12, జనవరి 2021, మంగళవారం

ఏమని ప్రార్థించాలి

 ప్రార్థన (ప్ర+ఆర్థన) అంటే చక్కగా వేడుకోవడం. ఈ వేడుకోలుకు అర్థం, పరమార్థం అనేవి రెండూ బొమ్మ బొరుసు లాంటివి. మనిషి ఈ ప్రపంచంలో సుఖంగా ఉండాలనుకోవడం, అందుకు తగ్గ వెసులుబాటుకోసం ప్రయత్నించడం సహజం. ధర్మంగా ధనం సంపాదించుకోవచ్చు. ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకోవచ్చు.


ధనం ఇంధనంలా దహించుకుపోతుంది. కోరికలు గుర్రాల్లా పరుగులు తీస్తూనే ఉంటాయి. ఈ విషయం ప్రతి మనిషికీ ఏదో ఒక రోజు అర్థం అవుతుంది. అప్పుడు ఈ భౌతికమైన సుఖాలు కేవలం తాత్కాలికమేనన్న ఎరుక కలుగుతుంది. వీటికి మించిన శాశ్వతానందం ఎక్కడుందన్న జిజ్ఞాస మొదలవుతుంది. గుండెలోతుల్లో నుంచి గంగాజలంలా పైకి లేచిన ఆ ఆకాంక్ష, ఒక ఆర్తనాదమై ఒక ఆవేదనారూపమై చెలరేగుతుంది. అదే ప్రార్థన!


దూడను ప్రసవించగానే గోమాత తన బిడ్డను ఆప్యాయంగా నాలుకతో నిమిరినట్టు, భగవంతుడు భక్తులను లాలించి, పాలిస్తాడు. పరమ ప్రేమస్వరూపుడైన భగవంతుడికి తన సంతానంపై ఉన్న అనంతమైన ప్రేమానురాగాలను వరాల రూపంలో అందిస్తాడు.


సాత్వికులైన ధ్రువుడు, ప్రహ్లాదుడు శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించగానే భౌతికమైన వాంఛలు తొలగి భగవంతుడి పాదసేవనం అనే పరమానందం కావాలని అడిగారు. తపస్సు చేసిన హిరణ్యకశిపుడు, రావణుడు అధికారం, ఆధిపత్యం కోరారు! కోరి తమ వినాశాన్ని వారే కొని తెచ్చుకున్నారు. పరుల సుఖాల్నే మన సుఖమని, విశ్వశ్రేయమే మనకూ శ్రేయోదాయకమని, బుద్ధిగా జీవించాలని త్రికరణ శుద్ధితో ఆ పరమాత్మకు చేసే విన్నపమే ప్రార్థన! అదే మన ఆధ్యాత్మిక ప్రగతికి తొలి సోపానం.


భగవంతుణ్ని సేవించే భక్తులను నాలుగు తెగలుగా చెబుతారు- ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. ఈ నలుగురిలో ఆయనకు చాలా దగ్గరివాడు జ్ఞాని అని గీతాచార్యుడు సెలవిచ్చాడు.


భగవంతుడు అన్నీ ఇచ్చాడు. అయినా, ఏదో తెలియని ఆరాటం గుండెల్లో ఆరడి చేస్తూనే ఉన్నది. కారణం ఏదో ఒకమూల స్వార్థపిశాచం పీడించడం వల్లే అలా మనసు అల్లాడుతూ ఉంటుంది. మనం చేయవలసినదేదో శక్తివంచన లేకుండా, సక్రమంగా చేస్తే చాలు... తక్కినదంతా ఆయనే చూసుకుంటాడు. ఆ మాట కూడా గీతాచార్యుడు చాలా స్పష్టంగానే చెప్పాడు. అయినా అజ్ఞానం, అహంకారం, మమకారం... ఈ మూడూ ఏకమై మనల్ని పెడదారికి ఈడుస్తూ ఉంటాయి.


అలా జరగకుండా మనసును నిర్మలంగా ఉంచమని, ప్రపంచాన్ని ప్రేమగా చూడగల హృదయ సౌందర్యాన్ని ప్రసాదించమని, పరోపకారం వైపు బుద్ధిని మరల్చమని, మాటలకందని మౌనభాషలో భగవంతుణ్ని వేడుకోవడమే నిజమైన ప్రార్థన. ఆ ప్రార్థన సన్నని వెలుగై మన జీవితాలను గమ్యంవైపు నడిపిస్తుంది. ‘సర్వేజనాః సుఖినో భవంతు’ అనే ఒక గొప్ప ప్రార్థనను వేదం ప్రపంచానికి అందించింది. అదే మన జీవితాలకో దారిదీపమై వెలుగు చూపాలని అర్థించాలి. అదే మనం చేయవలసిన ప్రార్థన!

- ఉప్పు రాఘవేంద్రరావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి