6, మే 2023, శనివారం

జ్ఞాన సిద్ధి, మోక్ష సిద్ధి... ఒకటేనా?

 జ్ఞాన సిద్ధి, మోక్ష సిద్ధి... ఒకటేనా?

✍🏻...దాసు కిరణ్‌

💫🌈💫🌈💫🌈


💐 జ్ఞాన సిద్ధిని గురించి వివరించే లోక ప్రసిద్ధమైన ఒక ఉపమానం వేదాంతంలో ఉంది. అదే... ‘రజ్జు సర్ప భ్రాంతి’. చీకటిలో తాడును చూసి ‘పాము’ అని భ్రాంతి చెందుతాం. ఆ భ్రాంతి కారణంగా భయం ఏర్పడుతుంది. ఇక్కడ పాము అంటే ‘నేను’ అనే భావన. ఆ భావన ఉన్నంత వరకూ... కోరికలు, బాధలు ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ‘జ్ఞాన సిద్ధి’ అనే వెలుగులో ‘నేను’ అనే భావన కరిగిపోయినప్పుడు (‘పాము కాదు తాడే’ అని తెలిసినప్పుడు) అవన్నీ పటాపంచలవుతాయి. నిరంతరం ఈ స్థితిలో ఉండడమే మోక్ష సిద్ధి. 


💐 జ్ఞాన సిద్ధి ఒక ఘటన. చాలా సందర్భాలలో అది ఆకస్మికంగా జరుగుతుంది. ఈ విషయంలో చాలా ప్రఖ్యాతి పొందిన ఉదంతం శ్రీ రమణ మహర్షిది. 


💐 ఆయనకు ఒక రోజు మధ్యాహ్నం... కొన్ని గంటల వ్యవధిలోనే ఆత్మతత్త్వం తెలిసిపోయింది. కానీ జ్ఞాన సిద్ధి చాలా నెమ్మదిగా జరిగిన సందర్భాలూ ఉన్నాయి. ఆకస్మికంగా జరిగినా, నెమ్మదిగా జరిగినా... జ్ఞానసిద్ధి కలిగిన తరువాత... ‘ఏదో జరిగింది’ అని మాత్రం కచ్చితంగా తెలుస్తుంది. అది ఎప్పుడు, ఎలా అవుతుందో ఎవరూ చెప్పలేరు. సృష్టి, స్థితి, లయ... వీటికి అదనంగా మరో రెండు పార్శ్వాలు ఉన్నాయంటారు. అవి.. మాయ, అనుగ్రహం. ఏ కొందరికో, ఎప్పటికో... కృప ద్వారా ‘మాయ’ అనే పొర తొలగిపోవడం జరుగుతుంది. 


💐 ఈత కొట్టడం వచ్చిన తరువాత... ఈత రాని స్థితి ఇక ఎప్పటికీ ఎలా ఉండదో... జ్ఞాన సిద్ధి పొందిన తరువాత పూర్వపు స్థితి ఉండదు. ఇది వినగానే... సాధకులకు తప్ప... చాలామందికి భయం కలుగుతుంది. ‘అదేమిటి? నేను లేకపోతే ఇంకేం ఉంటుంది? జీవితం అన్న తరువాత బాధలు ఉండడం సహజం. అన్నీ వదిలేస్తే జీవితానికి గమ్యం, సార్థకత ఏముంటాయి? బతుకు నిస్సారం అవుతుంది కదా?’... ఇలా సాగుతాయి ఆలోచనలు. 


💐 కుటుంబంలో ఎవరైనా ఆధ్యాత్మికత వైపు ఆసక్తి చూపిస్తూ ఉంటే... ‘సన్యాసుల్లో కలిసిపోతాడో ఏమిటో?’ అని కూడా భయపడుతూ ఉంటారు. ఈ ఆలోచనలకు కారణం అజ్ఞానం. నిజానికి జ్ఞానుల్లో సన్యాసుల కన్నా గృహస్తులే అధికం. జ్ఞాన సిద్ధి పొందిన తరువాత... సాధారణ జీవితాన్ని ఇంకా ఆనందంగా గడుపుతున్నవారు ఎంతోమంది ఉన్నారు. దీనికి శ్రీ రమణ మహర్షి ఒక ఉపమానం చెప్పారు... ‘‘కాలిన తాడు ఆకారం తాడులాగే ఉంటుంది, కానీ దానికి బిగువు ఉండదు. అలాగే జ్ఞానులను బంధాలు కట్టివెయ్యలేవు. కానీ బంధాలకు దూరంగా ఉండడం కూడా జరగదు’’ అని.


🔅"మనస్సు యొక్క స్వభావంపై స్థిరమైన మరియు నిరంతర పరిశోధన ద్వారా, మనస్సు ' నేను' సూచించే అది( తత్ ) కి రూపాంతరం చెందుతుంది; మరియు అదియే నిజానికి ఆత్మ ."


గంగాధరుని ఫాలభాగంపై విబూధి రేఖలు జీవాత్మ, ఆత్మ, పరమాత్మలకు సంకేతాలు. జీవాత్మ తనలోని ఆత్మ స్వరూపాన్ని తెలుసుకుని పరమాత్మతో కూడి ఉండాలన్నదానికి నిదర్శనం. జీవాత్మేపరమాత్మ అన్న సత్యాన్ని,

జ్ఞానాన్ని తెలియజేసేదే త్రినేత్రం. అది మనపాలిట జ్ఞాననేత్రం. వేదములు, పురాణ ములు ఏకకంఠముతో విభూతి మహిమను చాటి చెబుతాయి. భస్మస్నానము చేసినవారు సర్వతీర్ధ దర్శనం చేసినవారితో సమానం. భస్మధారణ చేసిన వారిని దుష్ట గ్రహములు, పిశాచములు, సర్వరోగములు, పాపములు సమీపించవు. ధర్మబుద్ధి కలుగుతుంది. బాహ్య ప్రపంచజ్ఞానము కలుగుతుంది. ఏ విధంగా అర్చించినా, ఏ రీతిగా అలంకరించినా, పరతత్వం ఒకటే. అందుకే లింగమూర్తికి అవయవాలు లేవు. ఈ సత్యాన్ని తెలియజేసే తత్వస్వరూపమే 'లింగ స్వరూపం🙏🏻

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి