5, జులై 2025, శనివారం

తోమాల సేవ :-

 

తోమాల సేవ :-


ఈ సేవా టిక్కెట్లు ఆన్‌లైన్ లక్కీడిప్ లో,ఆఫ్‌లైన్ CRO ఆఫీసు లక్కీడిప్ కౌంటర్ ద్వారా సామాన్య భక్తులు పొందవచ్చు. పలుకుబడి కలిగిన వారు టీటీడీ బోర్డు చైర్మన్ లేదా CMO పేషీ ద్వారా..


ఈ సేవ ఖరీదు 220/- మాత్రమే. కాని గర్భగుడిలో షుమారుగా నలబై నిమిషాల పాటు స్వామి వారి ముందు కూర్చుని ఆ మూలవిరాట్టుకు పుష్ప మాలలతో అర్చక స్వాములు అలంకరించి హరతులు ఇవ్వడం చూస్తుంటే ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము. దర్శనం చేసుకుని బయటకు వచ్చినా మనం మళ్ళీ మామూలు స్థితికి చేరుకోవడానికి కొన్ని గంటలు పడుతుంది. 


సుప్రభాతం జరుగుతున్నంత సేపు ఈ తోమాల సేవకు వచ్చిన భక్తులను ధ్వజస్తంభం దగ్గర ఆపి తరువాత గర్భగుడిలోకి( ఆనంద నిలయం) మగ వారిని ఎడమ వైపు ఆడ వారిని కుడి వైపుగా లోపలకు పంపుతారు.ముందు ఉదయాస్తమాన సేవ టిక్కెట్ కలిగిన భక్తులను కూర్చోబెట్టి తర్వాత ముందుగా లైన్లో వచ్చిన వారిని కూర్చోబెడతారు. మీకు అవకాశం ఉంటే స్వామి వారి ముందు గదిలో ఓ మూల నిలబడి చూస్తుంటే...ఎందుకంటే కూర్చుని చూస్తుంటే మనకు పూర్తిగా భోగ శ్రీనివాసమూర్తికి జరిగే కార్యక్రమం కనపడదు.


మగవారు పంచె తప్పనిసరి.. షర్టు మరియు బనియన్ వేసుకోకూడదు. ఆడవారు సాంప్రదాయిక దుస్తులు దరించాలి.


మంగళ,బుధ,గురువారం మాత్రమే ఈ సేవ ఉంటుంది. మిగిలిన రోజుల్లో ఏకాంతంగా నిర్వహిస్తారు. 


* ఇదే విధంగా అర్చన కూడా ఉంటుంది. కాకపోతే ఈ సేవలో స్వామి వారి సహస్ర నామార్చన చదువుతారు.చివరకు హరతులు..


ఈ ముప్పై సంవత్సరాల కాలంలో ఓ ఇరవై సార్లకు పైగా సేవ చేసుకునే భాగ్యం స్వామి వారు కల్పించారు. మీరు నిరుత్సాహ పడకుండా నిరంతరం లక్కీడిప్ వేస్తునే ఉండండి.


ఒక్కటి మాత్రం నా అనుభవ పూర్వకంగా చెబుతున్నాను మీరు తన నిజమైన, ప్రియమైన భక్తుడు అని స్వామి వారు భావిస్తే మీరు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని దగ్గరగా కూర్చోపెట్టుకుని  మీతో అన్ని సేవలూ చేయించుకుంటారు.ఇది మాత్రం నిజం.


సుప్రభాతం తర్వాత..


తిరుమల ఆనందనిలయంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్టుకు ఉత్సవమూర్తులకు... ఇంకా ఇతర విగ్రహాలకు పుష్పమాలలతోను, తులసి మాలలతోను అలంకరించే కార్యక్రమాన్నే 'తోమాలసేవ' అంటారు. భుజాల మీదినుంచి వేలాడేట్లుగా అలంకరించే శ్రీవారి పుష్పాలంకరణ విధానాన్ని “తోళ్మలై" అంటారు. అదే “తోమాల"గా మారిందంటారు. తోళ్ అనగా భుజమని అర్థం.

ఆర్జితం చెల్లించిన భక్తులు కూడ ఈ సేవలో పాల్గొని దర్శించవచ్చు. అయితే సాయంత్రం పూట జరిగే తోమాలసేవ మాత్రం ఏకాంతంగా జరుగుతుంది. ఎవ్వరూ పాల్గొన వీలులేదు.


ఏకాంగి కాని లేదా జియ్యంగారులు పూల అరనుంచి సిద్ధంచేసిన పూలమాలను తీసికొనివచ్చి అర్చకులకు అందిస్తూ ఉండగా అర్చకులు శ్రీవారి నిలువెత్తు విగ్రహానికి పూలమాలల్ని అలంకరిస్తారు. ఈ సేవ సుమారు అర గంటసేపు జరుగుతుంది. ఈ అరగంట మనం స్వామి వారి ముందు కూర్చోవచ్చు.


సేవ చివర కర్పూర హారతి నక్షత్ర హారతి తో తోమాల సేవ పూర్తవుతుంది..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి