యాత్మయోగం నేర్చుకొని హృదయంలోని కలతలు అన్నీ విడిచిపెట్టి యోగం ఆచరించాడు. ఆ హిరణ్యనాభునికి పుష్యుడు; పుష్యునికి ధ్రువసంధి; ధ్రువసంధికి సుదర్శనుడు; సుదర్శనునికి అగ్నివర్ణుడు; అగ్నివర్ణునికి శీఘ్రుడు; శీఘ్రునికి మరువు అనె రాజశ్రేష్ఠుడు జన్మించారు. ఆ రాజర్షి యోగసిద్ధి పొంది కలాపగ్రామంలో ఇప్పటికి ఉన్నాడు. కలియుగం చివరలో నాశనమైపోయే సూర్యవంశాన్ని మరల ప్రతిష్టిస్తాడు. ఆ మరువునకు ప్రశుశ్రుకుడు; ఆ ప్రశుశ్రుకునికి సంధి; అతనికి అమర్షణుడు; ఆ అమర్షణునికి మహస్వంతుడు; ఆ మహస్వంతునికి విశ్వసాహ్యుడు; ఆ విశ్వసాహ్యునికి బృహద్బలుడు పుట్టారు. ఆ బృహద్బలుడు భారతయుద్ధంలో అభిమన్యుని చేతిలో మరణించాడు.....🙏

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి