18, ఫిబ్రవరి 2024, ఆదివారం

కర్మ - జన్మ

 శాపం సత్వర ఫలాన్ని ఇస్తుంది


కర్మ - జన్మ  మల్లాది వెంకట కృష్ణమూర్తి.


శాపం తగలడం అనేది నిజం అని ఈ కింది సంఘటన ఋజువు చేస్తోంది. ఇది మాతృవాణి ఇంగ్లీష్ పత్రికలో షామ్ భట్ అనే అతను తన స్వానుభవాన్ని ఇలా రాసాడు.


షామ్ భట్ అనే బి.ఏ విద్యార్ధి పుత్తూరు వివేకానంద కాలేజ్లో చదువుతూండగా ఆ కాలేజి ప్రిన్సిపాల్  అయిన ప్రొఫెసర్ యం. ఎస్.అప్పాతో కాలేజీ మేగజైన్ విషయంలో పోట్లాట వచ్చింది. ఆవేశంలో అప్పా ముందే ఆ మేగజైన్ని ముక్కలు ముక్కలుగా చింపిపారేసాడు. అతను కాలేజీ చదువు పూర్తయ్యాక ఏ పని ఆరంభించినా దాన్నించి సరైన ఫలాలు అందడం లేదు. ఓరోజు షామ్ భట్ మాతా అమృతానందమయి దగ్గరకి తనకి కలిగే అపజయాల గురించి చెప్పుకోడానికి వెళ్ళాడు. ఆవిడ అతనేం మాట్లాడకుండానే కాలేజీలో జరిగిన సంఘటనని గుర్తు చేసి, అతనికి గురు శాపం తగిలిందని, ఆయన్ని కలిసి తను చేసిన అపరాధానికి క్షమాపణ వేడుకోమని సలహా చెప్పింది. రెండు రోజుల తర్వాత షామ్ భట్ తన ప్రొఫెసర్ యం. ఎస్. అప్పా ఇల్లు వెదుక్కుంటూ వెళ్ళాడు. ఆయన ఇతన్ని చూడగానే గుర్తు పట్టాడు. షామ్ భట్ తను ఆనాడు చేసిన పనికి పశ్చాత్తాపంతో క్షమాపణ కోరడానికి వచ్చానని చెప్పగానే అప్పాకి అతని మీద కోపం పోయింది. "ఇన్ని రోజులు నిన్ను తలచుకుని తిట్టుకోని రోజు లేదు. ఇప్పుడు నీ మీద నాకు కోపం పోయింది." చెప్పాడు ప్రొఫెసర్. ఆ తర్వాత షామ్ భట్ కు సంపాదనలో లోపం లేకుండా పోయింది.


వారిలో మన మీద కోపం నిలిచిపోయేంత లోతుగా మనం ఎవర్నయినా బాధించి ఉంటే, వారి మనసులోని బాధ ప్రకంపనలు మనల్ని వచ్చే జన్మలో వెంటాడి తాకుతాయి. ఒకోసారి ఈ జన్మలోనే అవి వచ్చి తాకచ్చు. కాబట్టి మనం అందులోంచి విడుదలవాలి అని అనుకుంటే మాత్రం, అవకాశం ఉంటే మనం మనస్థాపం కలిగించిన వారందరి దగ్గరకి వెళ్ళి క్షమాపణ చెప్పడం విజ్ఞత అవుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి