26, మార్చి 2024, మంగళవారం

శివాలయంలో నంది ఎందు కుంటుంది? నంది కొమ్ముల మధ్య నుండి శివుని చూడమంటారెందుకు?*

*ప్ర : శివాలయంలో నంది ఎందు కుంటుంది?  నంది కొమ్ముల మధ్య నుండి శివుని చూడమంటారెందుకు?*
జ: ఆగమశాస్త్ర ప్రకారం దేవాలయంలోని స్వామివారి వాహనం స్వామి ముందు ఉండాలి. శివుని వాహనం కనుక నంది ఉంటుంది. అంతేకాక శివగణాలకు అతి ముఖ్య నాయకుడు నంది - వృషభం. ఇది ధర్మానికి సంకేతం. సత్యం, అహింస, అస్తేయం (అక్రమార్చన లేకపోవడం), శౌచం (శుచి) - ఈ నాలుగు పాదాలతో ఉండే ధర్మమే వృషభం. దైవం ధర్మాన్నే అధిష్ఠించి ఉంటాడు. ధర్మం ద్వారానే భగవంతుని చూడగలం. ధర్మహీనుని దైవం అనుగ్రహించడు. ధర్మమే భగవత్సాక్షాత్కారానికి మూలం అని తెలియజేసేందుకే, నంది కొమ్ముల మధ్య నుండి శివుని చూడమంటారు. అంతేకాక ప్రతివారూ భ్రూమధ్యంలో (కనుబొమ్మల నడుమ) జ్యోతిర్లింగ స్వరూపునిగా శివుని ధ్యానించడం ఉత్తమ మార్గమని ఉపనిషత్తులు చెప్తున్నాయి. కొమ్ముల మధ్య నుండి చూడడం ఈ విధానాన్నే ఉపదేశిస్తుంది.

*ప్ర : గుళ్ళను దేవుడు రక్షించడెందుకు?*
జ : దేవతలు తమకు తాముగా ఏమీ చేయరు. ఈ గుళ్ళు, గోపురాలు వారు కట్టుకోలేదు; కట్టమని కోరలేదు. మానవుడు తన కోసం నిర్మించుకొన్నాడు. కాపాడుకోవటం కూడా తన బాధ్యతే. దేవుడు సాక్షిమాత్రుడు. కట్టినవాడికి పుణ్యమిస్తాడు. పడగొట్టినవాడికి పాపమిస్తాడు. ఆయా పాపపుణ్యఫలాలను పరిపక్వకాలంలో అనుభవిస్తారు. ఒకడెవడో తనకు గుడి కట్టాడుగదా అని దేవుడక్కడ కాపలా ఉండి ఆలయ నాశకులను శిక్షిస్తూ ఉండడు. పూజలు చేస్తే కోరికలు తీరుస్తాడు. పాపములు చేస్తే కాలాంతరమున ఫలం అనుభవింపజేస్తాడు.
తనను రక్షించుకోలేనివాడు, తన గుడిని నాశనం చేస్తుంటే, దోచుకొంటుంటే చూస్తూ ఊరుకొన్నవాడు (ఇక) భక్తులనేమి కాపాడతాడు - అనేది ఆధునిక వాదన.
దీనికి జవాబు : భక్తితో ప్రార్థించిన వారి కోరికలను తీర్చగలడు. తన గుడిని రక్షించుకోవాలని మాత్రం సంకల్పించడు. ఎందుకంటే, ఆయనకు (తనవే అయిన) సంకల్ప వికల్పములు లేవు. కోరగల భక్తుడు, పిలువగల భక్తుడు, ఆవాహన చేయగల భక్తుడు పిలిస్తే, కోరితే, గుడిని రక్షించమంటే ఆ భక్తుని కోసం రక్షిస్తాడు; తన కోసం మాత్రం కాదు.

ఆలయం ముందు ధ్వజ స్తంభం ఎందుకు ఉంటుంది..?

ఆలయం ముందు ధ్వజ స్తంభం ఎందుకు ఉంటుంది..? 

🌺ధ్వజం అనగా పతాకమని, స్తంభం అనగా ఆ పతాకాన్ని ఎగరవేయడానికి ఉపయోగించబడే ఒక కర్ర లేదా వృక్షం అని అర్థం. హైందవ సంస్కృతిలో ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసిన తరువాత దైవదర్శనం చేసుకోవటం ఒక ఆచారం. మూల విరాట్టు దృష్టికోణానికి ఎదురుగా దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు.

🌺ప్రతి దేవాలయంలోనూ ప్రధాన రాజ గోపురం దాటి లోపల కి వెళ్లగానే ముందుగా కనిపించేది ఒక పెద్ద స్తంభం. ఆ స్తంభానికి పై భాగంలో బంగారు, వెండి తొడుగులతో కూడిన అలంకారము మరియు కొన్ని గంటలు వేలాడుతుంటాయి. ఈ స్తంభాన్ని ఆధ్యాత్మిక భాషలో ధ్వజస్తంభం అంటారు. 

🌺ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా విగ్రహ ప్రతిష్ఠతో సమానంగా భావిస్తారు. మూలవిరాట్టుకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాధాన్యమిస్తారు. ఆలయమనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారు. ఆలయ ప్రాకారాలు చేతులవంటివి.

🌺నిత్యహారతులు జరిగే దేవాలయాలలో షోడశోపచార పూజావిధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి. దీపారాధనలు, నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి. ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది. లేకపోతే అవి మందిరాలు అవుతాయి. ఆలయంలోనికి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించకుండా మూలవిరాట్టును చూడకూడదు. ధ్వజస్తంభం లేని దేవాలయాలకు స్వాములు, సన్యాసులు దేవాలయ గుర్తింపు ఇవ్వరు. 

🌺ధ్వజస్తంభానికి జీవధ్వజం అని మరో పేరు. దీనిని దారు బేరం అని కూడా అంటారు. విగ్రహాల అనుష్ఠాన, అర్చనల వల్ల భగవంతుని చూపు ఈ ధ్వజస్తంభానికి తగులుతుంది. అందువల్ల ఈ స్తంభానికి పవిత్రతతో పాటు, శక్తి కూడా లభిస్తుంది. 

🌺ధ్వజస్తంభానికి కూడా బలిహరణాలు, అర్చనలు జరుగుతుంటాయి. ధ్వజస్తంభం నిడివి 12 అంగుళాల నుంచి 24 అంగుళాల వరకు ఉండచ్చు. చెక్కతో తయారుచేసిన ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు వేస్తారు. కొన్ని కొన్ని దేవాలయాల్లో వెండితో, బంగారంతో కూడా తొడుగు చేయిస్తారు. 

ఎలా తయారు చేస్తారు ?
🌺పలాస (మోదుగ), అశ్వత్థ (రావి), బిల్వ (మారేడు), బంధూకం (వేగిస), పనస (పనస), వకుళ (బొగడ), అర్జున (మద్ది) వృక్షాలను ధ్వజస్తంభాల కోసం ఉపయోగించినట్లయితే అవి కొన్ని సంవత్సరాల పాటు నిలిచి ఉంటాయి. ఆలయంలో ఉత్సవాలు ప్రారంభించేటప్పుడు ధ్వజారోహణం చేస్తారు. అంటే జయపతాకను కట్టి పై వరకు ఎగురవేస్తారు. 

🌺ఉత్సవాలు అయిపోగానే పతాకాన్ని కిందకి దింపుతారు. దానినే ధ్వజావనతం అంటారు. వైష్ణవాలయాల్లో ఈ జెండా మీద గరుత్మంతుని చిహ్నం, శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నం, అమ్మవారి దేవాలయాల్లో సింహ చిహ్నం ఉంటాయి. కొన్ని దేవాలయాలలో రాతిధ్వజస్తంభాలు కూడా ఉన్నాయి. 

🌺గోపుర కలశం కంటే ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటే ఉత్తమం, కలశంతో సమానంగా ఉంటే మధ్యమం, కలశం కంటే తక్కువ ఎత్తులో ఉంటే అధమంగా మన శాస్త్రాల్లో పేర్కొన్నారు. అంతేకాదు, భక్తులు ఆలయానికి చేరేసరికి వేళదాటి ఆలయం ద్వారాలు మూసివేస్తే దిగులు పడనవసరం లేకుండా ధ్వజస్తంభ దర్శనంతో దైవదర్శనం పొందిన ఫలితం వస్తుంది. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని మనపెద్దలు ఆలయాల్లో ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు.


🌹🌹🌹🌹🌹🌹