19, జులై 2023, బుధవారం

💫 శాపవిమోచనం 🎊

 💫 శాపవిమోచనం  🎊

➖➖➖➖➖➖➖✍️

-(అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గం - పుణ్యచరిత్ర)

🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️


🪷 ఒకప్పుడు పరమేశ్వరుని అంశతో జన్మించిన దూర్వాస మహాముని నిత్యమూ పరమశివుని అర్చించే నిమిత్తం ఒక అందమైన పూలవనం పెంచి, చేరువలో కుటీరం నిర్మించుకుని శివధ్యానంలో కాలం గడుపుతుండేవాడు.


🪷 ఇలావుండగా, ఒకనాడు 'కళాధరుడు', 'కాంతిశాలి' అనే యిరువురు గంధర్వులు ఆకాశమార్గాన దేవవిమానంలో వెళుతూ, ఆపూలవనం చూసి, అబ్బురపడి మనసునిలవక కిందకిదిగి అందులో ప్రవేశించారు. కళాధరుడు యిచ్ఛవచ్చినట్లు పూలను తుంచి, వాసన చూస్తూండగా, కాంతిశాలి ఒళ్ళుమరచి పూలమొక్కల్ని తొక్కుతూ వనమంతా తిరగసాగాడు. అలికిడికి కుటీరం నుండి బయటకువచ్చిన దూర్వాసుడు జరుగుతున్నది చూసి కోపంపట్టలేక వారిని జంతువులుగా భూమిపై పుట్టమని శాపంపెట్టాడు.


🪷 తెలియక జరిగిన తప్పిదమనీ, శాపవిమోచనమీయమనీ గంధర్వులు చేసిన అభ్యర్ధనలకు శాంతించిన దూర్వాసుడు... 'అరుణగిరి' ప్రదక్షిణంతో తిరిగి స్వస్వరూపాలు పొందగలరు' అని విమోచనమార్గం అనుగ్రహించాడు.


🪷 ఫలితంగా... ఒకరు అరుణగిరిని ఆవరించిన అడవులలో అందమైన పునుగుపిల్లి (కస్తూరిమృగం) గాను, మరొకరు పాండ్యదేశపు రాజధాని మదురై పట్టణంలో చక్కనైన గుర్రంగాను జన్మించారు. 


🪷 ఆదేశపు రాజైన వజ్రాంగదపాండ్యుడు ఆ గుర్రపు లక్షణాలకు ముచ్చటపడి దానిని తన రాజాశ్వంగా ఎంచుకున్నాడు. రాజైనవాడు వినోదంకోసం, అప్రమత్తత పెంచుకోవడం కోసం ఒంటరిగా అడవులకు వెళ్ళడం రివాజు. అలా ఒకనాడు వజ్రాంగదుడు మదురై పట్టణానికి చాలా దూరంగా దట్టంగాకమ్మిన అరుణగిరి అరణ్యాలలోకి తన రాజాశ్వాన్ని అధిరోహించి వేటకు వెళ్ళాడు. అప్పటికి 'అరుణగిరి' నానావిధ వృక్షజాతులతో కప్పబడి వన్యప్రాణులకు తప్ప మానవుల దృష్టికి మరుగైవుండేది. అలాంటి ప్రాంతంలో ధీరుడైన వజ్రాంగదుడు వేడుక తీర్చుకోవడానికై అడవిమృగాల కోసం  వెదకసాగాడు. ఎప్పటికో మధ్యాహ్నం దాటిపోయి, వేసారి వెనుదిరుగుదామ అనుకున్నంతలో ఒకపొద కదలికల వెనక మిలమిలమెరిసే కళ్ళతోదాగిన పునుగుపిల్లి అతని కంటబడింది. దానిని ప్రాణాలతో పట్టుకోవాలని ఆశించి, రాజు వల విసిరే వ్యవధిలోనే అపాయాన్ని కనిపెట్టిన ఆపిల్లి, నేర్పుగా తప్పించుకుని కనిపించి, కనుమరుగౌతూ గిరిని చుట్టుముట్టి పరుగిడసాగింది. పట్టువదలని రాజు అశ్వంపై దానిని వెంబడించగా, ప్రదక్షిణం పూర్తికావడంతో శాప విమోచనమై అది తూలిపడి తన శరీరాన్ని విడిచింది. విభ్రాంతుడై రాజు అశ్వంపైనించి దిగడంతో అతని గుర్రంకూడా నిలువునా కూలబడి ప్రాణం వదిలింది. మరుక్షణంలో వాటి శరీరాల్లోంచి వెలుగులీనుతూ యిరువురు గంధర్వులు బయటకురాగా అదేక్షణంలో రత్నాలు పొదిగిన దేవవిమానం వారిని తీసుకుపోయే నిమిత్తం ఆకాశం నించి వచ్చి ఆగింది.


🪷 ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్న రాజు ఆ దివ్యపురుషులను ఆపి, "సంగతేమిటో వివరించి సందేహ నివృత్తి చేయవలసింది" అని ప్రార్ధించగా వారు తమ శాపవృత్తాంతం అంతా చెప్పి...


🪷 "రాజా ! ఈ కనిపిస్తున్న గిరి ఎంతో మహిమాన్వితమైనది. సాక్షాత్తూ ఆదిదేవుడైన పరమేశ్వరుడే ఈ గిరిరూపంగా వెలసివున్నాడు. భక్తితోతప్ప దీని రహస్యాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. బ్రహ్మాది దేవతలు సైతం రోజూ ఉదయాన్నే చప్పుడు చేయకుండా వచ్చి దీనిని పూజించి వెళ్తుంటారు. అటువంటిగిరిని ప్రదక్షిణం చేసే భాగ్యం మాకు నీ కారణంగా కలిగి శాపవిమోచనమైంది" అని అన్నారు.


🪷 వెంటనే రాజు అంజలి ఘటించి.. "మహాత్మ్యమైన ఈ గిరిని మీతోపాటే ప్రదక్షిణం చేసిన నాకు ఏఫలితమూ కలగని కారణమేమిటి ? తెలుపవలసింది" అని వినయంగా అర్దించగా.. 


🪷 "రాజా ! ఈ గిరిప్రదక్షిణాన్ని వాహనంతోగాని, పాదరక్షలతోగాని చేయరాదు. నీవు అశ్వంపై ఉండిపోయావు. అలాకాక దీనిని మనసులో స్మరిస్తూ సవ్యదిశలో కాలినడకన ప్రదక్షిణం చేసినట్లయితే వారు ఏది కోరితే అది, చివరికి ఇంద్రపదవినైనా పొందగలరు" అని వివరించి, గంధర్వులు సెలవుతీసుకొని విమానం అధిరోహించి తమలోకాలకు వెళ్ళిపోయారు.


🪷 ఈ ఘటన బలంగా నాటుకున్న వజ్రాంగదుడు, ఇంద్ర పదవిని కోరుకుని సకల భోగాలను సౌఖ్యాలను తిరస్కరించి, రాజ్యాన్ని తరువాతివారికి ఒప్పజెప్పి, రోజుకు మూడుసార్లు చొప్పున మూడు సంవత్సరాలపాటు తదేక దీక్షతో గిరికి ప్రదక్షిణాలు చేయగా ఒక ముహూర్తాన అరుణగిరినాధుడు ప్రత్యక్షమై ఏంవరం కావాలో కోరుకొమ్మని అడిగాడు. అప్పటికి ఎన్నోరోజులుగా ఆ జ్ఞానతేజస్సును ప్రదక్షిణాలతో ఆరాధిస్తూ వుండడంవల్ల పక్వచిత్తుడైన రాజుకు ఆశలూ భయాలూ ఎండుమట్టల్లా రాలిపోయి, ఇంద్రపదవి కూడా గడ్డిపరకలా తోచి, తనకి అహంకార రహిత శాశ్వత సాయుజ్య మీయవలసిందని వేడి అరుణగిరిలో లీనమైపోయాడు.


*_🪷 నేడు 'అరుణాచలం' అని పేరుబడ్డ అరుణగిరి పుణ్యక్షేత్రం తమిళనాడుకు చెందిన తిరువణ్ణామలైలో వుంది. కోరికలీడేర్చే ఈ గిరిని దేశ విదేశీయులెందరో అగ్నిలింగంగా భావించి ప్రదక్షిణం చేస్తారు. నేటి ఈ ప్రదక్షిణమార్గపు మొత్తం చుట్టుకొలత 8 మైళ్ళు. (సుమారు 14 కి.మీ) అలనాడు పాండ్యరాజు వజ్రాంగదుడు మూడు సంవత్సరాలపాటు ప్రదక్షిణంగా నడవగా ఏర్పడిన మార్గమిది.

[4:58 pm, 18/07/2023] Satyam Sivam Group: ఈదారిలో ఇప్పుడు మనకు కనిపించే దేవాలయాలు, కొలనులు, విశ్రాంతి మంటపాలు మొదలైనవాటిలో కొన్ని ఆకాలంలో అతను నిర్మించినవే. వీటిలో దుర్వాస మహాముని ఆలయం కూడా మనకు కనిపిస్తుంది.!_*


ఓం అరుణాచలేశ్వరాయ నమః

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి