19, జూన్ 2025, గురువారం

"ఋణాను బంధం"

 "ఋణాను బంధం"

                  

పూర్వకాలమందు ధారానగరంలో ధర్ముడు అనే చెప్పులు కుట్టేవాడు ఉండేవాడు.చెప్పులు కుట్టి అమ్ముకోవటమే కాకుండా ధర్ముడికి రాత్రివేళ నగరంలో గస్తీ తిరిగే తలారి పని కూడా ఉన్నది. గస్తీ అంటే రాత్రంతా మేలుకొని నగరమంతా తిరిగి ఝూము ఝాముకీ "దొంగలు వస్తారు. జాగ్రత్తగా ఉండండి" అని ప్రజలను హెచ్చరించడం అన్నమాట. ధర్ముడికి కాలక్షేపం బాగానే జరుగుతున్నది. కానీ ఎన్నాళ్లకూ సంతానం లేదనే విచారం మాత్రం ఎక్కువగా బాధిస్తున్నది. ఆ ఊర్లోనే ఒక గొప్ప పండితుడు ఒకాయన ఉన్నాడు. ధర్ముడు గస్తీ తిరగటం ముగించుకొని ఇంటికి పోయే వేళ పండితుడు ఏటికి స్నానానికి వచ్చేవేళ ఒకటి. ఇలానే ఒక రోజున పండితుడు ఏటికి వచ్చేసరికి ధర్ముడు ఆయనకు దండం పెట్టి తనకు సంతానం కలిగేటట్టు జీవించమని ప్రార్థించాడు. దానికి పండితుడు "ధర్మన్నా? పిల్లలు లేరని ఎందుకోయీ విచారపడతావు?

"ఋణాను బంధ రూపేనా 

పశు,పత్నీ సుతాలయాః"

అన్నారు. అనగా "పెళ్ళాం, పిల్లలు,గొడ్డు, గోదా, ఇల్లు, వాకిలి ఇవన్నీ కేవలము ఋణానుబంధం వల్లనే వస్తాయి. ఋణం తీరిపోవడంతో పోతాయి".అని చెప్పి స్నానానికి వెళ్ళిపోయాడు. పండితుడు చేసిన బోధవల్ల ధర్ముడికి వైరాగ్యం కలగలేదు సరి కదా, ఒక ఉపాయం తట్టింది. నా సొమ్ము ఎవడైనా అనుభవించి దానికి ప్రతిఫలం ఇవ్వకపోతే వాడు నాకు ఋణపడతాడు. అప్పుడు వాడు నా కడుపున పుట్టి ఋణం తీర్చుకొనక తప్పదు కదా. ఈ విధంగా నాకు సంతానం కలగటానికి అవకాశం ఉన్నది. అని ధర్ముడు సంతోషించాడు. ఈ ఉద్దేశం మనసులో పెట్టుకొని ధర్మన్న తయారుచేసిన చెప్పుల జతలను తన వద్దకు వచ్చే వాళ్లకు డబ్బు పుచ్చుకోకుండా ఊరికే ఇద్దామని ప్రయత్నించాడు. ఆ వచ్చిన వాళ్ళు ఉత్త పుణ్యానికి నీ చెప్పులు పుచ్చుకొని నీ ఋణాన పడి ఉండటానికి మాకు ఏమంత గ్రహచారం అని మరొక చోటికి పోయి కొనుక్కునేవాళ్లు. ఇలాగ ధర్మన్న వద్దకు వచ్చే బేరాలన్నీ పైకి పోతూ వచ్చాయి. ఇది పని కాదనుకుని ధర్మాన్న మరొక ఉపాయం పన్నాడు. "ఊరుకీ ఏరుకీ మధ్యన ఇసుకపర్ర  ఇంచుమించు క్రోసున్నర దూరం ఉన్నది కదా. ఒక మంచి చెప్పుల జత ఆ మధ్య దారిలో పెట్టి వస్తాను. మిట్టమధ్యాహ్నం ఒక్కడైనా జోడు లేకుండా ఆ దారిని రాకపోతాడా. ఈ చెప్పుల జత తొడుక్కోకపోతాడా. ఇక ఆ తొడుక్కున్నవాడు నాకు ఋణ పడక ఏమి చేస్తాడు?" అని ఆలోచన చేశాడు.ఈ ఆలోచనతో ధర్మన్న ఉదయాన్నే కొత్త చెప్పుల జత ఒకటి పట్టుకు వెళ్లి ఇసుకపర్రలో నడిచే దారిలో పెట్టాడు.సాయంత్రం వెళ్లి చూస్తే ఎక్కడ పెట్టిన జోడు అక్కడనే ఉన్నది.ఎన్నాళ్లు చూసినా చెప్పులు ఎవరూ తోడుగుకొని పోయేటట్లు కనపడలేదు." అయ్యో! నాకైతే సంతానం ప్రాప్తి లేదు కాబోలు. లేకపోతే ఒక్కడు కూడా జోడు తొడుగుకొనక పోవడం ఏమిటి?నాకు ఋణ పడకపోవడమేమిటి?" అనుకుని ధర్ముడు నిరాశ చెందాడు. అయినా పట్టుదలగల ధర్మన్న మరి కొంతకాలం చూద్దామని నిశ్చయించాడు. మామూలు ప్రకారం చెప్పుల జత నడిచే దారిలో పెట్టి రోజు సాయంత్రం వెళ్లి అది ఏమైందో అని చూస్తూ ఉండేవాడు. ఒక రోజున అలానే సాయంత్రం పోయి చూసేసరికి ఆ చెప్పుల జత కనపడలేదు. "నేను వేసిన పాచిక ఇన్నాళ్లకు పారింది. నా అదృష్టం పండింది" అని అనుకుంటూ ధర్మన్న ఇంటికి వెళ్లి ఈ సంతోష వార్త భార్యతో చెప్పాడు.ఆమె ఈ మాట విని పొంగిపోయింది. అయితే ఇంతకు ఆ చెప్పుల జతను ఎవరు తీసుకున్నది ధర్మన్నకు తెలియలేదు. తెలుసుకోవాలని ఆదర్దా కూడా వాడికి లేదు. ఋణానుబంధాన్ని గురించి ధర్మన్నకు బోధ చేసిన పండితుడు ఒకనాడు జరుగురు పనిమీద పొరుగూరు వెళ్ళవలసి వచ్చింది. ఆయన పని చూసుకుని తిరిగి వచ్చేసరికి సరిగా మధ్యాహ్నం రెండు ఝాములు అయింది.పండితునికి చెప్పులు లేక పోవటం మూలాన అరికాళ్ళు చుర్రుమని బొబ్బలెక్కినాయి. అంతలో ధర్మన్న చెప్పుల జత కనబడగా ఇది దేవుడు చేసిన ఏర్పాటేనని భావించి పండితుడు ఆ జోడు తొడుకున్నాడు."ఎవడో మాదిగ వీటిని అమ్మకానికి తెచ్చి ఇక్కడ పెట్టి ఉంటాడు" అని అనుకుని చాలాసేపు ఎండలో వాడి కోసం ఎదురుచూస్తూ నించున్నాడు. కానీ ఎవరు ఆయనకు కనబడలేదు." సరే జోడు ఎవరు పెట్టింది ఊళ్లో కనుక్కొని డబ్బు ఇచ్చేయవచ్చునని" తలచి పండితుడు ఇంటికి చేరుకున్నాడు. సాయంత్రం ఊళ్లో మాదిగ వాళ్ళందరినీ వాకబు చేశాడు. కానీ వాళ్ళందరూ "మాకు తెలియదంటే మాకు తెలియదు" అనేసారు. తను చేసిన పని ఎక్కడ తెలిసిపోతుందో ననే భయం కొద్దీ ధర్ముడు కొన్నాళ్ల వరకు పండితుని కంటపడటమే మానేశాడు. చెప్పులు తాలూకు ఋణం ఎవరికి తీర్చుకోవాలో ఎంత ప్రయత్నించినా పండితుడికి తెలియక చాలా కించపడ్డాడు. మరి కొద్ది రోజులకు ఆయనకు జబ్బు చేసి పాపం మరణించాడు.ఋణం తీర్చుకోవడం కోసం పండితుడు ధర్ముడి భార్య కడుపున పడవలసి వచ్చింది. ధర్ముడి భార్య పున్నమి చంద్రుని వంటి మగ శిశువును కన్నది. గూడెంలో అందరూ సంతోషించి వేడుకలన్నీ జరిపారు. తల్లీ తండ్రీ పిల్లవాడిని చూసుకుని మురిసిపోయారు. వారికి సంగడని పేరు పెట్టారు. సంగడు క్రమంగా పెరిగి పెద్దవాడై తండ్రికి మల్లేని చెప్పులు కుట్టి బజారులో అమ్ముకుని వచ్చేవాడు. అలా అమ్ముకు వచ్చిన డబ్బు తండ్రికి ఇవ్వబోతే ధర్మన్న పుచ్చుకునేవాడు కాదు.

ఏమంటే కుమారుని వద్ద డబ్బు తీసుకున్నట్లయితే వానికి తనకు ఋణం తీరిపోతుందనీ, తీరిపోయినట్లయితే తనకు వాడు దక్కడని ధర్ముని భయం. ఈ రహస్యం ధర్ముడు భార్యతో కూడా చెప్పి కుమారుడు సంపాదించి తెచ్చిన సొమ్ము ఎన్నడూ తాకవద్దని హెచ్చరించాడు. పూర్వజన్మలో తను ఫలానా పండితుడు అన్న సంగతి సంగడికి తెలుసు. తను ధర్మడింట పుట్టడానికి గల కారణం కూడా తెలుసు. "ఎంత త్వరలో ఆ చెప్పుల ఋణం తీర్చుకుంటానా, అని ఎంత వేగంగా ఈ జన్మ చాలించుకుంటా"అని సంగడు ఆత్ర పడేవాడు. కానీ అతను సంపాదించు కొచ్చింది తల్లిదండ్రులు పుచ్చుకపోవడం వల్ల అనుకున్నంత త్వరగా తీరడం లేదు. ఇలా ఉండగా ధర్ముడు ఒకనాడు ఊరికి పోవాల్సి వచ్చింది అతను కుమారుడిని పిలిచి "నాయనా! నేను ఊరికి పోతున్నాను. రేపటి రాత్రి నా బదులు నువ్వు నగరంలో గస్తీ తిరిగి నాలుగు ఝాములి ప్రజలను మేల్కొలప వలసింది" అని చెప్పాడు. తండ్రి చెప్పిన ప్రకారం సంగడు ఆ రాత్రి నగరంలో గస్తీ తిరగటానికి వెళ్ళాడు. అతనికి తోడు వచ్చిన తలారి "సంగన్నా! ఇప్పుడు ఝాము రాత్రి అయింది. ప్రజలంతా నిద్రలో ఉన్నారు జాగ్రత్తగా ఉండమని కేక వెయ్యి" అన్నాడు. అప్పుడు సంగడి రూపంలో ఉన్న ఆ పండితుడు 

"మాతా నాస్తి పితా నాస్తి

నాస్తి బంధు సహోదరః

అర్థం నాస్తి గృహం నాస్తి

తస్మాత్ జాగ్రత్త! జాగ్రత్త!"

అని కంఠమెత్తి అందరికీ మెలకువ వచ్చేటట్టు శ్లోకం చెప్పాడు. కూడా వచ్చిన తలారికి ఆశ్చర్యం వేసి" ఈ శ్లోకానికి అర్థం ఏమిటి?" అని అడిగాడు. దానికి సంగడు " తల్లి లేదు, తండ్రి లేడు, చుట్టాలు, సోదరులు లేరు.ధనమూ లేదు, ఇల్లూ లేదు ఇవన్నీ ఉత్త మాయ.కనుక ఈ మాయ నుండి మేలుకొని జాగ్రత్తగా ఉండండి"అని అర్థం చెప్పాడు. సంగడు. ఈ వేదాంతం బోధించేసరికి రెండో ఝాము గడిచి పో వచ్చింది. అప్పుడు అతను 

"కామ క్రోధం లోభశ్చ

దేహే తిష్ఠన్తి తస్కరాః

జ్ఞానరత్నా పహారాయ

తస్మాత్ జాగ్రత్త!జాగ్రత్త!"

అని శ్లోకం చదివి మళ్లీ ప్రజల్ని మేల్కొలిపాడు. ఇతను ఇంత చదువు ఎప్పుడు చదివాడని తోటివానికి ఆశ్చర్యమై ఈ శ్లోకానికి అర్థం చెప్పమని కూర్చున్నాడు. "కామం, క్రోధం, లోభం అనే దొంగలు జ్ఞానమనే రత్నాన్ని అపహరించటం కోసం మన దేహంలో దాగి ఉన్నారు. జాగ్రత్త"అని సంగడు అర్థం చెప్పాడు. ఈ అర్థం వినే వరకు పక్కన ఉన్న తలారి వానికి ఆశ్చర్యం అనిపించింది. ఓయీ సంగన్నా నీ మాటలన్నీ విడ్డూరంగా ఉన్నాయి. ఇంతకాలం నుంచి మీ బాబు చెంబూ, తప్పేలా ఎత్తుకుపోయే దొంగలను గురించి చెప్పాడు. కానీ ఇటువంటి దొంగలను గురించి ఎప్పుడూ చెప్పనేలేదు. ఈ చిత్రాలు ఎప్పుడు నేర్చినావో గమ్మత్తుగా ఉన్నది" అంటూ ఆశ్చర్యాన్ని తెలిపాడు. మూడవ ఝాము గడిచేసరికి సంగడు మరొక శ్లోకం ఇలా చెప్పి ప్రజలను హెచ్చరించాడు. 

"జన్మ దుఃఖం జరా దుఃఖం

జాయా దుఃఖం పునః పునః

సంసారం సాగరం దుఃఖం

తస్మాత్ జాగ్రత్త! జాగ్రత్త!"

ఇది విని తోటివానికి మరీ ఆశ్చర్యం కలిగింది. "ఏమిటోయీ సంగన్నా! అన్ని రకాల దుఃఖాలు ఏకరు వు పెడుతున్నావు.వీటికి కూడా అర్థం చెబుదూ" అని అతను కోరగా దానికి సంగడు "జన్మ ఎత్తడం ఒక దుఃఖం. తరువాత భార్యతో ఉండడం ఒక దుఃఖం. ముసలితనం రాగానే అదొక దుఃఖం. ఇలా ఒక దానివెంట మరొక దుఃఖం వస్తువునే ఉంటుంది. అసలు దుఃఖము అనే కెరటాలతో కూడుకొని ఉన్న సంసారం అనే సముద్రమే అన్నిటికన్నా పెద్ద దుఃఖం. కనుక ఈ సంసార సాగరంలో పడిపోకుండా మేల్కొని జాగ్రత్తగా ఉండండి"అని హెచ్చరించాను అన్నాడు. దానికి తోటివాడు "మీ బాబు పిల్లను తెచ్చి నీకు పెళ్లి చేద్దామనుకుంటూ ఉంటే ఇలా మెట్ట వేదాంతం మొదలు పెట్టావేమిటి? అని అనే అంతలో నాలుగో ఝాము కూడా అయిపోవచ్చింది. అప్పుడు సంగడు

"ఆశారాం బద్ధతే లోకే

కర్మణా బహు చింతయా

ఆయఉః క్షీణం నజానాతి

తస్మాత్ జాగ్రత్త! జాగ్రత్త!"

అని శ్లోకం చెప్పి గస్తీ ముగించాడు. ఇది వినగానే తోటివాడు మరీ అబ్బురపడినాడు.సంగడి యొక్క జ్ఞానం, పాండిత్యం అతనికి విస్మయం కొలిపాయి. ఈ శ్లోకానికి కూడా అర్థం చెప్పమని తోటివాడు కోరేసరికి సంగడు" కర్మచేత, చింతచేత, ఆశచేత, ఈ లోకం బంధించబడుతున్నది. వీటిలో చిక్కుకుని పోయిన ప్రజలు క్షణక్షణానికి వారి ఆయువు క్షీణిస్తూ ఉన్న సంగతి కానలేకపోతున్నారు. ఈ సంగతి తెలుసుకొని అందరూ జాగ్రత్త పడాలి" అంటూ విప్పి చెప్పాడు. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుగారు సంగడి మొదటి చెప్పిన శ్లోకం విన్నాడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఇంకా ఏమైనా చెపుతాడేమోనని మేల్కొన్నాడు. అతనికి మిగతా మూడు శ్లోకాలు కూడా వినిపించినవి. తెల్లవారగానే రాజుగారు రాత్రి గస్తీ తిరిగిన తలారి వాడిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. సంగడు రాజావారి దర్శనానికి వెళ్లగానే ఆయన సంగడికి నమస్కరించి "మీరెవరో మహానుభావులు గానీ, సామాన్యులు కారు.తలారికేమిటి? ఇంత అద్భుతమైన పాండిత్యమేమిటి? నా యందు దయవుంచి ఈ కానుకను పుచ్చుకొని దీవించండి" అని అంటూ వరహాలతో నిండి ఉన్న ఒక సంచి అతనికి ఇచ్చారు. అయితే సంగడు ఈ ధనం ఏమి చేసుకుంటాడు? తనకు పని లేకపోయినా దీనిని తల్లిదండ్రులకు ఇచ్చి ఋణం తీర్చుకోవచ్చుననే ఉద్దేశంతో సంచి తీసుకున్నాడు. మరునాడు ఊరి నుంచి ధర్ముడు వచ్చాడు.

తను తెచ్చిన సొమ్ము తండ్రికి ఇద్దామంటే అతను ఏమిటా ఉపాయము అని ఆలోచిస్తూ ఉండగావాళ్ళ వీధిలో ఇళ్లు అంటుకున్నాయి. తలారి వాళ్లంతా సామానులు తగలబడి పోకుండా బయటపడవేస్తున్నారు. సంగడు కూడా ఇంటిలో నుంచి ఒక్కొక్క సామాన్య తెచ్చి తండ్రికి అందిస్తున్నాడు. ధర్ముడు వాటిని అందుకుని అవతల సర్దుతున్నాడు. ఈ సందడిలో సంగడు తను రాజుగారి వద్ద బహుమతి పొందిన వరాహల సంచి కూడా తండ్రికి అందించాడు ఆ కంగారులో "ఇదేమిటి?" అనే సందేహం పెట్టుకోకుండా తక్కిన  సామాన్లతో పాటు ఈ సంచి కూడా ధర్ముడు సర్దేశాడు. అంతటితో తన ఋణం తీరిపోయింది కదా అనే సంతోషంతో సంగడు ఆ జ్వాలలో పడి జన్మ చాలించుకున్నాడు. చివరకు కొన్నాళ్లయిన తర్వాత ధర్ముడికి ఈ సంగతులన్నీ ఒకటొకటి తెలిసి వచ్చాయి. పండితుని బోధ జ్ఞాపకం చేసుకుని అతడు కూడా జ్ఞానవంతుడైనాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి