24, ఫిబ్రవరి 2024, శనివారం

హంస

*హంస రాజస లక్షణాలున్న నీటి పక్షి. అందువల్ల రాజహంస అనీ పిలుస్తారు. సంస్కృతంలో మరాళం అంటారు. తెలుగులో తెలిపిట్ట, చక్రాంగన, శ్వేతగరుత్తు అనే పేర్లున్నాయి. భారతీయ ధర్మం హంసకు పరమోన్నత స్థానాన్నిచ్చి గౌరవించింది.* వేదకాలం నుంచి హంస గొప్పతనం అనేక రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంచుమించు ప్రతి వైదిక సాహిత్యంలోను, పురాణ కథల్లోనూ హంస ప్రస్తావన ఉంటుంది. దేవతల్లో ఒక్కొక్కరికీ ఒక్కో వాహనం ఉంది. భార్యాభర్తలైన బ్రహ్మదేవుడు, సరస్వతి ఇద్దరికీ- హంసే వాహనం.

భారతీయ ఆధ్యాత్మిక చింతనలో హంసను జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. వేదాల్లో హంస గాయత్రీ మంత్రం ప్రసిద్ధి చెందింది. అథర్వణ వేదానికి అనుబంధంగా ఉన్న 31 ఉపనిషత్తుల్లో హంసోపనిషత్తు ఒకటి. వేదాలు, శాస్త్రాల్లో అత్యున్నత స్థాయికి చేరినవారిని *'పరమహంస'* అని ప్రస్తుతిస్తారు.

వేదాంత బోధనపరంగా *హంసకు విశేష స్థానం ఉంది. నీళ్లలో విహరిస్తున్నప్పటికీ హంస రెక్కలు తడవవంటారు. అలాగే సంసార సాగరంలో చిక్కుకున్నప్పటికీ, మనిషి ఏ మమకారానికీ లోనుకాకుండా జీవించాలని చెబుతారు.* హంసకు పాలను, నీటిని వేరుచేసే సామర్థ్యం ఉందంటారు. నిజానికి పాలు నీరు కలిసిన మిశ్రమంలో నుంచి పాలను మాత్రమే తాగి నీటిని పాత్రలో వదిలేస్తుందట. అలాగే మంచిచెడుల మిశ్రమమైన జీవన గమనంలో మంచిని స్వీకరించి, చెడును విడిచిపెడితే జీవితం సుసంపన్నం అవుతుందని పెద్దలు చెబుతారు. పై రెండు ఉదాహరణలకు సంకేతంగా హంసలా జీవించాలని చెబుతారు. *యోగశాస్త్రం ప్రకారం హంస ఉచ్ఛ్వాస, నిశ్వాసాలకు ప్రతీక. లోనకు పీల్చే గాలిని (ఉచ్ఛ్వాసాన్ని) 'హం' అని, బయటకు విడిచిపెట్టే ఊపిరిని (నిశ్వాసాన్ని) ‘స’ అనీ అంటారు. అందుకే మనిషి ఊపిరి ఆగిపోయినప్పుడు 'హంస ఎగిరిపోయింది' అంటారు....🙏

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి